Scrap Business Idea| మనకు పనికిరావని పారేసే పాత వస్తువులతో కూడా డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా? పాత పేపర్లు, పుస్తకాలు, ఇనుము, ప్లాస్టిక్, పాత ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని సేకరించి, వాటి క్వాలిటీ, రకాలను బట్టి వేరు చేసి, రీసైక్లింగ్ చేసే సంస్థలకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావించేవారికి స్క్రాప్ బిజినెస్ ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది.
పెద్ద ఫ్యాక్టరీ లేదా భారీ పెట్టుబడి లేకుండానే చిన్న స్థాయిలో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. మరి స్క్రాప్ ఎక్కడ సేకరించాలి? ఎవరికి అమ్మాలి? వ్యాపారం ప్రారంభించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? తెలుసుకుందాం.
స్క్రాప్ వ్యాపారంలో ముందుగా పాత వస్తువులను ఎక్కడి నుంచి సేకరించాలో తెలుసుకోవాలి. ఇళ్లలో, దుకాణాల్లో, ఆఫీసుల్లో, గోదాముల్లో పాత పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని సేకరించి నాణ్యత ఆధారంగా వేరు చేయాలి. అనంతరం పేపర్ మిల్స్ లేదా హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించవచ్చు. అలాగే ఇండస్ట్రియల్ ఎరియాలు (నిర్మాణ ప్రాంతాలు), పరిశ్రమల నుంచి ఇనుము, ఇతర లోహాల వ్యర్థాలను సేకరించవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్యాకింగ్ వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు. వాటి రకం, నాణ్యత ఆధారంగా వేరు చేసి అమ్మాలి.
పాత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే ఈ – వేస్ట్‌లోనూ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిని సాధారణ చెత్తలా నిర్వహించకూడదు. సంబంధిత పర్యావరణ నిబంధనలు పాటిస్తూ, అనుమతి పొందిన రీసైక్లింగ్ సంస్థలకే అందించాలి.
స్క్రాప్ వ్యాపారం కోసం మొదట్లో పెద్ద ఫ్యాక్టరీ అవసరం లేదు. మీ ప్రాంతంలోని ఇళ్లు, దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థల నుంచి పాత వస్తువులను సేకరించవచ్చు. వాటిని సరైన ధరకు కొనుగోలు చేసి హోల్‌సేల్ వ్యాపారులకు అమ్మవచ్చు. ప్రారంభంలో ఒకటి లేదా రెండు రకాల స్క్రాప్‌పై దృష్టి పెట్టడం మంచిది. దీనివల్ల మార్కెట్ ధరలు, కొనుగోలుదారుల అవసరాలు, రవాణా ఖర్చుల గురించి అవగాహన వస్తుంది.
వస్తువులను తూకం వేయడానికి తగిన మెషీన్‌లు, నిల్వ చేయడానికి స్థలం, రవాణా సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా సరఫరా చేసే వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవాలి.
స్క్రాప్ వ్యాపారంలో లాభం కొనుగోలు ధర, అమ్మకపు ధర, వస్తువుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. రవాణా, కూలీల జీతాలు, గోదాము అద్దె, ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొనుగోలు, అమ్మకం ధరల మధ్య ఉన్న తేడానే నికర లాభం కాదు. అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాతే అసలు ఆదాయం తెలుస్తుంది. మార్కెట్‌లో లోహాలు, ఇతర రీసైక్లింగ్ వస్తువుల ధరలు మారుతుంటాయి. అందువల్ల ధరలను ఎప్పటికప్పుడు గమనించాలి.
Also Read: చాణక్య నీతి.. సమాజంలో గౌరవం పొందాలంటే ఈ 5 పనులు చేయండి
వ్యాపారం ప్రారంభించే ముందు స్థానికంగా అవసరమైన ట్రేడ్ లైసెన్స్, బిల్లింగ్ విధానం, GST నిబంధనల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వేస్ట్, పాత బ్యాటరీల నిర్వహణకు ప్రత్యేక పర్యావరణ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని సేకరించడం లేదా రీసైక్లింగ్ చేయడానికి అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ల గురించి తెలుసుకోవాలి. సరైన పత్రాలు, నిబంధనలతో వ్యాపారం నిర్వహించడం ముఖ్యం. తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం ప్రారంభించాలని భావించేవారికి స్క్రాప్ బిజినెస్ ఒక అవకాశంగా ఉంటుంది.
సరైన వస్తువులను ఎంపిక చేసుకోవడం, నమ్మకమైన కొనుగోలుదారులను గుర్తించడం, ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. మనకు పనికిరాని వస్తువులను ఇతరులకు ఉపయోగపడే వనరులుగా మార్చడమే ఈ వ్యాపారంలోని అసలైన ప్రత్యేకత.