Gold Price: చూడు ఒకవైపే చూడు.. ఇంకో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. అంటోంది బంగారం. ఇంతింతి వటుడింతై అన్నట్టుగా అలా అలా పెరుగుతూ పోతూనే ఉంది బంగారం ధర. రోజుకో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ దిగనే దిగనటోంది బంగారం ధర. మరి ఇలా పరుగులు పెడుతున్న పసిడి ధర అతి త్వరలోనే లక్షన్నర దాటేస్తుందా..? ఇలా మోత మోగిస్తున్న బంగారంపై నిపుణుల అంచనాలేంటి? అసలిప్పుడు బంగారం కొనాలా… ఆగాలా? మళ్లీ సామాన్యులకు బంగారం ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా? రండి తెలుసుకుందాం.
ఆగనంటున్న పసిడి ధర పరుగు
పండగ పూట కూడా తగ్గేదేలే అంటున్న పుత్తడి
సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బంగారం ధరలు
బంగారం కొనాలా? ఆగాలా? అనే దానిపై అనేక డౌట్స్
ప్రస్తుతం రూ.1.16 లక్షలకు చేరిన బంగారం ధర
రోజురోజుకు పెరగడమే తప్ప.. తరగడం అనేదే లేదంటోంది పసిడి. రోజుకో రికార్డ్‌ను క్రియేట్ చేస్తూ బంగారం ధర పరుగు పెడుతూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం ధర 81 వేలు ఉండగా.. అది ఇప్పుడు లక్షా 16 వేలను దాటేసింది. గత నెలతో పోలిస్తేనే ఇప్పుడు ఏకంగా 13 శాతం పెరిగింది బంగారం ధర. ఇక జనవరితో కంపేర్ చేస్తే ఏకంగా 35 వేల రూపాయలు పెరిగింది. అలా చూస్తుండగానే కొండెక్కి కూర్చొంది బంగారం ధర.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ భయాలతో పాటు అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో బంగారం ధర అమాంతం పెరిగిపోతుంది. ఇలా ధరలు పెరుగుతుండటంతో ఇప్పుడు ఇన్వెస్టర్లకు బంగారం ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ డిమాండ్ పెరుగుతోంది.
మొదటి ఆరు నెలల్లో 1028 టన్నుల బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్
మన దేశంలో సాధారణంగా పండగల సమయంలో కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ ఈసారి ఆ పరిస్థితిన అంత నమ్మకంగా అంచనా వేయలేకపోతున్నారు బులియన్ వ్యాపారులు. టైర్ టూ, టైర్ త్రీ టౌన్లలో వ్యాపారాలు జరుగుతున్నా.. మునుపటి అంతగా లేదని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర లక్షా 18 వేలకు చేరుకుందని.. దీంతో కొనుగోళ్లు చేసే వాళ్లు ధైర్యం చేయలేకపోతున్నారని.. ఒకవేళ చేసినా పరిమాణాన్ని తగ్గిస్తున్నారని చెబుతున్నారు. అయితే కొనుగోళ్లు మాత్రం ఆగలేదంటున్నారు వ్యాపారులు.
మొదటి ఆరు నెలల్లో 1028 టన్నుల బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్
ఈ ఏడాది ప్రథమార్థంలో 1028 టన్నుల బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్లు జరిగాయి. 2024 మొత్తంగా ఇన్వెస్ట్ చేసింది 1182 టన్నుల బంగారంపై. ఈ రెండింటిని పోల్చి చూస్తే.. గతేడాది కంటే ఈ ఏడాది గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయని క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా బంగారు కొనుగోళ్లు ఆపడం లేదని.. ఇది ఇన్వెస్టర్లను మరింత ఫోకస్ చేసేలా చేస్తుందంటున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఇన్వెస్టర్లు కాస్త తటపటాయించారు.. ఎక్కడ బంగారం ధరలు పడిపోతాయో అని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు ఆర్థిక వేత్తలు. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎంట్రీ పాయింట్ కోసం చూస్తున్నారన్నారు.
రూ.1.44 లక్షలకు చేరిన కిలో వెండి ధర
వెండి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం లక్షా 44 వేలకు చేరుకుంది. బంగారం కంటే ఎక్కువ వెండి ధర పెరిగిందనే చెప్పాలి. ఒక్క నెలలో 23 శాతం వెండి ధర పెరిగింది. ప్రతి ఏడాది భారత్‌లో 6 వేల టన్నుల వెండి ఉపయోగిస్తారు. ఇందులో పారిశ్రామిక అవసరాల కోసం 2 వేల 500 టన్నుల వెండిని ఉపయోగించగా.. ఆభరణాల కోసం 3 వేల 500 టన్నుల వెండిని ఉపయోగిస్తారు. ఈ లెక్కన చూసుకున్న పెరిగిన వెండి ధరలు గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తాయనేది అర్థమవుతోంది.
