Business News: ముంబై తర్వాత వ్యాపారం కేంద్రంగా హైదరాబాద్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. కేవలం ఐటీ మాత్రమే కాకుండా టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు దృష్టి హైదరాబాద్‌పై పడింది. తమ కొత్త కేంద్రంగా ఎంపిక చేసుకుంటున్నాయి కూడా. ఆ జాబితాలోకి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ చేరిపోయింది.
హైదరాబాద్‌పై నెట్‌ఫ్లిక్స్ కన్ను
ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరో ఆఫీసు భారత్‌లో ప్రారంభించనుంది. ఇప్పటికే ముంబై సిటీలో తొలి ఆఫీసు ఉంది. రెండో ఆఫీసు ఎక్కడని పరిశీలన చేస్తోంది. ఈ క్రమంలో రెండు నగరాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి బెంగుళూరు కాగా, మరొకటి హైదరాబాద్.
మాగ్జిమమ్ హైదరాబాద్ వైపు ఆ కంపెనీ మొగ్గు చూపినట్టు ఎంటర్‌టైన్‌మెంట్ వర్గాలు చెబుతున్నాయి. హైటెక్ సిటీలోని కాపిటాలాండ్ ITPH భవనంలోని బ్లాక్-Aలో 41,000 చదరపు అడుగుల కార్యాలయాన్ని రెంటుకు తీసుకోనుంది. ఆ భవనంలో వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ కొత్త ఆఫీసు ఓపెన్ చేయడం ద్వారా దక్షిణాది మార్కెట్‌పై దృష్టి సారించనుంది.
సెకండ్ ఆఫీసు ప్రారంభించేందుకు ప్రయత్నాలు
టాలీవుడ్‌తో ఆ కంపెనీకి ఉన్న అనుబంధాన్ని బలపరచడం దీని ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఫోకస్ అంతా దక్షిణాదిపై పడింది. ఈ ఆఫీసులో లోకల్ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్, టెక్నికల్ పనులు జరుగుతాయి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి కీలకంగా మారనుంది.
హైదరాబాద్ సిటీలో అనేక ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు కొదవలేదు. దీనికితోడు ప్రభుత్వం నుంచి సరైన సహకారం ఇవన్నీ నెట్ ఫ్లిక్స్ సంస్థను ఆకట్టుకుంది. నిర్మాణంలో ఉన్న ఇమేజ్ టవర్స్ వంటి ప్రాజెక్టులు సిటీని యానిమేషన్, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ముందుకు తీసుకెళ్తాయని భావిస్తోంది.
ALSO READ: స్వల్పంగా పెరిగిన బంగారం.. 10 గ్రాములు ఎంతంటే..?
నెట్‌ఫ్లిక్స్ ఆఫీసు వస్తే.. ఆ రంగానికి డిమాండ్ పెరగవచ్చని భావిస్తున్నారు. టెక్నికల్ సిబ్బంది, సినిమా వర్కర్లు, ఎడిటింగ్, గ్రాఫిక్స్ రంగాల వారికి ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని ఓ అంచనా. ఇటీవలికాలంలో ఎలి లిల్లీ, వెంగార్డ్, మెక్ డొనాల్డ్స్, జాన్సన్ & జాన్సన్, పి & జి, హైనికెన్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. వీటికితోడు అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.