Tesla launch in India: టెస్లా. ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కారు ఎంత ఫేమసో.. దాని ఓనరు కూడా అంతే ఫేమస్. ఇన్నాళ్లూ ఊరిస్తూవస్తున్న టెస్లా ఇండియాకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఎలాన్ మస్క్ టెస్లా ఎట్టకేలకు భారత్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇవాళ భారతదేశంలో తన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ముంబైలోని BKCలో తన మొదటి షోరూమ్‌ను లాంచ్ చేస్తోంది. ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అన్న ఊహాగానాలకు చెక్ పెడూతూ టెస్లా తన కార్ల బిజినెస్‌ను ఎట్టకేలకు ఇండియాలో మొదలు పెట్టబోతోంది.
ముంబై జియో వరల్డ్ సెంటర్ లో ఈ ఓపెనింగ్ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెస్లా కంపెనీకి చెందిన 5 వై మోడల్ కార్లు ఇండియాకు చేరుకున్నాయి. ముంబై తర్వాత టెస్లా న్యూ ఢిల్లీలోని ఏరోసిటీలో కూడా త్వరలో రెండో షోరూమ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక టెస్లా మొదట దేశంలో తన ప్రముఖ ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ Y కార్ల అమ్మకానికి పెట్టనున్నట్లు తెలుస్తోంది. టెస్లా తన షాంఘై ఫ్యాక్టరీ నుంచి కొన్ని మోడల్ Y కార్లను ఇప్పటికే ముంబైకి దిగుమతి చేసుకుంది. టెస్లా వ్యాపారాన్ని భారత మార్కెట్‌లో విస్తరించాలని.. రాబోయే నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో కూడా విస్తరించాలని యోచిస్తోంది.
ఇక ముంబైలోని ప్రముఖ బిజినెస్ ఏరియా BKC బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా రెంట్‌కు తీసుకుంది. వినియోగదారులకు పార్కింగ్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ షోరూమ్ ఏర్పాటు చేశారు. షోరూమ్ కు నెలకు 35 లక్షలు రెంట్ పే చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా అద్దె 5 శాతం పెంపు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 5 సంవత్సరాలకు గాను యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి టెస్లా లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ లో యాపిల్ స్టోర్ కు దగ్గరగా ఉంటుంది.
Also Read: మహింద్ర థార్‌కు పోటీగా అతితక్కువ ధరలో టాటా ఎస్‌యువి.. త్వరలోనే లాంచ్
టెస్లా కంపెనీ చాలా కాలంగా ఇండియాలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు సంబంధించి ఇంపోర్ట్ ట్యాక్సులు తగ్గించాలని టెస్లా కోరింది. అయితే, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్నది. ఇందుకు మస్క్ నో చెప్పడంతో టెస్లా రాక ఆలస్యం అయ్యింది. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్లా కార్లు ఇండియన్ రోడ్స్ పై రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి.