Atal Pension Yojana: మనం యవ్వనంలో ఉండి కష్టపడి పనిచేస్తున్న రోజుల్లో చేతిలో నాలుగు డబ్బులు బాగానే ఆడతాయి. వయసు మీదపడి, 60 ఏళ్లు దాటిన తర్వాత శరీరం సహకరించక పనికి వెళ్లలేని పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రతి నెలా ఇంటి ఖర్చులకు, మందులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే భయం ప్రతి సామాన్యుడిలోనూ ఉంటుంది. అంతేకాదు ముసలితనంలో పిల్లల మీద ఆధారపడకుండా, మన కాళ్ల మీద మనం గౌరవంగా బతకాలంటే ఇప్పుడే ఏదైనా పొదుపు చేసుకోవాలని ప్రతి భార్యాభర్తలు ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెద్ద భరోసాగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘అటల్ పెన్షన్ యోజన’ (Atal Pension Yojana – APY). ఇందులో ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటంటే.. భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా అకౌంట్లు ఓపెన్ చేసి, చిన్న మొత్తంలో పొదుపు చేసుకుంటూ వెళ్తే చాలు 60 ఏళ్లు నిండిన తర్వాత ఒక్కొక్కరికి నెలకు రూ. 5,000 చొప్పున, ఇద్దరికీ కలిపి ప్రతి నెలా రూ. 10,000 గ్యారెంటీ పెన్షన్ అందుతుంది! అంతేకాదు, ఒకవేళ భర్త మరణించినా భార్యకు ఆ పెన్షన్ అలాగే కొనసాగుతుంది, ఇద్దరి తదనంతరం వాళ్లు కట్టిన అసలు డబ్బు నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన ఈ సూపర్ స్కీమ్‌లో చేరాలంటే నెలకు ఎంత కట్టాలి? ఏ వయసు వాళ్లు ఈ పథకానికి అర్హులో ఇప్పుడు చూద్దాం.
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చే పింఛను పథకం. ఇందులో చేరినవారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పింఛను పొందవచ్చు. పింఛను మొత్తం ఎంత కావాలనేది ఖాతా తెరిచే సమయంలోనే ఎంచుకోవాలి. ఈ పథకంలో చేరడానికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ఠ వయసు 40 ఏళ్లు. భారత పౌరుడై ఉండటంతో పాటు బ్యాంకు, పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉండాలి. అయితే 2022 అక్టోబర్ 1 నుంచి ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వాళ్ళు, గతంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు కొత్తగా ఈ పథకంలో చేరడానికి అర్హులు కారు. భార్యాభర్తల్లో ఒకరు పన్ను చెల్లింపుదారులైనా, మరొకరు పన్ను చెల్లింపుదారు కాకపోతే.. అర్హత ఉన్న వ్యక్తి సొంతంగా ఖాతా తెరవవచ్చు.
ఉదాహరణకు భార్యాభర్తలిద్దరూ 30 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరి, ఒక్కొక్కరు నెలకు రూ.5,000 పింఛను ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. అప్పుడు ఒక్కొక్కరు నెలకు రూ.577 చొప్పున చెల్లించాలి. ఇద్దరి కలిపి నెలవారీ చెల్లింపు రూ.1,154 అవుతుంది. ఇలా 30 ఏళ్ల పాటు చెల్లిస్తే ఒక్కొక్కరు మొత్తం రూ.2,07,720 జమ చేసినట్లవుతుంది. ఇద్దరూ కలిపి రూ.4,15,440 చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన తర్వాత ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున, ఇద్దరికీ కలిపి నెలకు రూ.10,000 పింఛను అందుతుంది.
ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం జీవిత భాగస్వామికి లభించే పింఛను. ఖాతాదారుడు మరణిస్తే, అతని జీవిత భాగస్వామికి కూడా అదే నెలవారీ పింఛను అందుతుంది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు ఖాతాలు తెరిచి ఉంటే, ఒకరు మరణించిన తర్వాత బతికి ఉన్న వ్యక్తికి తన ఖాతా నుంచి వచ్చే పింఛనుతో పాటు, మరణించిన భాగస్వామి ఖాతా నుంచి వచ్చే పింఛను కూడా లభిస్తుంది. అంటే నెలకు మొత్తం రూ.10,000 అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత ఒక్కొక్కరి ఖాతాకు సంబంధించిన పెన్షన్ నిధి నామినీకి అందుతుంది. రూ.5,000 పింఛను నామినీకి ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.8.5 లక్షలు లభిస్తాయి.
ఈ పథకంలో చేరాలనుకునే వాళ్లు ఎక్కడికో తిరగాల్సిన పనిలేదు.. మీకు అకౌంట్ ఉన్న దగ్గర్లోని బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి చాలా సులభంగా ఈ ఖాతాను తెరవొచ్చు. మీరు ఈ పథకంలో చేరే వయసును బట్టి, అలాగే మీరు ఎంచుకునే పెన్షన్ మొత్తాన్ని (రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు) బట్టి ప్రతి నెలా కట్టాల్సిన ప్రీమియం మారుతూ ఉంటుంది. ఎంత చిన్న వయసులో చేరితే, నెలకు కట్టాల్సిన మొత్తం అంత తక్కువగా ఉంటుంది.
Read Also: పెళ్లి తర్వాత భార్యాభర్తలు జాయింట్ అకౌంట్ తెరవాలా? వేర్వేరు ఖాతాలు ఉంచుకోవాలా?