December 1st New rules: కొన్నిరోజుల్లో కొత్త నెల రాబోతోంది. డిసెంబర్ నెలలో కొత్తగా రానున్న మార్పులు ఏంటి? కొత్త నిబంధనలు సామాన్యులపై ఏ మేరకు ప్రభావం చూపుతాయి? రానున్న కొత్త నిబంధనల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
కొత్త నెల రావడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. డిసెంబర్ ఒకటి నుంచి వివిధ అంశాలపై కొత్త నిబంధనలు రానున్నాయి. కొత్తగా ఆర్థికాంశాలు అందులో కీలకమైనవి. ఆయా నిర్ణయాలు కోట్లాది మందిని ప్రభావితం చేయగలవు. గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేట్, ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, గృహ బడ్జెట్‌లు, ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ కొత్త నిబంధనలు రానున్నాయి. సిలిండర్ల ధరలు, కంపెనీల వారీగా బుకింగ్ వంటివి తెలుసుకోవాలి. ఇండేన్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, భారత్ గ్యాస్ వాడే వినియోగదారులు సబ్సిడీ ధరలకు గృహ ఎల్‌పిజి రీఫిల్‌లను పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి అయ్యిందని నిర్ధారించు కోవాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు కొన్నిలావాదేవీలపై అదనపు ఛార్జీలు చెల్లించవలసి రావచ్చు. SBI క్రెడిట్ కార్డ్ ఫీజుల వ్యవహారం ముఖ్యమైన అంశం. అక్టోబర్ 27న జారీ చేసిన నోటీసు ప్రకారం.. బిల్లింగ్ సైకిల్‌లో అర్హత కలిగిన ఇంధన కొనుగోళ్లు రూ. 50 వేలు దాటితే ఇంధన ఖర్చుపై 1 శాతం ఫీజు అదనంగా విధిస్తాయి. ఉదాహరణకు రూ. 70 వేలు ఇంధనం కొనుగోలు చేస్తే రూ. 700 అదనపు ఛార్జీ తప్పదు. వ్యక్తిగత రవాణా లావాదేవీలు రూ. 30 వేలు దాటితే ఒ క శాతం ఫీజు వడ్డింపు మొదలుకానుంది.
ఆధార్ ఈ-మెయిల్ ఉచిత అప్‌డేట్ గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈ-మెయిల్ ఐడీని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ సదుపాయం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా వసూలు చేసే రూ. 75 ఫీజు మినహాయింపు ఈనెల చివరితో ముగియనుంది.
విదేశీ ఇన్వెస్టర్లకు డిజిటల్ KYC వ్యవహారం. FATF నిబంధనలకు అనుగుణంగా దేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు, విదేశీ పౌరులు భారత్‌కు రావాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ కేవైసీ పూర్తి చేసి బాంబే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ALSO READ: నటనలో రజనీకాంత్ మనవడు.. టెక్నాలజీలో సీఈఓ.. ఆశ్చర్యపరుస్తున్న 13 ఏళ్ల రిత్విక్!
దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్- DLC క్యాంపెయిన్ 5.0కు నవంబర్ 30తో గడువు ముగియనుంది. పెన్షనర్లు తమ 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి కేవలం నాలుగు రోజులు ఉన్నాయి. పెన్షనర్లు సజీవంగా ఉన్నారని, పెన్షన్ స్వీకరించడానికి అర్హులని సర్టిఫికేట్ రుజువు చేస్తుంది. వారి పెన్షన్ చెల్లింపులు కొనసాగేలా చూసుకోవడానికి ఈ ప్రక్రియ చాలా అవసరం. 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లు అక్టోబర్ ఒకటి నుండి తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి అనుమతించారు. 80 ఏళ్ల లోపు వారు నవంబర్ ఒకటి నుండి సమర్పించవచ్చు. గడువు దాటితే డిసెంబర్ పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం లేదా నిలిపివేత జరిగే అవకాశం లేకపోలేదు.