Minister Adluri: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ భేటీ రహస్యాలను దేవుడి సాక్షిగా, తడిబట్టలతో ప్రమాణం చేసి బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరి తన సవాలుకు హరీశ్ రావు కట్టుబడి ఉంటారా? అని మంత్రి ప్రశ్నించారు.
తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేద్దామా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని.. సిద్ధిపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి తడిబట్టలతో వచ్చి.. తన తల్లిదండ్రులపై ఒట్టేసి కేబినెట్ మీటింగ్‌లో ఏం జరిగిందో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఈ సవాలును స్వీకరించి, ప్రమాణం చేసేందుకు హరీశ్ రావు సిద్ధమైతే.. తేదీ, సమయం నిర్ణయించాలని ఆయన కోరారు.
దండుపాళ్యం ముఠా విమర్శలపై మంత్రి ఆగ్రహం
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీపై హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గం ‘దండుపాళ్యం ముఠా’ కంటే అధ్వాన్నంగా తయారైందని, మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు నీ ఆస్తుల విలువ ఎంత..?
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై మంత్రి అడ్లూరి మండి పడ్డారు. ‘మీ సెటిల్‌మెంట్లు, కమీషన్లు, దోచుకోవడం, దాచుకోవడం’ గురించి స్వయంగా కేసీఆర్ బిడ్డ, హరీశ్ రావు బంధువు అయిన కవితే చెప్పారని గుర్తు చేశారు. ముందుగా కవిత చేసిన ఆరోపణలకు హరీశ్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ వేశారు. అంతేకాకుండా.. 2004లో హరీశ్ రావు ఆస్తులు ఎంత? ఇప్పుడు మీ ఆస్తులెంత? అనే వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన ఈ సవాల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సవాల్‌పై హరీశ్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ALSO READ: Nizamabad News: రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేయలేదు.. నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన