SIP Investment: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే వేలకు వేలు డబ్బులు ఉండాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు జేబులో కేవలం రూ. 99 ఉంటే చాలు, మ్యూచువల్ ఫండ్ ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం వచ్చింది. ముఖ ఫండ్ హౌస్ మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ (Mirae Asset Mutual Fund) తాజాగా ‘మిరే అసెట్ కాంట్రా ఫండ్’ (Mirae Asset Contra Fund) పేరుతో ఒక కొత్త ఈక్విటీ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు నెలకు కేవలం రూ. 99తో సిప్ (SIP) మొదలుపెట్టొచ్చు. ఈ ఫండ్ అసలు ప్రత్యేకత ఏంటంటే.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో పెద్దగా డిమాండ్ లేని, ఇన్వెస్టర్లు పట్టించుకోని మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకే కొనుగోలు చేసి, భవిష్యత్తులో అవి లాభాల్లోకి వచ్చినప్పుడు మంచి రాబడిని అందిస్తుంది. ఆర్థిక భాషలో దీన్నే ‘కాంట్రేరియన్’ (Contrarian) పెట్టుబడి విధానం అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి..కేవలం రూ. 99తో సిప్ మొదలుపెట్టినంత మాత్రాన రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని కాదు! ఇది పూర్తిగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉండే ఈక్విటీ ఫండ్ కాబట్టి, దీర్ఘకాలం పాటు ఓపికగా పెట్టుబడి పెడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ కొత్త పథకం పూర్తి వివరాలేంటో, ఎప్పటి వరకు ఇందులో చేరే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.
మిరే అసెట్ కాంట్రా ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) 2026 నవంబర్ 27న మొదలైంది. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లకు 2026 డిసెంబర్ 11 వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 21 నుంచి ఈ ఫండ్ సాధారణ కొనుగోళ్లు, అమ్మకాలకు (ఓపెన్-ఎండెడ్ స్కీమ్‌గా) ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ సమయంలో అయినా లేదా ఆ తర్వాత అయినా ఒకేసారి పెట్టుబడి (లంప్‌సమ్) పెట్టాలంటే కనీసం రూ. 5,000 ఉండాలి. అదే నెలవారీ సిప్ (SIP) రూపంలో అయితే కేవలం రూ. 99 నుంచే మీ పెట్టుబడిని చాలా సులభంగా మొదలుపెట్టొచ్చు.
సాధారణంగా స్టాక్ మార్కెట్‌లో అందరూ ఎగబడి కొంటున్న, బాగా క్రేజ్ ఉన్న కంపెనీల షేర్ల వైపే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వెళ్తుంటారు కానీ కాంట్రా ఫండ్ (Contra Fund) తీరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎవరూ పట్టించుకోని, ఏవో తాత్కాలిక సమస్యల వల్ల షేర్ల ధరలు పడిపోయిన మంచి కంపెనీలను గుర్తించి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది. అయితే ధర తగ్గింది కదా అని కనిపించిన ప్రతి కంపెనీలోనూ గుడ్డిగా డబ్బులు పెట్టకుండా.. అసలు ఆ కంపెనీకి ఆదరణ ఎందుకు తగ్గింది? ధర పడిపోవడానికి కారణం తాత్కాలిక సమస్యా లేక శాశ్వత నష్టమా? కంపెనీ ఆర్థిక బలం గట్టిగానే ఉందా? భవిష్యత్తులో మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అనే ఐదు కీలక అంశాల ఆధారంగా లోతుగా పరిశీలించి, అన్ని పరీక్షలూ దాటిన మంచి షేర్లలోనే ఒకేసారి కాకుండా దశలవారీగా పెట్టుబడులు పెడుతూ ఇన్వెస్టర్లకు మంచి రాబడి వచ్చేలా చూస్తుంది.
ఈ ఫండ్‌లో కనీసం మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించగలిగే వారికి అనుకూలమని ఫండ్ సంస్థ సూచిస్తోంది. అయితే ఇది చాలా అధిక రిస్క్ ఉన్న ఈక్విటీ పథకం. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే పెట్టుబడి విలువ తగ్గే అవకాశం ఉంది. కాంట్రా వ్యూహం ఎప్పుడూ అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి కేవలం రూ.99తో పెట్టుబడి మొదలుపెట్టవచ్చని చూసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు పథకానికి సంబంధించిన పత్రాలను చదివి, అవసరమైతే ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
Read Also: 40 ఏళ్ల వయసులో రూ.3 కోట్ల రిటైర్మెంట్ ఫండ్… ప్రతి నెలా ఎంత SIP చేయాలో తెలుసా?