Treasure in Bihar: బంగారు నిధి.. ఎక్కడో మట్టిపొరల్లోనో, గుహల్లోనో ఎవరికి కనిపించకుండా ఉండి అందరిని మురిపిస్తూ.. ఆకర్షిస్తూ ఎవరికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతుంటోంది. అలాంటి నిధే ఇప్పుడు ఓ ప్రాంతంలో నిక్షేపంగా ఉందట.. ఇప్పుడా నిధి బయటికి వస్తే దేశం మొత్తానికి సరిపోయేంత నిధి బయటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారం ఇప్పటిది కాదు.. బ్రిటిష్ కాలం నాటిది కూడా కాదు.. మగధ రాజ్యం కాలం నాటి నుంచి జరుగుతున్న ప్రచారం ఇది. మరి ఇప్పటికీ ఈ నిధి ఎందుకు బయటికి రాలేదు..? అసలెక్కడుంది ఈ నిధి? ఈ నిధి వెనకాల మిస్టరీ ఏంటి?
ట్రెజర్ హంట్.. ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా.. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా.. ఇంకా కొన్ని అంతు చిక్కని మిస్టరీలు ఉన్నాయి. అందులో ఒకటి బీహార్‌లోని రాజ్‌గిర్ ఏరియాలోని సోన్ భండార్ గుహలు. ఆ పేరు చదివితేనే మీకు అర్థమవుతోంది. ఈ గుహలకు, బంగారానికి ఏదో లింక్ ఉందని. అంతేకాదు ఈ గుహలకు మనకు తెలిసిన మరో పేరుకు కూడా లింక్ ఉంది. అదే బింబిసారుడు. కళ్యాణ్‌రామ్ నటించి మంచి హిట్ కొట్టిన మూవీ పేరు కూడా బింబిసార. అతని పాత్రలోని కొన్ని షేడ్స్‌ను తీసుకొని దాని పరంగా కథను అల్లేసి సినిమాను రూపొందించి హిట్ కొట్టేశారు. కానీ మనం చెప్పుకోబోయే కథ బింబిసార గురించి కాదు.. అతడు చేసిన ఓ పని.. దాని కారణంగా మిస్టరీగా మిగిలిపోయిన అంశం గురించి.
భారత్ అంటేనే ఓ సుసంపన్నమైన దేశం. పూర్వకాలంలో మన దేశాన్ని పాలించిన రాజులు అత్యధిక సంపన్నులు. ఆ కాలంలోనే వజ్ర, వైడుర్యాలను వీధుల్లో రాశులుగా పోసి అమ్మడం జరిగేది. మాములుగా మార్కెట్లలోనే ఈ పరిస్థితి ఉంటే.. కీలక సామ్రాజ్యాలను పాలించిన రాజుల సంగతి ఏంటి మరి. అలాంటిది ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యమైన మగధను స్థాపించిన చక్రవర్తి బింబిసారుడి దగ్గర మరెంత ఉండాలి. 15 ఏళ్ల వయసులోనే ఓ గ్రామాధిపతిగా సింహాసనాన్ని అధిష్టించిన బింబిసారుడు.. ఆ తర్వాత ఏకంగా మగధ సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించి.. ఓ చక్రవర్తిగా మారాడు. అలాంటి బింబిసారుడు తన దగ్గర ఉన్న ఆపార సంపదను శత్రువులకు చిక్కకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ దాచాడని చరిత్ర చెబుతోంది. ఆ నిధి కేవలం తమ వారసులకు చెందాలని ఆ నిధి ఆచూకి తెలిసేలా చిత్ర రూపంలో.. వింత లిపిలో.. పత్ర నమూనాలో పొందుపరిచేవారని నమ్మకం.
నిజానికి బింబిసారుడు మాత్రమే కాదు.. అనేక మంది రాజులు ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు. అందుకే భారత్‌లో అనేక చోట్ల నిధి నిక్షేపాలు బయటపడ్డాయి. కానీ ఇప్పటికీ అనేక నిధి నిక్షేపాలు ఉన్నాయని తెలిసినా.. వాటిని చేరుకునే మార్గం లేక అలానే మట్టిపొరల్లోనో.. గుహల్లోనే మిగిలిపోయాయని నమ్ముతారు. అందులో ఒకటి సోన్ భండార్ గుహలు.
అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించిన బింబిసారుడు.. వృద్ధుడు కాగానే అతని సింహసనం కోసం అనేక సొంత కొడుకులే యుద్ధాలను చేసుకున్నారు. అతని కొడుకుల్లో ఒకరైన అజాత శత్రువు అత్యంత బలవంతుడు. అందుకే అతని సోదరులను ఒడించి.. సింహాసన్నాని ఆధిరోహించాడు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది.
కొడుకుల తీరును గమనించిన బింబిసారుడు తన వద్దనున్న అనేక వజ్ర వైడూర్యాలను రాజ్‌గిర్ దగ్గరున్న ఈ గుహలో దాచి ఉంచాడట. ఈ నిధి నిక్షేపాల గురించి అజాత శత్రువు ఆరా తీయగా తండ్రి సమాధానం ఇవ్వకపోవడంతో.. ఆగ్రహించి అతడిని జైలులో కూడా బంధించాడట. అయితే బింబిసారుడిని జైలు పాలు చేయడం వెనక.. మరెన్నో కారణాలు ఉన్నా.. ఈ నిధి ఆచూకి తెలుసుకోవడం కూడా ఒక కారణమని చెబుతారు. రాజ్‌గిర్ కోటలో నిధి ఉందని తెలుసుకున్న అజాతశత్రువు ముందుగా గాలింపు జరిపినా.. ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో నిధికి వెళ్లే దారి చెప్పాలంటూ తండ్రిని చిత్రవధ చేశాడట. కానీ బింబిసారుడు మొండితనం ముందు అజాతశత్రువు ఓడిపోయాడట. చివరికి అజాతశత్రవు కూడా బౌద్ధమతం స్వీకరించి ఈ నిధి గురించి మరిచిపోయాడట.
కానీ ఇప్పటికీ ఈ నిధి ఆ గుహలోనే ఉందని నమ్మేవారు అనేకం. మీరు ఇప్పుడు గుహ దగ్గరికి వెళ్లినా గుహలోకి వెళ్లిన వెంటనే నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది. అనంతరం నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. అక్కడ ఒక తలుపు.. దానిని తెరవడానికి వీలు లేనివిధంగా ఒక్క భారీ రాయి అడ్డుగా ఉంటుంది. అంతేకాదు ఆ రాయిపై శంఖం గుర్తు ఉంటుంది. దీనిపై తలుపు తెరిచే విధానం ఉందని నమ్ముతారు. అయితే గుహలోకి వెళ్ళే దారిని బింబిసారుడు తాను మరణించడానికి ముందు ఎవరికీ అర్ధం కానీ విధంగా ఇలా లిపిలో చెక్కించి నట్లు అక్కడ శాసనాలు ద్వారా తెలుస్తోంది. ఈ లిపిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చట. మరి ఈ నిధిని చేరుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదా? ఈ లిపిని చదివేందుకు చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? ఈ నిధిని చేరుకోవాలంటే చేయాల్సిన సాహసమేంటి?
నిధి ఉందని తెలుసు. ఏ ప్రాంతంలో ఉందో తెలుసు. అజాత శత్రువు నుంచి ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎందుకు చేధించలేకపోయారు?ఎందుకు ఈ నిధిని బయటికి తీయలేకపోయారు? ఇన్ని వందల ఏళ్లుగా ఈ నిధి అన్వేషణకు జరిగిన ప్రయత్నాలేంటి? అసలు ఏ ఒక్కరు కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఇదే విషయంపై ఫోకస్ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
ఈ గుహలకు పురాణాలకు కూడా ఓ లింక్ ఉందనే కథ ప్రచారంలో ఉంది. వాయు పురాణం ప్రకారం హర్యాంక రాజవంశం పాలనకు సుమారు 2 వేల 500 సంవత్సరాల ముందు ఈ ప్రాంతాన్ని బృహద్రథుడు పాలించాడని చెబుతారు. ఇతను శివభక్తుడైన జరాసంధుని తండ్రి. అతని తర్వాత జరాసంధుడు సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే చక్రవర్తి అవ్వాలనే కలతో.. దండయాత్ర చేపట్టాడంటారు. 100 రాజ్యాలను ఓడించడం లక్ష్యంగా పెట్టుకుని యుద్ధానికి పయనమయ్యాడు. దాదాపు 80 రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి అయ్యాడు. ఈ యుద్ధాల సందర్భంగా దోచుకున్న సంపదను మొత్తం విభరగిరి పర్వతం దిగువన ఒక గుహను నిర్మించి.. ఆ సంపదను అందులో దాచాడు. అయితే సోన్ భాండర్ గుహ కూడా అదే గుహకు సమాంతరంగా ఉంటుంది. ఆ తర్వాత కురుక్షేత్రంలో జరాసంధుడు మృతి చెందాడు. దీంతో ఆ నిధి కూడా ఈ గుహల్లోనే ఉందని నమ్మేవారు అనేక మంది ఉన్నారు.
ఆ కాలం నుంచి నేటి వరకు ఈ నిధిని వెలికి తీయాలని ప్రయత్నించిన వారు అనేకం. కానీ సక్సెస్ అయిన వారి సంఖ్య మాత్రం సున్నా. బ్రిటిష్ కాలంలో ఈ నిధిని వెలికి తీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనే ఈ గుహలు నాలుగో శతాబ్ధానికి చెందినవని అధికారికంగా తేల్చారు. ఈ గుహల్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా కనుగొన్నారు. ఇది జైనమతానికి చెందినదిగా గుర్తించారు. వైరదేవుడు అనే ముని ఈ గుహలను ఏర్పాటు చేశాడని శాసనాల్లో ఉన్నట్టు తేల్చారు.
ఈ గుహ ద్వారాన్ని తెరిచేందుకు ముందుగా అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోయే సరికి.. ఆ సమయంలో ఫిరంగులను ఉపయోగించి ద్వారాలను బద్దలు కొట్టాలని ప్రయత్నించారు. కానీ అవి కూడా ఫలించలేదట. దీంతో ఈ గుహల్లో ఉన్న నిధికి సంబంధించిన మిస్టరీ.. మిస్టరీగానే మిగిలిపోయింది.
ఆ తర్వాత చాలా మంది నిధులను శోధించేవారు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. చరిత్రకారులు, నిపుణులు ఎందరో వచ్చారు.. దీని రహస్యాన్ని చేధించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ కూడా ఆ నిధి ఆ గుహలోనే ఉందని.. సోన్ భండారం ద్వారం తెలిస్తే యావత్ దేశం బంగారు మయం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటారు కొందరు. దేశం రూపు రేఖలే మారిపోతాయంటారు మరికొందరు.
దీనికి తోడు గుహల్లోని రాయి చక్కగా పాలిష్ చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాదు గోడలపై ఉండే లిపి కూడా అస్సలు అర్థం కాదు. అందుకే ఈ గుహలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తారు. ప్రతి ఏటా ఈ ప్రాంతం గురించి కథలు కథలుగా విని ఒక్కసారైనా ఈ గుహలు ఎలా ఉన్నాయని చూసేందుకు వచ్చే వారు అనేకం.
అయితే ఇవ్వన్ని కట్టు కథలే అని అనేవారు మరికొందరు. నిజంగా నిధి నిక్షేపాలే ఉండి ఉంటే.. ప్రభుత్వాలు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వెలికితీసేవారని వాదిస్తున్నారు. ఏదేమైనా సోన్ భండార్ గుహ ఇప్పటికీ అనేక రహస్యాలను తనలో ఉంచుకుంది. బంగారాన్ని కూడా దాచుకునే ఉంటుందనే నమ్మకం కొందరిది. కాదని వాదించేవారు మరికొందరు. ఏదేమైనా సోనా భండార్ కథ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ మిస్టరీ విషయమే.. ట్రెజర్ హంటర్స్‌కు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే.
Story By Vamshi Krishna, Bigtv