Hostels History: మనుషుల చరిత్రలో “హాస్టల్” అనే కాన్సెప్ట్ చాలా పాతది. విద్య కోసం ఇంటి నుండి దూరంగా వెళ్ళే విద్యార్థులు, ఉద్యోగం కోసం ఇతర పట్టణాలకు వెళ్ళే వారు సురక్షితంగా ఉండడానికి ఒక వసతి ప్రదేశం అవసరమైంది. అలా హాస్టల్స్ వెలుగులోకి వచ్చాయి. మరి హాస్టట్స్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి. ఎవరు కనిపెట్టారు? ప్రాచీన కాలంలో హాస్టల్స్ ఉండేవా? మరి అప్పట్లో ఎలా ఉండేది దీనిపై ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అప్పట్లో గురుకులాలు
భారతదేశంలో ప్రాచీన కాలంలో గురుకుల వ్యవస్థ ఉండేది. గురువుతో పాటు విద్యార్థులు ఒకేచోట నివసిస్తూ చదువుకునే రీతినే మొదటి హాస్టల్ రూపం అని చెప్పవచ్చు. మధ్యయుగాల్లో కూడా బౌద్ధ విహారాలు, జైన మఠాలు విద్యార్థులకు వసతి కల్పించేవి. వాటిని అప్పట్లో “విద్యార్థి నిలయాలు” లేదా “చాట్రాలు” అని పిలిచేవారు.
హాస్టల్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి? సంవత్సరం?
ఆధునిక హాస్టల్స్ ఏర్పడినది బ్రిటిష్ పాలనలోనే. ఆంగ్ల విద్యా వ్యవస్థతో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఏర్పడినప్పుడు దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు వసతి అవసరం పెరిగింది. అందుకే మొదటగా పురుషుల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ నిర్మించారు. మహిళా విద్యకు ప్రాధాన్యం పెరిగిన తర్వాత, లేడీస్ హాస్టల్స్ కూడా ఏర్పాటు అయ్యాయి. సమాజంలో భద్రత, గోప్యత, సాంస్కృతిక కారణాల వల్ల బాలురు, బాలికలు వేరువేరుగా ఉండేలా హాస్టల్స్ ఏర్పాటయ్యాయి. 19వ శతాబ్దం చివరినాటికి, 20వ శతాబ్దం ఆరంభంలోనే లేడీస్ హాస్టల్స్ ప్రాముఖ్యం పొందాయి. 1880లలో మద్రాస్, బొంబాయి, కలకత్తా వంటి నగరాల్లో మహిళా హాస్టల్స్ మొదటగా ప్రారంభమయ్యాయి.
Also Read: JEE Main-2026: ఐఐటీ మెయిన్స్ అభ్యర్థులు అలర్ట్.. NTA కీలక సూచనలు
కాలం మార్పుతో హాస్టల్స్..
నేడు ప్రతి యూనివర్శిటీ, కాలేజీ, జూనియర్ కాలేజీ వరకు హాస్టల్స్ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కో-ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ వసతి మాత్రం విడిగా ఇస్తున్నారు. ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది.
హాస్టల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది?
ఇప్పుడు “హాస్టల్” అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. హాస్టల్ అనే పదం భారతీయ మూలం కాదు. ఇది లాటిన్ భాషలోని “హాస్పిటాలిస్” అనే పదం నుండి వచ్చింది. దాని అర్థం “అతిథులను గౌరవంగా ఆతిథ్యం ఇవ్వడం” లేదా “వసతి కల్పించడం.” ఆ పదం తరువాత ఫ్రెంచ్‌లోకి వెళ్లి “హోస్టెల్” అయింది. ఆ తరువాత ఆంగ్లంలోకి చేరి మనం నేడు వాడుతున్న “హాస్టల్” రూపం దాల్చింది. మధ్యయుగ యూరప్‌లో పాఠశాలలు, మఠాలు, చర్చిలు ప్రయాణికులు, విద్యార్థులకు వసతి కల్పించేవి. ఆ సమయంలోనే “హోస్టెల్” అనే పదం అధికారికంగా వాడుకలోకి వచ్చింది. ఇంగ్లాండ్‌లోని విశ్వవిద్యాలయాల దగ్గర ఆధునిక హాస్టల్స్ ఏర్పడి, ఆ పదం ప్రపంచానికి వ్యాప్తి చెందింది.
హాస్టల్స్ ఎవరు కనిపెట్టారు?
భారతదేశానికి ఈ పదం బ్రిటిష్ పాలనలో వచ్చింది. ఆంగ్ల విద్యా వ్యవస్థతో పాటు విశ్వవిద్యాలయాల వద్ద ఏర్పడ్డ వసతి గృహాలను “హాస్టల్స్” అని పిలిచారు. క్రమంగా ఈ పదం మన భాషల్లోకి చేరి, తెలుగు సహా అన్ని భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందింది.
అంటే, హాస్టల్ అనే పదాన్ని ప్రత్యేకంగా ఎవరో కనిపెట్టలేదు. ఇది లాటిన్ నుంచి ఫ్రెంచ్, అక్కడి నుంచి ఆంగ్లం మీదుగా మన భాషల్లోకి పరిణామం చెంది వచ్చింది. అసలు భావం మాత్రం ఒకటే “ఇంటి నుండి దూరంగా ఉన్నవారికి సురక్షితమైన వసతి కల్పించడం.” అందుకే నేడు హాస్టల్ అనగానే మనకు ఒక కొత్త జీవితం, కొత్త అనుభవం గుర్తుకు వస్తుంది.