Mutual Fund Safety Tips: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ స్కీమ్ ఎంచుకోవాలి? నెలకు ఎంత కట్టాలి? ఎన్ని ఏళ్ల పాటు కొనసాగించాలి? అనే విషయాల మీద చాలామంది తెగ ఆలోచిస్తారు. అయితే ఆ డబ్బులను ఎవరికి, ఏ విధంగా పంపిస్తున్నామనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోరు. సరిగ్గా ఇక్కడే కొందరు మోసగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయిస్తామని చెప్పి, కొందరు నకిలీ ఏజెంట్లు తమ సొంత బ్యాంక్ ఖాతాలకు, UPI ఐడీలకు డబ్బులు పంపమని అడగొచ్చు. మరికొందరు నేరుగా క్యాష్ రూపంలో ఇవ్వాలని ఒత్తిడి చేయొచ్చు. ఇలాంటి సమయాల్లో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మీ కష్టార్జితం మొత్తం ఆవిరైపోయే ప్రమాదం ఉంది. మీరు కట్టిన డబ్బు నేరుగా అసలైన మ్యూచువల్ ఫండ్ సంస్థకే చేరిందా? మీ పేరు మీద యూనిట్లు అలాట్ అయ్యాయా? అనేది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే మ్యూచువల్ ఫండ్లలో డబ్బులు కట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన కీలక జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు కట్టే ప్రతి రూపాయి నేరుగా ఆ స్కీమ్‌ను నడిపే అసలైన మ్యూచువల్ ఫండ్ సంస్థ (AMC) ఖాతాకే వెళ్లేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్, గుర్తింపు పొందిన పెట్టుబడి యాప్‌లు, రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ల సాయంతో పేమెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్ట్రిబ్యూటర్ కి, ఏజెంట్ చేతికి నేరుగా డబ్బులు ఇవ్వకూడదు. అంతేకాదు మీ పెట్టుబడి మొత్తాన్ని వాళ్ల పర్సనల్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా అస్సలు సేఫ్ కాదు. ఎందుకంటే అలా పంపిన డబ్బు మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో జమ కాకుండా, మోసపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు అంతా డిజిటల్ జమానా కాబట్టి UPI ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం తప్పు కాదు.. అయితే డబ్బులు పంపే ముందు ఆ UPI ఐడీ అసలైనదా లేక నకిలీదా అని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఎల్లప్పుడూ ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ (AMC) లేదా గుర్తింపు పొందిన ప్లాట్‌ఫామ్ ఇచ్చిన అధికారిక UPI ఐడీకి మాత్రమే పేమెంట్ చేయాలి. సెబీ (SEBI) కొత్త నిబంధనల ప్రకారం, రిజిస్టర్డ్ ఆర్థిక సంస్థల కోసం ప్రత్యేకంగా వెరిఫైడ్ (ధ్రువీకరించిన) UPI ఐడీలను తీసుకొచ్చారు. సాధారణంగా అసలైన మ్యూచువల్ ఫండ్ UPI ఐడీలలో ఆ సంస్థ పేరుతో పాటు ‘mf’ అనే అక్షరాలు, ఆ తర్వాత ‘@valid’ హ్యాండిల్, బ్యాంక్ పేరు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, మీరు పేమెంట్ యాప్‌లో డబ్బులు పంపే ముందు స్క్రీన్ మీద వెరిఫైడ్ టిక్ మార్క్ ఉందో లేదో గమనించాలి. ఒకవేళ ఏమాత్రం అనుమానం వచ్చినా, ‘SEBI Check’ టూల్ ద్వారా ఆ UPI ఐడీ అసలైనదా కాదా అని వెంటనే నిర్ధారించుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో క్యాష్ రూపంలో పెట్టుబడి పెట్టడంపై పూర్తిగా నిషేధం ఏమీ లేదు. సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఒక ఇన్వెస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో గరిష్ఠంగా రూ. 50,000 వరకు నగదు రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి, నగదు పెట్టుబడికి అనుమతి ఉంది కదా అని నేరుగా ఏజెంట్ లేదా డిస్ట్రిబ్యూటర్ చేతిలో డబ్బులు పెట్టేయకూడదు! మీ KYC వివరాలు పూర్తయిన తర్వాత, ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ అధికారికంగా అనుమతించిన బ్యాంక్ కౌంటర్లు లేదా నిర్దేశిత మార్గాల ద్వారా మాత్రమే ఈ నగదు చెల్లింపు చేయాలి. ఇలా అధికారిక పద్ధతిలో కడితేనే మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.
డబ్బులు చెల్లించిన తర్వాత లావాదేవీ రసీదు, ట్రాన్సాక్షన్ వివరాలను భద్రపరచుకోండి. మీ పేరు మీద యూనిట్లు కేటాయించారా లేదా అన్నది AMC నుంచి వచ్చే మెసేజ్, ఈమెయిల్ లేదా ఖాతా స్టేట్‌మెంట్‌లో పరిశీలించండి. గుర్తుంచుకోండి.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం ఎవరైనా వ్యక్తిగత UPI ఐడీకి డబ్బులు పంపాలని అడిగితే తొందరపడకండి. ముందుగా ఆ వివరాలను సంబంధిత సంస్థతో ధ్రువీకరించుకోండి. చిన్న జాగ్రత్త మీ కష్టార్జితాన్ని మోసాల నుంచి కాపాడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పథకానికి సంబంధించిన పత్రాలను చదవండి. అవసరమైతే ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
Read Also: ఆన్‌లైన్‌లో ఇల్లు కొనాలని చూస్తున్నారా? బుక్ చేసే ముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి