Sukanya Samriddhi Yojana: పిల్లలు పుట్టినప్పటి నుంచే వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. మంచి చదువు చెప్పించాలని, ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, పెళ్లి సమయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అనుకుంటారు. అయితే రోజురోజుకూ చదువుల ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో డబ్బు సమకూర్చుకోవడం అంత సులభం కాదు. అందుకే చాలామంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పొదుపు చేయడం మొదలుపెడుతున్నారు. ఎక్కువగా ప్రభుత్వ భరోసా ఉండే పథకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాటిలో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి. ఇందులో క్రమం తప్పకుండా డబ్బు జమ చేస్తే, కూతురు చదువు, పెళ్లి అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మరి ఈ పథకంలో ఎవరు ఖాతా తెరవవచ్చు? కొడుకు పేరు మీద కూడా ఖాతా తీసుకోవచ్చా? ఏటా ఎంత డబ్బు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత మొత్తం వస్తుందో తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన పొదుపు పథకం. అందువల్ల ఈ పథకంలో అబ్బాయిల పేరు మీద ఖాతా తెరవడానికి అవకాశం లేదు. కేవలం పదేళ్లలోపు వయసున్న ఆడపిల్ల పేరు మీద మాత్రమే తల్లిదండ్రులతో పాటు చట్టబద్ధమైన సంరక్షకులు కూడా ఖాతా ప్రారంభించవచ్చు. అంటే కూతురు పుట్టినప్పటి నుంచి పదేళ్లు నిండేలోపు ఈ ఖాతాను తెరవాలి.
ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల వరకు ఖాతాలు తెరవడానికి అనుమతి ఉంటుంది. కవలలు జన్మించిన ప్రత్యేక సందర్భాల్లో నిబంధనలకు అనుగుణంగా రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరవవచ్చు. ఈ పథకంలో ఏడాదికి కనీసం రూ.250 జమ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 15 ఏళ్ల పాటు డబ్బు జమ చేయాలి. అయితే ఖాతా మెచ్యూరిటీ మాత్రం ప్రారంభించిన తేదీ నుంచి 21 ఏళ్లకు పూర్తవుతుంది.
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనపై ప్రభుత్వం ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇదే వడ్డీ కొనసాగుతుందని చెప్పలేం. అయితే ప్రస్తుత 8.2 శాతం వడ్డీ రేటు మొత్తం పెట్టుబడి కాలంలో కొనసాగుతుందని అనుకుంటే ఎంత మొత్తం వస్తుందో ఓసారి చూద్దాం.
మీ కూతురు పుట్టిన వెంటనే ఈ పథకంలో ఖాతా తెరిచి, ప్రతి ఏడాది ప్రారంభంలో రూ.1.5 లక్షలు జమ చేస్తున్నారని అనుకుందాం. ఇలా 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మీ జేబు నుంచి వెళ్లే మొత్తం రూ.22.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై చక్రవడ్డీ లెక్కన వడ్డీ జమవుతూ పోతుంది. 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి సుమారు రూ.71.8 లక్షలు అందుతాయి. అంటే మీరు పెట్టిన అసలు రూ.22.5 లక్షలు పోను, దాదాపు రూ.49.3 లక్షలు వడ్డీ రూపంలో లభిస్తాయి.
ఇలా కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడే పొదుపు మొదలుపెడితే, ఆమె పెద్దయ్యే సమయానికి చదువు నిమిత్తం, ఇతర అవసరాల కోసం మంచి మొత్తాన్ని సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పిన రూ.71.8 లక్షలు ప్రస్తుత వడ్డీ రేటు 21 ఏళ్ల పాటు మారకుండా కొనసాగుతుందని, ప్రతి ఏడాది ప్రారంభంలో డబ్బు జమ చేస్తారని తీసుకున్న అంచనా మాత్రమే. వాస్తవంగా ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్లు, డిపాజిట్ చేసే తేదీలను బట్టి చివరికి వచ్చే మొత్తం మారుతుంది.
Read Also: నెలకు 10000 SIPతో కోటీశ్వరులు కావడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?