Crime Thriller OTT: ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కోసం మరో ఆసక్తికరమైన సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా పేరే ‘సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ (Sub-Inspector : YUGANDHAR). సినిమాలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మృతదేహం అకస్మాత్తుగా మాయమవుతుంది. మరోవైపు నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన ఈ తెలుగు సినిమా తాజాగా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనేది తెలుసుకుందాం పదండి.
హైదరాబాద్ నగర శివారులో ఓ అనాథ మృతదేహం కనిపించడంతో కథ మొదలవుతుంది. అదే సమయంలో నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ ఘటనలతో పోలీస్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమవుతుంది. ఒకే తరహాలో జరుగుతున్న ఈ హత్యల వెనుక ఎవరో ఒక వ్యక్తి పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. ఈ కేసును ఛేదించే బాధ్యత సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ కు అప్పగిస్తారు. విచారణ ప్రారంభించిన అతడికి ఒక్కొక్కటిగా కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఈ కేసులో కీలకమైన ఆధారంగా ఉన్న ఓ అమ్మాయి మృతదేహం పోలీస్ కస్టడీలోనే అదృశ్యమవుతుంది. భద్రత మధ్య ఉన్న శవం ఎలా మాయమైంది ? దాని వెనుక ఎవరు ఉన్నారు ? అనే ప్రశ్నలు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తాయి.
కొంతకాలానికి ఆ మృతదేహం నగర శివార్లలో అత్యంత దారుణమైన స్థితిలో కనిపిస్తుంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా వదలకుండా వికృతంగా వ్యవహరిస్తున్న ఓ సైకో కిల్లర్ ఈ హత్యల వెనుక ఉన్నాడని యుగంధర్ గుర్తిస్తాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి దర్యాప్తును మరింత వేగవంతం చేస్తాడు. కానీ ఆ కిల్లర్ పోలీసుల ఆలోచనలకు అందకుండా కొత్త ఎత్తులు వేస్తుంటాడు. ఈ క్రమంలో యుగంధర్‌కు మరో కీలక విషయం తెలుస్తుంది. ఈ హత్యల వెనుక మెడికల్ మాఫియాకు సంబంధించిన లింకులు ఉన్నట్లు బయటపడుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు ? అతడికి మెడికల్ మాఫియాతో సంబంధం ఏంటి ? పోలీస్ కస్టడీలో ఉన్న శవాన్ని ఎలా మాయం చేశాడు ? ఈ కేసులో మేఘలేఖ పాత్ర ఏమిటి ? ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో యుగంధర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? చివరకు అసలు నేరస్థుడిని ఎలా పట్టుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.
‘సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. మొత్తం ఐదు భాషల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. మేఘలేఖ (Meghalekha) కథానాయికగా నటించగా, రాకేందు మౌళి, పవన్ తేజ్ కొణిదెల, గాయత్రి భార్గవి, కాదంబరి కిరణ్, శివకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు రాఘవేంద్ర కటారి (Raghavendra Katari) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథను నడిపించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, సైకో కిల్లర్, మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే సినిమాలను ఇష్టపడే వాళ్లు ఈ వీకెండ్‌లో ఈ సినిమాను మాత్రం మిస్ అవ్వొద్దు.