పెరుగుదల ఇలానే కొనసాగుతోందా? లేక పడిపోతుందా?
మరి ఈ పరిస్థితుల్లో బంగారాన్ని కొనాలా? వద్దా? ఈ ధరల పెరుగుదల ఇలానే కొనసాగుతుందా? లేక పడిపోతుందా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేమంటున్నారు నిపుణులు. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు పెరిగే అవకాశమే ఉన్నాయని చెబుతున్నారు. త్వరలోనే లక్షా వేలకు చేరినా ఆశ్చరపోవాల్సిన అవసరం లేదనేది వారి మాట.
64 వేల నుంచి 70 వేలకు చేరుకుంటుందని మొదటి అంచనా
ఎందుకంటే బంగారం ధర ఎప్పుడేలా ఉంటుందో చెప్పలేం. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం 2025 చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3 వేల డాలర్లు చేరే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఏప్రిల్ నాటికే 3 వేల 500 డాలర్లకు చేరింది. ఇప్పుడు 3 వేల 800 డాలర్లు దాటింది. ఇక BMI నివేదిక ప్రకారం.. 2025లో ధరలు 15 శాతం తగ్గి.. 10 గ్రాముల బంగారం 64 వేల నుండి 70 వేలకు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆకాశంవైపు దూసుకుపోతుంది. అందుకే బంగారం విషయంలో ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి అంచనాలు తప్పుతాయి అనేది పూర్తిగా ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ ఒత్తిడి
ఈ బంగారం ధరల పెరుగుదల వెనక ట్రంప్ హస్తం కూడా ఉందనే చెప్పాలి. నిజానికి బంగారం 3 వేల 500 డాలర్లకు చేరిన సమయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్‌లో ట్రంప్ ఎప్పుడైతే లిబరేషన్ డే టారిఫ్స్ అంటూ మొదటు పెట్టారో.. అప్పుడే పసిరి పరుగు మళ్లీ మొదలైంది. ఆ తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తున్న ఇన్వెస్టర్లకు తమకు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టడానికి బంగారం సేఫ్ అని భావించడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్లు.
డాలర్ పై డైట్స్ పెరిగిన ప్రతిసారీ గోల్డ్ పరుగులు
డాలర్‌పై డౌట్స్ పెరిగిన ప్రతిసారీ గోల్డ్ పరుగులు అందుకుంటుంది అనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో డాలర్‌తోనే వ్యాపారం చేయాలంటూ హుకూం జారీ చేయడం ప్రారంభించారు. దీనికి కౌంటర్‌గా బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే డాలర్ పెత్తనానికి బ్రేక్ పడినట్టే. దీంతో ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు ఈ యెల్లో మెటల్‌పై పడింది. అందుకే దీని పరుగులు ఆగడం లేదు. అతి త్వరలోనే తులం బంగారం ధర లక్షా 50 వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహమేంటి?
ప్రపంచంలో ఏదైనా మంచి జరిగితే ఏమో కానీ.. ఏదైనా తేడా జరిగింది అంటే దాని వెనక అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పసిడి ధర పరుగు వెనక కూడా అగ్రరాజ్యం హస్తం కనిపిస్తోంది. కానీ ఈ ధరల పెరుగుదలతో లాభపడింది ఏదైనా ఉందంటే ఈ దేశమే. ఒకే రోజు గోల్డ్ ర్యాలీతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాదు తన గోల్డ్ వాల్యూయేషన్‌ను ఏకంగా ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ గోల్డ్ ర్యాలీకి డొనాల్డ్ ట్రంప్ తన వంతుగా చేసిన సహాయం ఏంటి? ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహమేంటి?
అమెరికాకు బాగా కలిసొచ్చిన బంగారం ధర పెరుగుదల
బంగారం ధరల పెరుగుదల ఇప్పుడు అమెరికాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బంగారం ధరల ర్యాలీతో హిస్టరీలో ఫస్ట్ టైమ్ అమెరికా గోల్డ్ రిజర్వ్‌ల విలువ ట్రిలియన్ డాలర్లను దాటింది. ప్రపంచంలో ఇంత వాల్యూయేషన్ మరే దేశం వద్ద లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అమెరికాలో బంగారం విలువ ఈ ఏడాది 45 శాతం పెరిగింది. అందుకే ఈ విలువ ట్రిలియన్ డాలర్లను దాటింది. 1973లో అమెరికా కాంగ్రెస్ ఔన్స్ బంగారం ధరను 42 డాలర్లుగా ప్రకటించింది. ఆ సమయంలో అమెరికాలోని బంగారం రిజర్వ్ విలువ కేవలం 11 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ట్రిలియన్ డాలర్లు.
