దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ TCSలో ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తమ ఉద్యోగులలో 2 శాతం అంటే 12,000 కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగిస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ K కృతివాసన్ వెల్లడించిన రెండు నెలల తర్వాత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలయ్యింది. గత కొద్ది రోజులుగా బలవంతంగా, ఆకస్మిక రాజీనామాల పర్వం కొనసాగుతుండటంతో ఉద్యోగులలో భయాందోళన, అనిశ్చితి, ఆందోళన మొదలయ్యింది.
ఐటీ యూనియన్లు, ఉద్యోగులు, ఇతర వాటాదారులు అధికారికంగా చెప్పిన దానికంటే TCS ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 30,000 కంటే ఎక్కువగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. “జూన్ నుంచి దాదాపు 10,000 మంది ఉద్యోగులు నేరుగా మమ్మల్ని సంప్రదించారు. తొలగింపులు సులభంగా 30,000 దాటవచ్చు. ఉద్యోగులు స్వయంగా రాజీనామా చేయమని కోరడం, కంపెనీ వారిని తొలగించకపోవడం వలన, ఈ సంఖ్య TCS రికార్డులలో కనిపించవు. బహుశా వారి తొలగింపు గణాంకాలలో మాత్రమే ఉండవచ్చు” అని IT యూనియన్ సభ్యులు వెల్లడించారు. గత రెండు నెలలుగా ఉద్యోగుల తొలిగింపు గురించి నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ వార్తలను TCS తప్పుబట్టింది. “ఈ ఊహాగానాలు తప్పు. తప్పుదారి పట్టించేవి. ముందుగా చెప్పినట్లుగా TCS ఉద్యోగులలో 2 శాతం మందిని మాత్రమే తొలగిస్తాం” అని TCS ప్రతినిధులు తెలిపారు.
TCSలో దశాబ్ద కాలంగా పని చేసిన ఉద్యోగులను సైతం తొలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మందికి రాజీనామా చేయాలని ఇష్టం లేకపోయినా, కంపెనీ బలవంతంగా వారిని ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చాలా మంది ఉద్యోగాలు పోయిన విషయాన్ని ఇంట్లో కూడా చెప్పలేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం TCS కంపెనీ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లోనే గందరగోళం, భయం కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి తొలగింపు కాల్ వస్తుందో తెలియని పరిస్థితిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రాజెక్టులు తగ్గడం, ఉన్న క్లయింట్లు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయడంతో TCS ప్రాజెక్టులలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగుల తొలిగింపు కొనసాగుతోంది. తొలగింపు లిస్టులో ఉన్న వారికి నెల రోజుల ముందుగానే కాల్ చేసి వారికి రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు. అందులో ఒకటి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం కాగా, మరొకటి తొలగింపు. ఉద్యోగులను తొలగిస్తే, వారికి ఎటువంటి జీతం రాదు. రాజీనామా చేసిన తర్వాత, వారికి మూడు నెలల నోటీసు వ్యవధి, సంవత్సరాల అనుభవాన్ని బట్టి సెవరెన్స్ ప్యాకేజీ లభిస్తుంది.
అటు TCS ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. TCSలో 30 సంవత్సరాలకు పైగా పని చేస్తున్న ఉద్యోగులను 30 నిమిషాల్లోపు రాజీనామా చేయమని చెప్పడం నిజంగా దారుణం అంటున్నాయి. ఇలాంటి నిర్ణయాలతో ఉద్యోగులు మానసిక వేధింపులకు గురవుతున్నారని మండిపడుతున్నాయి.
Read Also: యూట్యూబ్ ప్రీమియం లైట్ వచ్చేసింది, మంత్లీ ఛార్జ్ ఎంతంటే?