November Rules 2026: సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో ఆర్థిక, పరిపాలనపరమైన మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ నెల స్టార్ట్ కానున్న సందర్భంగానూ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. పెన్షనర్లు, పన్ను చెల్లింపు దారులు, సామాన్యులపై ఈ మార్పులు ప్రభావం కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నవంబర్ నెలలో రాబోయే మార్పులపై ఓ లుక్కేద్దాం.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) నిబంధనలకు సంబంధించి కీలక మార్పులను నవంబర్ 1 నుంచి అమలులోకి తేనుంది. అక్టోబర్ 26న వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. సేల్స్ తర్వాత ఇచ్చే డిస్కౌంట్ల నిబంధనలను సరళీకరించడంతో పాటు, ఇన్వర్టెడ్ డ్యూటీ ఎదుర్కొంటున్న వ్యాపారాలకు తాత్కాలిక రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. 2026-2027 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ చర్యలు వ్యాపారులకు ఎంతో లబ్ధి చేకూర్చనున్నాయి.
ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ఈ క్రమంలో వాణిజ్యపరమైన ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పులు జరిగినా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. అయితే నవంబర్ 1 కి సంబంధించి ధరల మార్పుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రభుత్వ పెన్షన్ క్రమం తప్పకుండా రావాలంటే పెన్షనర్లు ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. 80 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పెన్షనర్లు నవంబర్ 1 నుంచి తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించవచ్చు. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అక్టోబర్ 1 నుంచే ఈ అవకాశం కల్పించారు. సాధారణంగా ఈ సర్టిఫికేట్ సమర్పణకు నవంబర్ 30 వరకు గడువు విధించారు. నిర్ణీత సమయంలో సర్టిఫికేట్ ఇవ్వకపోతే సర్టిఫికేట్ అందజేసే వరకు పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఆడిటింగ్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ తీపి కబురు అందించింది. 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపన్ను రిటర్నుల (ITR) దాఖలు గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 21 వరకు పొడిగించింది. అయితే ఈ గడువు పొడిగింపు కేవలం ఆడిట్ అవసరమైన నిర్దిష్ట కేటగిరీ పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుందని, సాధారణ వ్యక్తులందరికీ వర్తించదని అధికారులు తెలిపారు.
దివ్యాంగుల పెన్షన్ పరిధిని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. కనీస వైకల్యం శాతాన్ని 80% నుంచి 40%కి తగ్గించడంతో పాటు అర్హతకు ఉన్న కనీస వయోపరిమితి నిబంధనను కూడా తొలగించారు. అలాగే 80 ఏళ్ల లోపు వారికి నెలకు రూ. 375, 80 ఏళ్లు దాటిన వారికి రూ. 625 వరకు కేంద్ర సాయాన్ని పెంచాలని ప్రతిపాదించారు. అయితే దీనికి సంబంధించిన నూతన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాకపోవడంతో ఈ మార్పులు నవంబర్ 1 నుంచి అమలులోకి రావడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం లబ్ధిదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!
వివిధ బ్యాంకులు తమ ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను నవంబర్ లో మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఖాతాదారులు, వ్యాపారులు, పెన్షనర్లు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలైనా తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం లేదా ఆయా బ్యాంకింగ్ సంస్థల అధికారిక ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలుకుతున్నారు.
Also Read: 17 మంది ఖైదీల పరారీ ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఆ రోజు జైల్లో ఏం జరిగిందంటే?