Billionaire: అగ్రస్థాయికి చేరిన వ్యాపారవేత్తలు జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. కాసింతైనా అవగాహన లేకుండా నోరు జారితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. చివరకు ఓ బిలియనీర్ అదే జరిగింది. ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టినందుకు 9 బిలియన్ల డాలర్ల సంపద కోల్పోయాడు. ఇంతకీ ఆ బిలియనీర్? ఎక్కడ, ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
రష్యా బ్యాంక్ బిలియనీర్ ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్, 80 వేల కోట్ల నష్టం
రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని సామాన్యుల మొదలు ఉన్నతస్థాయి వ్యక్తుల వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ యుద్ధాన్ని రష్యాలో వ్యతిరేకించిన వారు చాలా మంది ఉన్నారు. అందులో మిలియనీర్లు, బిలియనీర్లు లేకపోలేదు. ఈ ఒక్కరూ బహిరంగంగా విమర్శించిన సందర్భం లేదు. కాకపోతే ఓ రష్యాలోని బ్యాకింగ్ బిలియనీర్ మాత్రం యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆపై ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టు ఆయనకు ఎంతలా నష్టం కలిగించిందంటే ఏకంగా రష్యా పౌరసత్వాన్ని మాత్రమేకాకుండా దేశం విడిచిపెట్టాడు.
టింకాఫ్ బ్యాంక్ ఫౌండర్ ఒలేగ్ టింకోవ్. రష్యాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఆయన కూడా ఒకరు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఒలేగ్ టింకోవ్ తీవ్రంగా విమర్శించారు. అందుకు సంబంధించి ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెట్టాడు. ఆ యుద్ధాన్ని బహిరంగంగా ఖండిస్తూ అదొక ‘పిచ్చి’ అని అభివర్ణిస్తూ రాసుకొచ్చాడు. దానివల్ల ఆయన వ్యక్తిగత సంపద 9 బిలియన్ల డాలర్లు నష్టపోయాడు. రష్యా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక టింకాఫ్ బ్యాంక్‌లో తన వాటాలో కొంత భాగానికి విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు మాజీ రష్యన్ బ్యాంకింగ్ దిగ్గజం ఒలేగ్ టింకోవ్.
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించడమే కారణం
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2022లో ఈ వ్యవహారం జరిగింది. క్రెమ్లిన్‌తో సంబంధమున్న అధికారులు బ్యాంకులో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించారు. చివరికి టింకోవ్ తన వాటాను అమ్ముకునేలా ఒత్తిడి చేశారు. ఎలాంటి బేరాలు ఆడలేకపోయారు. చివరకు రష్యా పౌరసత్వాన్ని కోల్పోయాడు, ఆ దేశం విడిచిపెట్టిన విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రికతో చెప్పుకొచ్చారు. టింకోఫ్ బ్యాంక్ మాతృ సంస్థ టిసిఎస్ గ్రూప్‌లో 35 శాతం వాటాను ఏప్రిల్ 2022లో విక్రయించారు.
ఫార్చ్యూన్ నివేదించిన ప్రకారం.. బలవంతపు అమ్మకం వల్ల దశాబ్దాలుగా తాను కూడబెట్టిన సంపద తుడిచి పెట్టుకుపోయిందని టింకోవ్ చెప్పారు. అల్టిమేటం ఇచ్చిన వారం రోజుల్లోనే తన వాటాను కొనుగోలు చేస్తున్నట్లు మరొక రష్యన్ వ్యాపారవేత్త ప్రకటించారు. టింకాఫ్ బ్యాంక్‌ను ప్రారంభించడానికి ముందు ఆహార ఉత్పత్తిదారు డారియా, టింకాఫ్ బీర్, రెస్టారెంట్‌ల వ్యాపారం చేశాడు. 2005లో తన మద్యం వ్యాపారాన్ని మరొక వ్యక్తికి విక్రయించాడు.
ALSO READ: పాన్-ఆధార్ లింకు నుంచి క్రెడిట్ స్కోర్ వరకు
ఆ వచ్చిన డబ్బుతో మరుసటి ఏడాది టింకాఫ్ బ్యాంక్‌ని ప్రారంభించాడు. ఆ తర్వాత అది ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ బ్యాంకులలో ఒకటిగా మారింది. 1990 ల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వ్యాపారం చేశారు. శాంతియుతంగా ఉండే పొరుగువారితో యుద్ధం మొదలుపెట్టి ప్రతీ రోజూ అమాయక ప్రజలను చంపే ఫాసిస్ట్ దేశంతో సంబంధం కలిగి ఉండలేనని తెంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన యూకె, ఇటలీలో నివాసం ఉంటున్నాడు.