GST Hike: త్వరలో పెట్టబోయే బడ్జెట్ కోసం కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. కొన్ని వస్తువులపై పన్ను పెంచాలని జీఎస్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల కమిటీ సూచన చేసింది. దీనిపై డిసెంబర్ 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఓ నిర్ణయం తీసుకోనుంది. ముందుగా ప్రతిపాదించిన వస్తువులపై ఇప్పుడున్న వాటితోపాటు కొత్తగా మరొక స్లాబ్‌ని తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది.
బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం అక్టోబరు 21న సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కూల్ డ్రింక్స్, సిగరెట్లు, పొగాకు సంబందించిన వస్తువులు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు పీటీఐ తన కథనంలో పేర్కొంది. ఇంతకీ మంత్రుల కమిటీ ఏయే వస్తువులపై ఫోకస్ చేసింది.
తొలుత కూల్ డ్రింక్, సిగరెట్లు, పొగాకు సంబంధిత వస్తువులపై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీన్ని 35 శాతానికి పెంచాలన్నది మంత్రుల బృందం సూచన. జీఎస్టీ స్లాబుల విషయాని కొద్దాం. ఇప్పటివరకు నాలుగు స్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి.
అందులో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం మాత్రమే ఉన్నాయి. కొత్తగా 35 శాతం స్లాబ్‌ని తీసుకురావాలన్నది కొత్త ప్రతిపాదన. కూల్ డ్రింక్స్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను 35 స్లాబ్‌లో పెట్టాలన్నది మంత్రుల కమిటీ సూచన.
ALSO READ: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
వీటికితోడు దుస్తులపై పన్ను రేట్లను సవరించాలనే ఆలోచన చేసిందట మంత్రుల బృందం. రెడీమేడ్ దుస్తులు రూ.1500 విలువ కలిగిన వాటిపై 5శాతం జీఎస్టీ విధిస్తోంది. రూ. 1,500 నుంచి రూ. 10,000 విలువ కలిగిన వస్త్రాలపై 18 శాతం, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాటిపై 28 శాతం జీఎస్టీ విధిస్తోంది. వీటి స్లాబ్‌లో మార్పులు ఉండనున్నాయి.
అలాగే ప్యాకేజ్ వాటర్‌పై జీఎస్టీని తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. 20 లీటర్లు అంతకంటే ఎక్కువ కలిగిన ప్యాకేజ్ వాటర్‌పై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదన చేసింది. వీటితోపాటు 10 వేల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన సైకిళ్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలనే ప్రతిపాదన సైతం లేకపోలేదు.
ఎక్కువ ధర కలిగిన షూలు, వాచీలపై జీఎస్టీని పెంచాలన్నది ప్రధాన సూచన. అన్నీ పరిశీలిస్తే 148 వస్తువులపై కొన్నింటికి జీఎస్టీ తగ్గాలంచాలని మరికొన్నింటికి పెంచాలన్నది మంత్రుల టీమ్ ప్రతిపాదించింది.
ఈనెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఆయా వస్తువులపై ఓ క్లారిటీ రానుంది. దీని తర్వాత కేంద్ర బడ్జెట్‌లో ఆయా వస్తువుల రేట్లు సవరించనున్నారు. కొన్ని పెరగ్గా, మరికొన్ని పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.