Home Loan Charges: ప్రతి ఒక్కరూ వారి జీవితంలో తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని కలలు కంటారు. అయితే, ఇల్లు కొనుగోలు చేయడం లేదా కట్టుకోవడం అనేది భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ. అందుకే చాలా మంది హామ్ లోన్ తీసుకోవాలని భావిస్తారు. అయితే, గృహ రుణం తీసుకునే ముందు మాత్రం కొన్ని విషయాల గురించి తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం. హోం లోన్ తీసుకునే ముందు అందుకు సంబంధించిన ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దరఖాస్తు రుసుము (Processing Fee)
గృహ రుణం కోసం మీరు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ వద్ద దరఖాస్తు చేసుకున్నప్పుడు, దాన్ని ప్రాసెస్ చేయడానికి కొన్ని రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు రుణం మంజూరవుతుందా లేదా అన్న విషయంపై ఆధారపడదు. ఒకసారి మీరు ఫీజు చెల్లిస్తే, అది తిరిగి ఇవ్వడం చాలా కష్టం.
కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ ఫీజుగా ఉదాహరణకు రూ.10,000 నుంచి రూ. 25,000 వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని లోన్ మొత్తంలో శాతం (ఉదాహరణకు 0.25% – 1%) రూపంలో వసూలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఆయా సిబ్బందితో చర్చించే నైపుణ్యాలు కలిగి ఉంటే, ఈ ఫీజును తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా మాఫీ చేయించుకోవచ్చు.
తనఖా దస్తావేజు రుసుములు (Loan Agreement & Documentation Charges)
ఈ రుసుములు, రుణ ఒప్పంద పత్రాలను సిద్ధం చేయడం, వాటిని లీగల్‌గా ప్రాసెస్ చేయడం కోసం చెల్లించాల్సినవి. ఇది సాధారణంగా రుణ మొత్తం 0.1% – 0.5% శాతంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు పోటీగా ఉండటానికి ఈ ఛార్జీలను తగ్గించవచ్చు లేదా పూర్తిగా మాఫీ చేయవచ్చు. ఈ రుసుము మొత్తం రుణం పొందేందుకు మీరు మొత్తం చెల్లించాల్సిన ఫీజులో ప్రధాన భాగంగా ఉంటుంది.
చట్టపరమైన రుసుములు (Legal Fees)
బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీ కొనుగోలు చేసే ఆస్తి చట్టపరమైన విచారణ కోసం న్యాయవాదులను నియమిస్తాయి. దీనికి సంబంధించిన ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది. సాధారణంగా రూ.5,000 నుంచి రూ. 25,000 వరకు ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు, ఇప్పటికే వెరిఫై చేసిన ఆస్తులపై ఈ రుసుము తీసుకోకపోవచ్చు. మీరు నూతన గృహ ప్రాజెక్ట్‌లో ఇల్లు కొనుగోలు చేస్తున్నట్లయితే, డెవలపర్ ఇప్పటికే లీగల్ వెరిఫికేషన్ పూర్తి చేసుంటాడు. కాబట్టి అప్పుడు ఈ ఫీజు తగ్గే అవకాశం ఉంటుంది.
Read Also: 5G Smartphone Offer: టాప్ బ్రాండ్లకు పోటీగా కొత్త మోడల్.. .
నిబద్ధత రుసుములు (Commitment Charges)
రుణం మంజూరు అయిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధిలో రుణాన్ని ఉపసంహరించుకోకపోతే కొన్ని బ్యాంకులు నిబద్ధత రుసుమును వసూలు చేస్తాయి. ముఖ్యంగా, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ కోసం తీసుకునే రుణాల్లో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా 0.25% – 1% శాతం వరకూ ఉంటాయి. ముందుగా మీరు రుణ పంపిణీకి సంబంధించిన షెడ్యూల్‌ను స్పష్టంగా అర్థం చేసుకుని ముందుగానే దీనిపై చర్చించుకోవడం మంచిది.
ముందస్తు చెల్లింపు జరిమానా (Prepayment Penalty)
మీరు రుణాన్ని గడువుకు ముందే చెల్లిస్తే, బ్యాంకులకు రుణం మీద వడ్డీ రావడం తగ్గిపోతుంది. అందుకే ముందస్తు చెల్లింపుపై కొన్ని బ్యాంకులు జరిమానా వసూలు చేస్తాయి. ఫ్లోటింగ్ వడ్డీ రేటు గృహ రుణాలపై ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ముందస్తు చెల్లింపు జరిమానా ఉండదు. స్థిర వడ్డీ రేటు గృహ రుణాల (Fixed Rate Home Loans) పై సాధారణంగా 2% వరకు జరిమానా ఉండొచ్చు. మీ రుణ పరిమితిని పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా చెల్లించాలనుకుంటే, బ్యాంక్ షరతులను ముందుగా చదివి నిర్ణయం తీసుకోవాలి.
ఆస్తి మూల్యాంకన రుసుము (Property Valuation Fees)
బ్యాంకులు రుణాన్ని మంజూరు చేసే ముందు ఆస్తికి వాస్తవిక మార్కెట్ విలువ ఎంత ఉందో అంచనా వేయడానికి మూల్యాంకన సంస్థల సేవలు తీసుకుంటాయి. ఈ ఫీజు రూ. 3,000 నుంచి రూ. 10,000 మధ్య ఉండొచ్చు. ముఖ్యంగా పాత ఇళ్లను కొనుగోలు చేసే గృహ రుణాలపై ఇది తప్పనిసరిగా వసూలు చేస్తారు.
ఆస్తి బీమా ఖర్చు (Property Insurance Charges)
కొన్ని బ్యాంకులు గృహ రుణం తీసుకున్న వారికి ఆస్తి బీమా చేయడం తప్పనిసరి చేస్తాయి. ఈ బీమా రుసుము ఆస్తి విలువ, రుణ పరిమాణం, బీమా ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది. గృహ రుణ వ్యవధి మొత్తం బీమా కవరేజ్ ఉండేలా చూసుకోవడం అవసరం.
ఇతర రుసుములు (Miscellaneous Charges)
EMI బౌన్స్ ఛార్జీ – మీ EMI డెడక్షన్ ఫెయిల్ అయితే రూ.500 నుంచి రూ. 1,000 వరకు జరిమానా ఉండొచ్చు. రుణ పునఃస్థాపన ఛార్జీ (Loan Restructuring Fee) – మీ రుణ పరిమితి లేదా వడ్డీ రేటును మార్చుకోవాలంటే రూ. 5,000 నుంచి రూ. 25,000 వరకు ఛార్జీలు ఉండొచ్చు.
నాన్-మెయింటెనెన్స్ ఛార్జీ
కొన్ని బ్యాంకులు వారి ఖాతాలో నిర్దిష్ట బ్యాలెన్స్ ఉంచకపోతే అదనపు ఫీజు వసూలు చేస్తాయి. ఈ విధంగా చూస్తే ఛార్జీల రూపంలోనే దాదాపు రెండు లక్షలకుపైగా వసూలు చేస్తుండటం విశేషం.