EPFO ATM Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా సదుపాయం కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అక్టోబర్ రెండో వారంలో సమావేశం కానుంది. ఈ బోర్డు సమావేశంలో ఏటీఎం విత్‌డ్రాయల్ సౌకర్యానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
బ్యాంకు ఖాతా తరహాలో ఈపీఎఫ్ఓ చందాదారులు ఏటీఎం ద్వారా తమ పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏటీఎం నగదు విత్‌డ్రా సదుపాయాన్ని 2025 జూన్ నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కార్మికశాఖ ముందుగా ప్రకటించింది. అయితే అందుకు తగిన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేసింది. నగదు విత్‌డ్రాలకు సంబంధించి సీబీటీ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విత్ డ్రాపై తగిన పరిమితి లేకపోతే ఈపీఎఫ్ఓ అసలు లక్ష్యం నీరుగారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తం కావడంతో బోర్డు నిర్ణయం కీలకంగా మారింది.
ఈపీఎఫ్‌ఓకు 7.8 కోట్లమంది ఖాతాదారులు ఉన్నారు. సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్‌ఓ కలిగి ఉంది. అయితే అత్యవసర సమయాల్లో ఉద్యోగి నగదు అవసరాలను తీర్చడానికి పీఎఫ్ మొత్తాలను విత్ డ్రా సదుపాయం తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం తగిన ఐటీ సేవలను సిద్ధం చేసేందుకు బ్యాంకులు, ఆర్‌బీఐతో చర్చించింది.
ఏటీఎం తరహాలో ప్రత్యేకంగా ఈపీఎఫ్ఓ కార్డును ఖాతాదారులకు జారీ చేస్తారు. దీంతో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
“ఈపీఎఫ్ఓ లావాదేవీలను అనుమతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏటీఎంల నుంచి ఉపసంహరణ పరిమితి ఉంటుంది. కానీ దీనిపై చర్చించాల్సి ఉంది” అని బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. నేటికి ఈపీఎఫ్ఓ కార్పస్ రూ. 28 లక్షల కోట్లకు పైగా ఉంది. మొత్తం ఖాతాదారులు దాదాపు 78 మిలియన్లు. 2014లో ఈ గణాంకాలు రూ. 7.4 లక్షల కోట్లు, 33 మిలియన్లుగా ఉంది.
“ఈపీఎఫ్‌ఓ కార్పస్‌ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏటీఎం విత్ డ్రా అవసరంగా భావిస్తున్నారు” అని కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఇటీవల తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఈపీఎఫ్ఓ చందాదారులకు నిధుల లభ్యతను పెంచడానికి ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొత్తాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ఈ ప్రక్రియలో ఆటోమేటెడ్ సిస్టమ్ క్లెయిమ్ అర్హతను ధృవీకరించడానికి డిజిటల్ గా తనిఖీ చేస్తారు. అనంతరం ఈపీఎఫ్ఓ అధికారి క్లెయిమ్‌ను మాన్యువల్‌గా సమీక్షిస్తారు. మొత్తం ఈ ప్రక్రియ చందాదారుని KYC వివరాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం
“ఈపీఎఫ్ఓ డిజిటల్ లావాదేవీలను ఆమోదించడానికి సిద్ధంగా ఉందా? లేదా? అనేది దాని డిజిటల్ మౌలిక సదుపాయాల పటిష్టత, బ్యాంకింగ్ వ్యవస్థతో ఏకీకరణపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల డిజిటలైజేషన్‌లో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ, మోసాలకు తావులేకుండా ఏటీఎం ఉపసంహరణ, చెల్లింపు నెట్‌వర్క్‌లతో సమన్వయం అవసరం” అని నిపుణులు అంటున్నారు.