Post Office Time Deposit: చేతిలో కొంత డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలా, బ్యాంకులో దాచుకోవాలా, లేక ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. పెట్టుబడి పెడితే మంచి ఆదాయం రావాలి.. అదే సమయంలో పెట్టిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండకూడదని కోరుకుంటారు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ అందించే టైమ్ డిపాజిట్ పథకం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒకేసారి కొంత మొత్తం జమ చేస్తే, ఎంచుకున్న టెన్యూర్ ముగిసే వరకు ఒకే విధమైన వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాలానికి ప్రస్తుతం ఏడాదికి 7.5 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఉదాహరణకు, ఈ పథకంలో రూ.11.50 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో దాదాపు ఐదు లక్షల వడ్డీ పొందవచ్చు. మరి ఈ పథకం ఎలా పనిచేస్తుంది? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌ను బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లాగే భావించవచ్చు. ఇందులో ఒకసారి డబ్బు జమ చేస్తే, టెన్యూర్ పూర్తయ్యే వరకు ఉంచాలి. ఇది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం కావడంతో పెట్టుబడికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
ఈ పథకంలో ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ రేట్లు 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌లో రూ.11.50 లక్షలు జమ చేస్తే, 7.5 శాతం వడ్డీ ప్రకారం ఐదేళ్లకు మొత్తం వడ్డీ సుమారు ఐదు లక్షలు అవుతుంది. అసలు పెట్టుబడితో కలిపి సుమారు 16. 50 లక్షలు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ పథకంలో వడ్డీని ప్రతి ఏడాది చెల్లిస్తారు. దాన్ని మళ్లీ పెట్టుబడి పెడితేనే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఈ పథకంలో కేవలం రూ.1,000తోనే ఖాతా ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ.100 చొప్పున పెంచుకుంటూ మీకు వీలైనంత డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఇందులో ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టొచ్చు.. గరిష్టంగా ఇంతే పెట్టాలనే పరిమితి లేదు. మీ ఒక్కరి పేరుతోనే కాకుండా, ఇద్దరు కలిసి జాయింట్ ఖాతా కూడా తెరవవచ్చు. ఇందుకోసం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఖాతా తెరిస్తే సరిపోతుంది.
ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌లో పెట్టిన మొత్తానికి ఆదాయపు పన్ను విధానంలో సెక్షన్ 80C కింద, గరిష్టంగా రూ.1.5 లక్షల పరిమితి వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనం పెట్టుబడి మొత్తానికే వర్తిస్తుంది. వచ్చే వడ్డీ మాత్రం పన్నుకు లోబడి ఉంటుంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు మీ అవసరాలు, పన్ను విధానం, డబ్బు అవసరమయ్యే సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.
Read Also: SSYలో ఈ విధంగా పెట్టుబడి పెడితే 71 లక్షలకు పైగా… ఎలా సాధ్యం అంటే ?