Online Shopping Alert: ప్రస్తుత రోజుల్లో టీవీ కొనాలన్నా, టీ షర్ట్ కొనుగోలు చేయాలన్నా కూడా అనేక మంది కూడా ఆన్‌లైన్ షాపింగ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కామర్స్ కంపెనీలు ఇంటికే వచ్చి ఆయా ఉత్పత్తులను అందిస్తుండటంతో వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఇదే సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నాణ్యతలేని ఉత్పత్తులు
కొన్నిసార్లు నాణ్యతలేని ఉత్పత్తులను సేల్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఇటీవల ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారుల దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక ఉత్పత్తులు నాణ్యతా ధృవీకరణ లేకుండా విక్రయించబడుతున్నట్లు గుర్తించారు. కాబట్టి వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
దాడుల్లో ఏం జరిగింది?
BIS అధికారులు ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ గిడ్డంగిపై దాడి చేశారు. మార్చి 19న 15 గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో గీజర్లు, ఫుడ్ మిక్సర్లు సహా 3,500కి పైగా ఎలక్ట్రికల్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్.. …
నాణ్యత ప్రమాణాలు
ఇక ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ గిడ్డంగిపై కూడా దాడి జరిగింది. అక్కడ 590 జతల ‘స్పోర్ట్స్ ఫుట్‌వేర్’ స్వాధీనం చేసుకున్నారు. వీటికి సరైన తయారీ గుర్తు లేకపోవడంతో, నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని BIS తెలిపింది. స్వాధీనం చేసుకున్న స్పోర్ట్స్ షూస్ విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందన్నారు.
ఎందుకు ఈ చర్యలు తీసుకుంది?
ఈ దాడులు దేశవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడానికి BIS చేపట్టిన తనికీల్లో భాగంగా జరిగాయి. గత కొన్ని నెలలుగా ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, లక్నో, శ్రీపెరంబుదూర్ వంటి నగరాల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహించారు. BIS ప్రకారం 769 ఉత్పత్తి వర్గాలకు తప్పనిసరి ధృవీకరణ అవసరం. సరైన లైసెన్స్ లేకుండా విక్రయించడం లేదా పంపిణీ చేయడం 2016 BIS చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం, జైలు శిక్ష లేదా భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది.
వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సంఘటనల నేపధ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నాణ్యతా ధృవీకరణ లేని ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక నష్టంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-BIS సర్టిఫికేట్ ఉండే ఉత్పత్తులనే కొనండి – భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థ BIS సర్టిఫికేట్ కలిగిన ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తాయి.
-అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ప్రమాణిత విక్రేతల (verified sellers) వద్ద నుంచే ఉత్పత్తులను కొనాలి.
-తక్కువ ధరలో అధిక డిస్కౌంట్ ఉన్న ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా డిస్కౌంట్ పేరుతో విక్రయించే అవకాశం ఉంది.
-కస్టమర్ రివ్యూలు చదవండి – ఉత్పత్తి నాణ్యతపై ఇతర వినియోగదారుల అభిప్రాయాలను పరిశీలించడం మంచిది.
-ఉత్పత్తిపై BIS మార్క్ ఉన్నదీ కాదో ధృవీకరించుకోండి – BIS వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఉత్పత్తి ధృవీకరణను చెక్ చేయవచ్చు.