అర్నబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో నీటమునిగి కన్నీరుమున్నీరవుతుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్నబ్ తుఫాను తీవ్రత వల్ల జరిగిన నష్టం కొండంత అయితే.. సీఎం చంద్రబాబు నాయుడు కాగితాలపై చూపిస్తున్న లెక్కలు మాత్రం గోరంతేనని మండిపడ్డారు.
క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు.. ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు అస్సలు పొంతన లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో అన్ని రకాల పంటలు కలిపి ప్రాథమికంగా దాదాపు 15 లక్షల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇందులో కేవలం వరి పంట నష్టమే అత్యధికంగా 10 లక్షల ఎకరాల వరకు ఉందన్నారు. సుమారు 7 లక్షల మందికి పైగా రైతులు 100 శాతం పంటను కోల్పోయారని తెలిపారు. పంటలు, రహదారులు, ఇతర మౌలిక రంగాలు కలిపి అర్నబ్ తుఫాను మిగిల్చిన మొత్తం నష్టం సుమారు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 4,600 కోట్ల నష్టం జరిగిందని అంచనాలను తగ్గించి చూపడం దారుణమని ధ్వజమెత్తారు.
సీఎం చంద్రబాబు ఆర్భాటాలు చేయడంలో అగ్రస్థానంలో.. రైతులను ఆదుకోవడంలో మాత్రం చివరిస్థానంలో నిలుస్తున్నారని షర్మిలా ఆరోపించారు. తుఫాన్లు వచ్చిన ప్రతిసారీ రైతులు మోసపోతూనే ఉన్నారని విమర్శించారు. కేంద్ర బృందాల పర్యటనలు, నష్టనివారణ చర్యల హడావిడి తప్ప ఆచరణలో రైతులకు దక్కుతుంది శూన్యమని మండిపడ్డారు. గతంలో వచ్చిన ‘మొంథా’ తుఫాను వల్ల జరిగిన నష్టానికే ఇప్పటివరకు ప్రభుత్వం రూపాయి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ తీరును బట్టి కూటమి ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏపీ కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వం ముందు 10 కీలక డిమాండ్లను ఉంచుతున్నట్లు షర్మిల వెల్లడించారు. నీటమునిగిన వరి, ఇతర సాధారణ పంటలకు ఎకరాకి రూ. 30,000 చొప్పున చెల్లించాలన్నది తొలి డిమాండ్ గా పేర్కొన్నారు. ఉద్యానవన పంటలకు ఎకరాకి రూ. 50,000, ఆక్వా రైతులకు ఎకరాకి రూ. 50,000 పరిహారం అందించాలని పట్టుబట్టారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని రైతుల కల్లాల వద్దే మద్దతు ధర (MSP) చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. బాధితులైన రైతుల పాత రుణాలను తక్షణమే మాఫీ చేసి.. రాబోయే రబీ సీజన్‌కు కావలసిన ఎరువులు, విత్తనాలను రైతులకు పూర్తి ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సాగుకోసం రైతులు మళ్లీ తీసుకునే రుణాలపై వడ్డీ రహిత భరోసా ఇవ్వాలని.. తీరప్రాంత మత్స్యకారులకు జరిగిన ఆస్తి, వలల నష్టాన్ని అంచనా వేసి వారు కోరిన విధంగా నష్టపరిహారం ప్రకటించాలని పట్టుబట్టారు.
Also Read: మిస్సింగ్ కేసులో బయటపడే తలలేని శవం… ట్విస్టులతో మతిపోగొట్టే తెలుగు సిరీస్
పైన పేర్కొన్న డిమాండ్లకు రాష్ట్రం వద్ద సరిపడా నిధులు లేకపోతే ప్రధాని మోదీతో మాట్లాడి పూర్తి నష్టపరిహారాన్ని కేంద్రం నుంచే తెచ్చేలా చంద్రబాబు ఒప్పించాలని షర్మిల సూచించారు. రైతులకు పేరుకు రూ.1000, రూ. 3000 విసిరేసి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. రైతాంగం హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆమె తేల్చిచెప్పారు.
Also Read: రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే?