Don’t Trouble The Trouble OTT: మలయాళం నుంచి వచ్చే ప్రయోగాత్మక చిత్రాలు, డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్లకు తెలుగు ఆడియన్స్‌లో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ ఫహాద్ ఫాజిల్ స్క్రీన్ మీద ఉన్నాడంటే ఆ మజానే వేరు. ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ ఫన్ రైడ్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా ఆసాంతం ఫాంటసీ, కామెడీ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. ఓ చిన్నారిని కిడ్నాప్ చేయాలనుకున్న ఓ వ్యక్తికి, ఆమె దగ్గరున్న వింత శక్తుల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? ఏ ఓటీటీలో చూడొచ్చు? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.
సూరి హైదరాబాద్‌లో ఉండే ఓ అనాథ. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అయితే కష్టపడి సంపాదించడం కంటే ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనే అతనికి ఎక్కువ. ఈ క్రమంలో స్థానిక గ్యాంగ్‌స్టర్ అస్లాం భాయ్ తో గొడవలో చిక్కుకుంటాడు. చివరికి అతనికి 25 లక్షలు బాకీ పడతాడు. ఆ డబ్బు వెంటనే చెల్లించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఎదురవుతుందని తెలుసుకున్న సూరి, ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఓ ధనవంతుల కుటుంబానికి చెందిన చిన్నారిని కిడ్నాప్ చేసి, భారీగా డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేస్తాడు. కానీ అతని ప్లాన్ అనుకున్నట్లు సాగదు. ఈ ప్రయత్నంలోనే దివ్య అనే చిన్నారి ఎదురవుతుంది. ఆమెను కిడ్నాప్ చేయాలని చూసిన సూరికి ఊహించని షాక్ తగులుతుంది. ఎందుకంటే దివ్య సాధారణ చిన్నారి కాదు. ఆమెకు మాయా శక్తులు ఉంటాయి.
తన తల్లిదండ్రులు కనిపించడం లేదని, వారిని వెతికి పెట్టేందుకు సూరి సహాయం కావాలని కోరుతుంది. మొదట తన డబ్బు సమస్యలు తీర్చుకోవాలనే ఆలోచనతోనే దివ్య దగ్గరకు వెళ్లిన సూరి, ఆ తర్వాత ఆమెతో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దివ్యతో పాటు ఆమె పెంపుడు కుక్క స్నూపీ కూడా ఈ ప్రయాణంలో భాగమవుతుంది. ముగ్గురూ కలిసి దివ్య తల్లిదండ్రుల ఆచూకీ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో దివ్య మాయా శక్తులు ఒక్కోసారి ఊహించని పరిణామాలకు కారణమవుతుంటాయి. మరోవైపు అస్లాం భాయ్ గ్యాంగ్ నుంచి సూరికి ప్రమాదం పొంచి ఉంటుంది. అసలు దివ్య తల్లిదండ్రులు ఏమయ్యారు? ఆమెకు ఉన్న శక్తుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? దివ్యను సూరి ఎందుకు కాపాడాల్సి వచ్చింది ? అస్లాం భాయ్ బారి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు ? ఈ ప్రయాణంలో సూరి జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది ? అనేది సినిమాలో చూడాల్సిందే.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈ ఏడాదే అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. శశాంక్ యేలేటి (Shashank Yeleti) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా… సూరి పాత్రలో ఫహాద్ ఫాజిల్, దివ్యగా సారా పాలేకర్ (Ssara Palekar) కీలక పాత్ర పోషించారు. సౌరభ్ సచ్‌దేవా (Saurabh Sachdeva), వెంకటేష్ కాకుమాను (Venkatesh Kakumanu), సుబ్బరాజు (Subbaraju), మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
Read Also: దెయ్యాలతో హాలోవీన్ సెలబ్రేషన్స్… అద్దంలో అరాచకం… నవ్విస్తూనే భయపెట్టే సిరీస్