Gold Price Today: దీపావళి సమీపిస్తున్న కొద్దీ బంగారం-వెండికి డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే లక్ష్మిదేవి పూజ సందర్భంగా ఆభరణాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. కానీ రోజు రోజుకూ ధరలు తగ్గడంతో కొనుగోళ్ల దారుల్లో ఆనందం మిన్నంటింది. ఇంతకీ బంగారం-వెండి ధరలు పతనం వెనుక ఏం జరుగుతోంది?
పెళ్లిళ్లు, పండగల సీజన్‌లో బంగారం-వెండి కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. వాటికి సంబంధించి ఏ షాపు చూసినా కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. అఫ్‌కోర్సు.. ఇప్పడు అదే జరుగుతోందనుకోండి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో వ్యతిరేక పవనాలు బులియన్ మార్కెట్‌పై పడింది. దీని కారణంగా బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి.
అక్టోబరు నెలలో పసిడి 3.5 శాతం ధర తగ్గుముఖం పట్టిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెండిది కూడా అదే పరిస్థితి. ఏకంగా 14 శాతం మేరా పతనం అయ్యింది. ధరలు దిగి రావడంతో బంగారం షాపులు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. చాలామంది షాపుల ఓనర్లు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బంగారంలో పెట్టుబడి ఇదే సరైన సమయమని, వాటికి సంబంధించి రకరకాల స్కీముల గురించి చెబుతున్నారు.
శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం పతనం అయ్యింది. ప్రస్తుతం 3990 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి ధర కూడా 0.4 శాతం తగ్గింది. ప్రస్తుతం 50.98 శాతం వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. భారత కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఇదే పరిస్థితి నెలకొంది. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1.42 లక్షలు ఉంది. సిల్వర్ ఫ్యూచర్ కేజీ ధర రూ.1.87 లక్షల వద్ద కొనసాగుతోంది.
ALSO READ: స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో శుక్రవారం మధ్యాహ్నానికి 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర రూ.1.45 లక్షలు పలుకుతోంది. ముందు రోజుతో పోల్చితే 10 గ్రాములకు రూ.1690 మేరా తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం రూ.1,30,400 వద్ద ఉంది. ఇది కూడా రూ.1550 మేరా తగ్గింది. వెండి ధర కిలో రూ.1.89 లక్షల వద్ద కొనసాగుతోంది. గురువారంతో పోలిస్తే వెండి దాదాపుగా రూ.5 వేలు తగ్గిందని చెప్పవచ్చు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుదారులు బంగారం, వెండి మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించకోవడంతో ధరలు పతనం అవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరితో తీసుకోనుందని సంకేతాలు నేపథ్యంలో విలువైన లోహాలు ఒత్తిడికి గురవుతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.