అమెరికా వద్ద 261 మిలియన్ ఔన్స్ ల గోల్డ్ రిజర్వ్
ప్రస్తుతం అమెరికా వద్ద 261 మిలియన్ ఔన్స్‌ల గోల్డ్ రిజర్వ్‌లో ఉంది. ఫోర్ట్ నాక్స్, వెస్ట్ పాయింట్, డెన్వర్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఈ బంగారాన్ని దాచి ఉంచింది. అయితే ఇక్కడ అమెరికాకు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. అన్ని దేశాల్లో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో బంగారం నిల్వలు ఉంటాయి. కానీ అమెరికాలో మాత్రం నేరుగా అమెరికా ప్రభుత్వమే వీటిని తమ కంట్రోల్‌లో ఉంచుకుంటుంది. ఈ బంగారానికి ఫెడరల్ రిజర్వ్ గోల్డ్ సర్టిఫికెట్లను జారీ చేస్తోంది.. అదే సమయంలో ఈ బంగారం విలువకు సమానమైన డాలర్లను గవర్నమెంట్‌కు అందిస్తోంది. అమెరికా వద్ద 8133 టన్నలు గోల్డ్ రిజర్వ్‌లో ఉంది. ప్రపంచంలో ఈ స్థాయిలో బంగారం నిల్వలు ఉన్న దేశం మరోకటి లేదు. అందుకే బంగారం విషయంలో అగ్రరాజ్యం కీ రోల్ ప్లే చేస్తుంది.
ఒకే రోజులో సగానికంటే ఎక్కువ కవర్
ఈ లెక్కన చూస్తే అమెరికా ఖజానాకు ఎంత డబ్బు చేరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా కనుక బంగారం విలువను వాల్యూయేషన్ చేస్తే ఏకంగా 990 బిలియన్ డాలర్లు అమెరికా ట్రెజరీకి చేరుతుంది. ప్రస్తుతం అమెరికా బడ్జెట్ లోటు 1.97 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.. ఇదే జరిగితే ఒకే రోజులో సగానికంటే ఎక్కువ కవర్ అయిపోతుందన్నమాట.
వడ్డీ రేట్లను తగ్గించిన యూయఎస్ ఫెడరల్ రిజర్వ్
నిజానికి అమెరికా ఇప్పుడు రెండు విధాలుగా లాభపడినట్టు అర్థమవుతుంది. ఒకటి.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేరకు తగ్గించింది. అంతేకాదు ఇదే ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీ రెట్లను తగ్గిస్తామనే సంకేతాన్ని కూడా ఇచ్చారు. దీంతో డాలర్ పుంజుకుంది. ఇది అమెరికాకు కలిసొచ్చే అంశమే. ఇక రెండోది బంగారం ధర పెరగడం కూడా మరో విధంగా అమెరికాకు కలిసొచ్చింది.
1996 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి
సెంట్రల్ బ్యాంక్‌లు కూడా బంగారం ధరలు పెరగడానికి ఓ కారణమయ్యాయనే చెప్పాలి. ప్రతి నెలా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు కలిపి 80 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి.అంటే ప్రతి నెలా అన్ని దేశాలు కలిపి 8.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయన్న మాట. వీటిలో చైనా టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది మే వరకు లెక్కలను చూస్తే.. ప్రస్తుతం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్‌ల వద్ద కలిపి 36 వేల 344 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టు తేలింది. అంటే గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా ట్రెజరీల కంటే ఎక్కవ ఎక్కువ విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. 1996 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.
RBI వద్ద 876 టన్నుల బంగారం నిల్వలు
మన దేశ విషయానికి వస్తే ప్రస్తుతం RBI వద్ద 876 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది జూన్ 2025 నాటి లెక్క. ఇదే సమయంలో దేశీయంగానే బంగారం ప్రొడక్షన్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాలలో మనమే ముందు వరుసలో ఉన్నాం. గడచిన పదేళ్ల లెక్కలు చూస్తే ప్రతి ఏడాది 650 నుంచి వెయ్యి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే 16.9 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం.
2025లో ఇది మరింత సేఫ్టీ మెటల్ గా మారిపోయింది
ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తే.. ఇప్పుడు సెఫేస్ట్ పెట్టుబడిగా ఉన్నది బంగారమే అనేది అర్థమవుతోంది. ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే.. 2025లో ఇది మరింత సేఫ్టీ మెటల్ గా మారిపోయింది. కానీ ఇక్కడో విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉంది. అదే ప్రొడక్షన్ తగ్గితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కాస్త కష్టంగా ఉంది.