Sankranti Special Trains: సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతాయి. నెలల ముందే టికెట్లు బుక్ అయిపోయి. వెయిటింగ్ లిస్ట్ చూసి చాలామంది నిరాశపడుతుంటారు. అయితే, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక మంచి శుభవార్త అందించింది. పండుగ రద్దీని తట్టుకునేందుకు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది.
రైళ్ల వివరాలు.. సమయాలు
మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లాలనుకుంటే ఈ తేదీలను నోట్ చేసుకోండి. జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డుకు (రైలు నంబర్: 07119) ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఆదివారం సాయంత్రం 4:20 గంటలకు చర్లపల్లిలో స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో (రైలు నంబర్: 07120) జనవరి 11, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి వస్తుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు వీలుగా దాదాపు అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో వీటికి హాల్ట్ ఇచ్చారు.
అన్ని రకాల బోగీలు అందుబాటులో..
సామాన్యుల నుంచి సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారి వరకు అందరికీ వీలుగా ఈ రైలును సిద్ధం చేశారు. ఇందులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు కూడా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి పండుగ ప్రయాణానికి ప్లాన్ చేసుకునే వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది!
Also Read: తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం!