Wedding loan planning tips: పెళ్లి అనేది జీవితంలో ఎంతో మధురమైన, ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలనుకునే వేడుక. అయితే …పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో చాలామంది పెళ్లి ఖర్చుల కోసం పర్సనల్ లోన్ లేదా మ్యారేజ్ లోన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. లోన్ తీసుకోవడం వల్ల అప్పటి అవసరాలు ఈజీగా తీరినప్పటికీ, తర్వాత నెలవారీ ఈఎంఐ భారం కుటుంబ బడ్జెట్‌పై పడుతుంది. అందుకే.. పెళ్లి కోసం లోన్ తీసుకునే.. ముందే మీ ఆర్థిక స్థితి గతులు, చెల్లింపు సామర్థ్యం, ఇతర ఖర్చులను సరిగ్గా లెక్కించుకోవడం చాలా అవసరం.
1. పెళ్లి బడ్జెట్, పొదుపు:
ముందుగా.. మీకు పెళ్లికి ఎంత మొత్తం అవసరం అవుతుందో.. ఒక స్పష్టమైన బడ్జెట్ రూపొందించుకోవాలి. ఖర్చులను అత్యవసరమైనవి, ఐచ్ఛికమైనవి అని విభజించుకోవాలి. ఆ తర్వాత.. మీ వద్ద ఉన్న పర్సనల్ పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా కుటుంబ సభ్యుల సహాయం ఎంత వరకు సమకూరుతుందో చూడాలి. మొత్తం ఖర్చులో మీ పొదుపు పోగా, నిజంగా ఎంత లోటు వస్తుందో లెక్కించి, ఆ మేరకు మాత్రమే లోన్ తీసుకోవడం బెస్ట్. అవసరం కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే అనవసరమైన వడ్డీ భారం పెరుగుతుంది.
2.ఈఎంఐ :
లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐ మీ ఆదాయంలో ఎంత శాతం ఉంటుందో లెక్కించాలి. సాధారణంగా మీ మొత్తం నెలవారీ ఈఎంఐ లు (ఇప్పటికే ఉన్న ఇతర లోన్లతో కలిపి) మీ టేక్-హోమ్ జీతంలో లేదా ఆదాయంలో 35% నుంచి 40% మించకుండా ఉండాలి. పెళ్లి తర్వాత కొత్త జీవితం, కొత్త బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి నెలవారీ ఖర్చులు, పొదుపు ,ఈఎంఐ అన్నీ ముందుగానే లెక్క వేసుకోవాలి.
3. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు :
బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు ఎంత ఉంది అనేది చాలా ముఖ్యం. కేవలం వడ్డీ రేటునే కాకుండా.. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు,జీఎస్టీ ముందుగా లోన్ క్లోజ్ చేస్తే వేసే ఛార్జీలను కూడా లెక్కించాలి. వీటన్నింటినీ కలిపితే లోన్ అసలు ఖర్చు ఎంత అవుతుందో స్పష్టమైన అంచనా వస్తుంది. వేర్వేరు బ్యాంకుల ఆఫర్లను పోల్చి.. చూసి తక్కువ ఖర్చుతో కూడిన లోన్ ఎంచుకోవాలి.
4. లోన్ పీరియడ్:
లోన్ పీరియడ్‌ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. కాలం ఎక్కువగా పెట్టుకుంటే నెలవారీ ఈఎంఐ తక్కువగా అనిపించొచ్చు కానీ, మొత్తం మీద మీరు బ్యాంకుకు చెల్లించే.. వడ్డీ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే తక్కువ కాలం అయితే.. ఈఎంఐ కొంచెం ఎక్కువగా ఉన్నా, త్వరగా అప్పు తీరిపోయి వడ్డీ భారం తగ్గుతుంది. మీ ఆదాయానికి అనుగుణంగా సరైన టైం ఎంచుకోవాలి.
5. ఎమర్జెన్సీ ఫండ్ :
పెళ్లి కోసం ఉన్న పొదుపు మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసి, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా..దుకు వెళ్లడం ప్రమాదకరం. పెళ్లి సమయంలో లేదా ఆ తర్వాత ఏదైనా అత్యవసర వైద్య ఖర్చు లేదా ఆర్థిక అవసరం వస్తే..ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని పక్కన ఉంచుకుని, మిగిలిన దానికి అనుగుణంగా లోన్ కోసం ప్రణాళిక చేసుకోవాలి.
పెళ్లి ఆనందాన్ని పంచుతుంది కానీ.. ఆలోచించకుండా తీసుకున్న లోన్ తర్వాత ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి పెళ్లి కోసం లోన్ తీసుకునే ముందు మీ బడ్జెట్, ఈఎంఐ సామర్థ్యం, వడ్డీ రేట్లు, అత్యవసర నిధిని తప్పకుండా లెక్కించుకోండి. సరైన ఆర్థిక ప్రణాళికతో.. ముందుకు వెళ్తే పెళ్లి వేడుకను హాయిగా జరుపుకోవడంతో.. పాటు భవిష్యత్తును కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.