Railway Employees Bonus: పండుగ పూట రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ రూపంలో ఉద్యోగులకు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం దిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ తాజా నిర్ణయంతో గ్రూప్-C, గ్రూప్-D కేటగిరీలో 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.1865.68 కోట్లు బోనస్ కింద ఉద్యోగులకు చెల్లించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే 30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 78 రోజుల బోనస్ చెల్లింపుల వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 లభించినుందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేపట్టిందని చెప్పారు. 730 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసిందని అన్నారు.
బోనస్ పొందే లబ్ధిదారులలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డ్స్), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, హెల్పర్లు, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి ఉద్యోగులు ఉన్నారు. బోనస్ ప్రకటన రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తిస్తుందని, ఉత్పాదకతను మరింత మెరుగుపరచడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
బీహార్‌లోని 104 కి.మీ. భక్తియార్‌పూర్-రాజ్‌గిర్-తిలైయా సింగిల్ రైల్వే లైన్‌ను రెట్టింపు చేయడానికి రూ.2,192 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాలుగు జిల్లాలను కవర్ చేసే ఈ రైల్వే లైన్, రాజ్‌గిర్, నలంద, పావాపురి వంటి కీలక పర్యాటక, తీర్థయాత్ర కేంద్రాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో 1,434 గ్రామాలు, గయా , నవాడ జిల్లాలలోని 13.46 లక్షల మందికి రైలు సదుపాయం దక్కునుంది.
బీహార్‌లోని NH-139W లోని సాహెబ్‌గంజ్-అరెరాజ్-బెట్టియా సెక్షన్ నిర్మాణాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. 78.94 కి.మీ. ఈ మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద నాలుగు లేన్ల జాతీయ రహదారిగా రూ. 3,822.31 కోట్లతో నిర్మించనున్నారు.
రిటైల్ కార్యకలాపాలకు ఊతం
భారతదేశంలోని పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటున్న రైల్వే ఉద్యోగులకు ప్రస్తుత బోనస్ గృహ అవసరాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, పండుగ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సహాయపడుతుంది. అలాగే దీపావళికి ముందు కేంద్రం బోనస్ ప్రకటించండంతో దేశంలో రిటైల్ కార్యకలాపాలు పుంజుకోనున్నాయి.