JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1, 2 షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆదివారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 2026కి హాజరయ్యే అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చు. 2026 జనవరి 21 నుంచి 30 మధ్య సెషన్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జేఈఈ సెషన్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తులు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభం అవుతాయి. 2026 జనవరి 21 – 30 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తులు జనవరి 2026 చివరి వారంలో ప్రారంభం అవుతాయి. 2026 ఏప్రిల్ 01 – 10 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఈసారి పరీక్షల నిర్వహించే నగరాల సంఖ్యను పెంచనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. అంతేకాకుండా, పరీక్షకు హాజరయ్యే దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఆధార్ కార్డు, 10వ తరగతి సర్టిఫికేట్ పేరు ఒకే విధంగాలేకపోతే.. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో పేరును సరిదిద్దుకోవడానికి ఆప్షన్ ఇస్తామని ఎన్టీఏ తెలియజేసింది.
జేఈఈ సెషన్-1 కోసం త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ తేదీలు, ఇతర వివరాలను విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ పరీక్షను రెండు సెషన్లకు రెండు షిఫ్టులలో నిర్వహించే అవకాశం ఉంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్ 1 NIT, IIIT, ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చే సంస్థలు, గుర్తింపు పొందిన సంస్థలు, విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లు (BE / B. Tech.)లో ప్రవేశాలకు నిర్వహిస్తుంటారు. జేఈఈ మెయిన్ ప్రతిష్టాత్మక IITలలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ (అడ్వాన్స్‌డ్)కి ఒక అర్హత పరీక్ష. అలాగే బి.ఆర్క్, బి.ప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పేపర్ 2 నిర్వహిస్తారు.
1. అభ్యర్థులు జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in పై క్లిక్ చేయాలి.
2. హోమ్ పేజీలోని జేఈఈ మెయిన్-2026 లింక్ పై క్లిక్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అభ్యర్థి వివరాలను నమోదు చేయండి.
4. అభ్యర్థి ఖాతాలో లాగిన్ అవ్వండి.
5. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి రుసుమును చెల్లించండి.
6. సబ్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
7. అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.