SIP Investment: ఈ రోజుల్లో చాలామంది భవిష్యత్తు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేని వాళ్ళు ప్రతి నెలా కొంత మొత్తాన్ని SIP రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల తక్కువ మొత్తంతోనే పెట్టుబడిని ప్రారంభించి, దీర్ఘకాలంలో మంచి ఫండ్ ను సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే నెలకు ఎంత పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎంత మొత్తం చేతికి వస్తుందనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. నెలకు కనీసం 10 వేలు SIP చేస్తే కోటి రూపాయలు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన లెక్కలను ఓసారి చూద్దాం.
SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్‌లో ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టడం. ఒకేసారి భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోవడంతో సామాన్యులు కూడా తమ ఆదాయానికి అనుగుణంగా SIP ప్రారంభించవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.100తో కూడా పెట్టుబడి మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది.
అయితే SIPలో పెట్టుబడి పెట్టినంత మాత్రాన నిర్ణీత రాబడి వస్తుందని భావించకూడదు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్‌లో వడ్డీ ముందుగానే నిర్ణయించబడదు. స్టాక్ మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడులు మారుతుంటాయి. మార్కెట్ అనుకూలంగా ఉంటే మంచి లాభాలు రావచ్చు. అదే ప్రతికూల పరిస్థితుల్లో నష్టాలు కూడా ఎదురుకావచ్చు.
ఇక నెలకు రూ.10,000 చొప్పున SIP చేస్తూ, ఏడాదికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే సుమారు 21 ఏళ్లలో కోటి రూపాయలకు పైగా సమకూర్చుకోవచ్చు. అంటే తక్కువ మొత్తంతో మొదలుపెట్టి, దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగిస్తే పెద్ద మొత్తాన్ని పోగు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ లెక్కను మరింత సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ప్రతి నెలా రూ.10,000 చొప్పున 21 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. ఈ కాలంలో మీరు పెట్టే అసలు మొత్తం రూ.25.20 లక్షలు అవుతుంది. దీనిపై ఏడాదికి సగటున 12 శాతం రాబడి లభిస్తుందని అంచనా వేస్తే, పెట్టుబడిపై వచ్చే లాభం సుమారు రూ.79.10 లక్షలుగా ఉంటుంది. దీంతో మీ మొత్తం పెట్టుబడి విలువ సుమారు రూ.1.04 కోట్లకు చేరుతుంది.
నెలవారీ పెట్టుబడి: రూ.10,000
సంవత్సర అంచనా రాబడి: 12 శాతం
పెట్టుబడి కాలం: 21 సంవత్సరాలు
మీరు పెట్టే అసలు మొత్తం: రూ.25,20,000
అంచనా లాభం: రూ.79,10,067
మొత్తం పెట్టుబడి విలువ: రూ.1,04,30,067
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇవన్నీ SIP కాలిక్యులేటర్ ఆధారంగా వేసిన అంచనా లెక్కలు మాత్రమే. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో 12 శాతం రాబడికి ఎలాంటి హామీ ఉండదు. వాస్తవానికి రాబడులు మార్కెట్ ఒడిదొడుకులను బట్టి మారవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు పథకం వివరాలు, రిస్క్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
SIP పూర్తి పేరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో ప్రతినెలా లేదా నిర్ణయించుకున్న వ్యవధిలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిగా పెడతారు. కొన్ని పథకాల్లో రూ.100 నుంచే SIP ప్రారంభించవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్ SIPల్లో రాబడులు స్థిరంగా ఉండవు. మార్కెట్ పరిస్థితులను బట్టి లాభాలు లేదా నష్టాలు రావచ్చు. ఇక లంప్సమ్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే విధానం. SIP అయినా, లంప్సమ్ అయినా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Read Also: PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?