EPFO Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు విత్ డ్రా నిబంధనలను సడలించాలని కేంద్రం పరిశీలిస్తోంది. గృహ నిర్మాణం, వివాహం, విద్య కోసం పీఎఫ్ ఉపసంహరణ పరిమితులను సడలించవచ్చని ఈపీఎఫ్ఓ సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు.
“చందాదారులపై మేము ఆంక్షలు విధించాలనుకోవడం లేదు, అది వారి డబ్బు. వారి అవసరాలకు అనుగుణంగా పీఎఫ్ ను వాడుకునే స్వేచ్ఛ వారికి ఉండాలి” అని ఓ అధికారి అన్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు చందాదారులు పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లు దాటితే లేదా రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే మొత్తం ఈపీఎఫ్ఓ కార్పస్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే ఇతర కారణాలతో విత్ డ్రా చేసుకోవాలనుకుంటే పలు పరిమితులు ఉన్నాయి. సోదరి లేదా పిల్లల వివాహం కోసం ఉద్యోగి పీఎఫ్ 50 శాతం వరకు వడ్డీతో సహా ఉపసంహరించుకోవడానికి కనీసం ఏడు సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి పీఎఫ్ లో 90% వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆస్తి ఉద్యోగి, అతడి జీవిత భాగస్వామి లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉండాలి. ఈ తరహా విత్ డ్రాకు కనీసం 3 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి.
ఉద్యోగి కనీసం ఏడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నట్లయితే, పిల్లల పై చదువులకు 50 శాతం వరకు వడ్డీతో సహా పీఫ ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే పీఎఫ్ మొత్తం కార్పస్‌ను లేదా దానిలో కొంత భాగాన్ని విత్ డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈపీఎఫ్ విత్ డ్రా పరిమితులను సడలించడం లేదా అర్హత ప్రమాణాలను సడలించడం వల్ల ఉద్యోగులు ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారు రుణాలు తీసుకోకుండా నిధులను సులభంగా పొందే అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు కఠినంగా ఉన్నాయని, కనీసం సర్వీస్ సమయం, విత్ డ్రా పరిమితులు, ఫ్రీక్వెన్సీ, డాక్యుమెంటేషన్ షరతులను సడలించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఉద్యోగి పదవీ విరమణ భద్రతను కాపాడమే ప్రభుత్వ లక్ష్యం అయినప్పటికీ కొన్నిసార్లు తక్షణ సాయం అందించడంలో విఫలమవుతుందని నిపుణులు అంటున్నారు.
దీంతో పాటు యజమానులు కాంట్రిబ్యూషన్‌లో కొంత భాగం చెల్లించకపోవడం వల్ల ఫైనల్ పీఎఫ్ సెటిల్‌మెంట్‌లను తిరస్కరించవద్దని ఈపీఎఫ్‌ఓ అధికారులను ఆదేశించింది. సెప్టెంబర్ 19న జారీ చేసిన సర్క్యూలర్‌లో పీఎఫ్ ఖాతాలను బదిలీ చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల తుది పీఎఫ్ సెటిల్‌మెంట్ క్లెయిమ్‌లను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
అయితే తాజాగా ఈపీఎఫ్ఓ కార్యాలయాలు క్లెయిమ్‌లను తిరస్కరించవద్దని, క్లెయిమ్‌దారుల ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి పాక్షిక చెల్లింపుల కోసం క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాలని ఈపీఎఫ్ఓ సూచించింది. పార్ట్ పేమెంట్ కు సంబంధించిన అన్ని కేసులను నమోదు చేయాలని, ప్రతి నెలా సమీక్షించాలని ఈపీఎఫ్ఓ తెలిపింది.
Also Read: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్
ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ లైట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇందులో లబ్ధిదారులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) సేవలను సులభతరం చేసింది. ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి ఈపీఎఫ్ పాస్‌బుక్ లైట్ వెర్షన్‌ను నేరుగా పోర్టల్‌లో చూసుకోవచ్చు. ‘పాస్‌బుక్ లైట్’ ఫీచర్ తో పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లకుండానే సభ్యుల పోర్టల్ ద్వారా వారి పాస్‌బుక్ ను తనిఖీ చేసుకోవచ్చు.