SIP Investment: చాలామంది సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఫ్యామిలీ అవసరాలు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు అంటూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయాలని అనుకున్నా.. ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తుంటారు. ఈ క్రమంలో 30 ఏళ్లు దాటినా పొదుపు ప్రారంభించక ఇక ఆలస్యమైందని భావిస్తుంటారు. కానీ నిజానికి 30 ఏళ్ల వయసు పెట్టుబడులు మొదలుపెట్టడానికి మంచి సమయమే. ప్రతి నెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే రాబోయే సంవత్సరాల్లో మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అలాంటిది 30 ఏళ్ల వయసులో SIP ప్రారంభించి, 45 ఏళ్లు వచ్చేసరికి కోటి రూపాయలు కూడబెట్టాలంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి అందుబాటులో ఉన్న పద్ధతుల్లో SIP ఒకటి. దీని పూర్తి పేరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. మన ఆదాయానికి తగ్గట్టుగా ప్రతి నెలా కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. నిర్ణయించిన తేదీన ఆ మొత్తం బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. ఆ రోజు ఫండ్ ఆధారంగా మనకు యూనిట్లు కేటాయిస్తారు.
ఇలా ప్రతి నెలా పెట్టుబడి కొనసాగించడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో వేర్వేరు ధరలకు యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగిస్తే కాంపౌండింగ్ ప్రయోజనం కూడా లభించవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు స్థిరంగా ఉండవు. మార్కెట్ పరిస్థితులను బట్టి లాభాలు రావచ్చు, నష్టాలు కూడా ఎదురుకావచ్చు.
మీ వయసు ప్రస్తుతం 30 ఏళ్లు అనుకుందాం. మరో 15 ఏళ్లలో అంటే 45 ఏళ్లు వచ్చేసరికి మీ దగ్గర కోటి రూపాయలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలకు సుమారు రూ.22,000 SIP చేయాల్సి ఉంటుంది. ఏడాదికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే, 15 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి విలువ కోటి రూపాయలు దాటుతుంది. నెలకు రూ.22,000 చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మీరు జమ చేసే మొత్తం రూ.39.60 లక్షలు అవుతుంది. దీనికి 12 శాతం వార్షిక రాబడిని అంచనాగా తీసుకుంటే, సుమారు రూ.65.10 లక్షలు లాభంగా సమకూరుతాయి. అంటే మీ పెట్టుబడి, దానిపై వచ్చే రాబడి కలిపి మొత్తం రూ.1.04 కోట్లకు చేరుతుంది.
ఇక్కడ మీకు ఉపయోగపడేది కాంపౌండింగ్. మనం పెట్టిన డబ్బుపై వచ్చే లాభాలు కూడా తిరిగి రాబడిని అందిస్తాయి. ఇలా పెట్టుబడిపై పెట్టుబడి పెరుగుతూ పోవడంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే సంపాదన మొదలైనప్పటి నుంచే పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే 12 శాతం రాబడి అనేది కేవలం అంచనా మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి ఏడాది ఇదే రాబడి వస్తుందని చెప్పలేం. మార్కెట్ పనితీరును బట్టి మీ పెట్టుబడి విలువ మారుతుంది. కాబట్టి మీ ఆదాయం, ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.
Read Also: 4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే