వర్షం పడుతున్న సమయంలో గొడుగు పట్టుకుని రైల్వే ట్రాక్ మీది నుంచి నడిచి వస్తున్న సన్నివేశాలు సినిమాల్లో కామన్ గా కనిపిస్తాయి. అయితే, నిజ జీవితంలో ఎప్పుడూ గొడుగు పట్టుకుని రైల్వే ట్రాక్ ల మీద నడవకూడదంటున్నారు నిపుణులు. వాటి వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ట్రాక్ లపై నడుస్తున్నా, దాటుతున్నా, సమీపంలో నిలబడినా, గొడుగును, ముఖ్యంగా మెటల్ ఫ్రేమ్ ఉన్న గొడుగును ఉపయోగించకూడదంటున్నారు. అలా చేయడం వల్ల విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
రైల్వే ట్రాక్స్ దగ్గర గొడుగులు ఉపయోగించడం వల్ల పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. విద్యుదీకరించబడిన రైల్వే వ్యవస్థలలో.. రైళ్లు ఓవర్ హెడ్ వైర్ల నుండి 25,000 వోల్ట్స్(25 kV) విద్యుత్ తీసుకుంటాయి. ఈ వైర్లు రైలు ఇంజిన్ కు విద్యుత్ ను ప్రసారం చేస్తాయి. కరెంట్ ప్రత్యేకంగా రూపొందించిన వ్యవస్థ ద్వారా భూమికి తిరిగి వస్తుంది. ఇది ప్రయాణీకులకు ఎలాంటి ముప్పు కలిగించదు. అయితే, ఆ విద్యుత్ భూమికి తిరిగి వచ్చినప్పుడు, కొన్నిసార్లు ట్రాక్ దగ్గర ఉన్న వ్యక్తులతో, వస్తువులతో సంఘర్షణ చెందుతుంది. ప్రత్యేకించి గొడుగు లాంటి మెటల్ రాడ్, ఫ్రేమ్ తో కూడిన వస్తువులు కండక్టర్ గా పని చేస్తాయి. గొడుగు నేరుగా ఓవర్ హెడ్ వైర్లను తాకకపోయినా, విద్యుత్ వైర్ నుంచి గొడుగు లోహ భాగానికి గాలి ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆర్సింగ్ అని పిలువబడే ఈ ప్రక్రియ శక్తివంతమైన విద్యుత్ షాక్ కు దారితీస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.
విద్యుత్ షాక్ తీవ్రత ఓవర్ హెడ్ వైర్లకు మీరు దగ్గరగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. గొడుగు ఈ అధిక వోల్టేజ్ లైన్లకు దగ్గరగా వస్తే, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 25,000 వోల్ట్ ల దగ్గర ఒకే ఆర్క్ గుండెను తక్షణమే ఆపివేసేంత బలంగా ఉంటుంది. తీవ్రమైన గాయాలకు కారణం అవుతుంది. సెకన్లలో మరణానికి కూడా దారితీస్తుంది. తక్కువ దూరంలో ఉన్న వ్యక్తులకు తేలికపాటి షాక్ తగులుతుంది. గొడుగును కింద పడవేసేలా చేస్తుంది. బ్యాలెన్స్ కోల్పోయేలా చేస్తుంది.
ఓవర్ హెడ్ లైన్ల దగ్గర లోహ వస్తువులను తీసుకెళ్లడం, పైకి లేపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి భారతీయ రైల్వే పదేపదే హెచ్చరికలు జారీ చేసింది. గొడుగులు మాత్రమే కాకుండా, ఐరన్ రాడ్లు, ఐరన్ తీగలతో కూడిన బెలూన్లు, ఇతర వాహక వస్తువులను కూడా ట్రాక్ మీద తీసుకొని వెళ్లడం ప్రమాదకరం. ముఖ్యంగా రైల్వే ట్రాక్ లను దాటేటప్పుడు, లెవల్ క్రాసింగ్‌ల దగ్గర ఎప్పుడూ గొడుగును ఉపయోగించకూడదు. ఓవర్ హెడ్ వైర్ల దగ్గర ప్లాట్ ఫామ్ లపై గొడుగులను ఎత్తకుండా ఉండటం మంచిది. రైల్వే ట్రాక్ లపై నడవడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. ఇకపై రైల్వే పరిసరాల్లో గొడుగులు ఉపయోగించకపోవడం మంచిది.
Read Also: షాకింగ్.. రైలు నుంచి విడిపోయిన బోగీలు, గంట వ్యవధిలో ఏకంగా రెండుసార్లు!