Gold Spot Vs Campa: శీతల పానీయాల మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. పాపులర్ బ్రాండ్స్‌ను మళ్లీ ఓపెన్ చేసేందుకు వివిధ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడేళ్ల కిందట కాంపా భారత్ మార్కెట్లోకి వచ్చింది, సక్సెస్ సాధించింది. దాని నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు కోకాకోలా మరొక స్కెచ్ వేసింది. ఒకప్పుడు పాపులర్ గోల్డ్ స్పాట్‌ను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
భారతదేశం.. ఏ ప్రొడక్టు అయినా అతి పెద్ద మార్కెట్. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో మార్కెట్ క్లిక్ అయితే ఆ కంపెనీకి లాభాల పంటే. భారతీయుల టేస్ట్‌కు తగ్గుట్టుగా కొత్త కొత్త ప్రాడక్టులు తెరపైకి వస్తున్నాయి. గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ గురించి చెప్పనక్కర్లేదు. 1980-90 మధ్య భారతీయులను ఉర్రూతలూగించిన ఆరెంజ్ కూల్ డ్రింక్ గోల్డ్ స్పాట్. దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
జాతీయ పత్రికలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోకాకోలా వచ్చే వారం గోల్డ్ స్పాట్ డ్రింక్‌ను తిరిగి భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనికి సంబంధించి తెర వెనుక అన్ని ఏర్పాట్లు చేసింది. పాత స్మృతులతోపాటు తెలివైన వ్యాపార వ్యూహాన్ని అనుసరిస్తోంది ఆ సంస్థ. ఆరెంజ్ డ్రింక్ ఫాంటా అమ్మకాలకు పోటీ లేకుండా యువతను ఆకట్టుకునేందుకు గోల్డ్ స్పాట్ డ్రింక్‌ను షుగర్ లేదా నో షుగర్ ఫార్ములాతో తీసుకురాబోతోంది.
గోల్డ్ స్పాట్ సాఫ్ట్ డ్రింక్స్ భారత మార్కెట్లో ఒకప్పుడు కింగ్. పారిశ్రామికవేత్త రమేశ్ చౌహాన్ నేతృత్వంలోని పార్లే సంస్థ 1952 లో గోల్డ్ స్పాట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1993లో కోకాకోలా సంస్థ పార్లే సాప్ట్ డ్రింక్స్ థమ్స్ అప్, లిమ్కా, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ కొనుగోలు చేసే సమయానికి దేశీయ మార్కెట్లో 70 శాతం వాటా ఉండేవి. గోల్డ్ స్పాట్‌కు రాను రాను ఆదరణ క్రమంగా తగ్గిపోవడంతో కోకాకోలా సంస్థ 2000 ఏడాదిలో గోల్డ్ స్పాట్ ఉత్పత్తని నిలిపివేసింది.
రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్- RCPL పాత భారతీయ బ్రాండ్ కాంపాను కొనుగోలు చేసింది. మూడేళ్ల కిందట అదే పేరుతో రీ-లాంచ్ చేసింది. దీంతో భారతీయులంతా అటువైపు మొగ్గు చూపారు. దీంతో కాంపా మార్కెట్ ను విస్తరించుకుంటూ పోతోంది. దీన్ని గమనించిన కోకాకోలా కంపెనీ రెండున్నర దశాబ్దాల తర్వాత గోల్డ్ స్పాట్ డ్రింక్‌ను తెరపైకి తీసుకొచ్చింది. గోల్డ్ స్పాట్ రీఎంట్రీ వెనుక అసలు కారణం కాంపా కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాంపా గతేడాది దాదాపు రూ.4,700 కోట్లకు పైగా అమ్మకాలు నమోదు చేసింది.
దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ డ్రింక్స్‌గా అవతరించింది. కేవలం రూ.10 ఎంట్రీతో అడుగు పెట్టింది. డిస్ట్రిబ్యూటర్లు, అవుట్ లెట్లకు వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయింది. ఫలితంగా కోకాకోలా-పెప్సీకోల ఉమ్మడి వాటా 93 నుంచి 85 శాతానికి డౌన్‌ఫాల్ అయ్యింది. ఈ ఏడాది యూరో మానిటర్ నివేదిక ప్రకారం.. డ్రింక్స్ మార్కెట్ గతేడాది రూ.23 వేల కోట్లు ఉందని అంచనా. ఏటా 11.71 శాతం వృద్ధి చెందనున్నట్లు ప్రస్తావించింది. మార్కెట్‌ను వదులుకోకూడదనే ఆలోచనతో కోకాకోలా ఈసారి గోల్డ్ స్పాట్ ని తెరపైకి తెచ్చింది.
ALSO READ: SSYలో ఈ విధంగా పెట్టుబడి పెడితే 71 లక్షలకు పైగా… ఎలా సాధ్యం అంటే ?