iPhone 17 Air: టెక్నాలజీ ప్రియులకే కాదు, ప్రత్యేకించి ఆపిల్ అభిమానులకు సెప్టెంబర్ నెల అంటే పండగే. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ విడుదలవుతుందనే ఉత్కంఠను కలిగించే ఈ నెలలో, ఇప్పుడు కొత్తగా చర్చల్లో ఉన్నది – iPhone 17 Air. ఇది ఇప్పటి వరకూ వచ్చిన ఐఫోన్లలో కాస్త భిన్నంగా ఉండబోతోందనే వార్తలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి.
ఈ సారి ఆపిల్, గత ఐఫోన్ ప్లస్ వెర్షన్‌కు పూర్తిగా ముగింపు పలికి, కొత్తగా “Air” అనే పేరుతో ఓ సరికొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. పేరు వింటూనే ఊహించవచ్చు – ఈ ఫోన్ ఆకర్షణీయంగా, అందులోనూ చాలా స్లిమ్‌గా ఉండబోతోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, iPhone 17 Air సుమారు 5.5 మిల్లీమీటర్ల మందంతో రానుంది. ఇది ఇప్పటి దాకా వచ్చిన ఏ ఐఫోన్ కంటే పల్చగా ఉండనుందని తెలుస్తోంది. అదే విధంగా దీని బరువు కూడా సుమారు 145 గ్రాములు మాత్రమేనట. అంటే ఇది ఒక ప్యాకెట్‌లో పెట్టుకొని కూడా ఉన్నామా లేదా అన్నంత లైట్‌గా ఉండబోతుందన్నమాట.
ఫోన్ విషయానికి వస్తే, టిటానియం అల్యూమినియం మిశ్రమంతో దీన్ని తయారు చేస్తున్నట్టు సమాచారం. దీని వలన ఫోన్ ఒకవైపు లైట్‌గా ఉండి, మరోవైపు బలంగా కూడా ఉంటుందట. స్క్రీన్ పరంగా చూస్తే, ఇది సుమారు 6.6 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందివ్వనున్నట్టు సమాచారం. అంటే స్క్రోల్ చేస్తుంటే గానీ, వీడియోలు చూస్తుంటే గానీ చాలా స్మూత్‌గా అనిపించనుంది.
A19 ప్రో చిప్..
చిప్‌సెట్ విషయానికి వస్తే, ముందుగా దీంట్లో A19 బయానిక్ చిప్ వస్తుందనుకున్నారు. కానీ తాజాగా వచ్చిన లీకుల ప్రకారం, ఇందులో A19 ప్రో చిప్ వాడనున్నారట. అయితే ప్రో మోడల్స్‌తో పోలిస్తే దీనిలో ఒక GPU కోర్ తక్కువ ఉండనుందట. మరి పనితీరు పరంగా ఎంత తేడా ఉంటుంది అనేది సెప్టెంబర్ 9న విడుదల తర్వాతే తెలుస్తుంది. కానీ ర్యామ్ పరంగా చూస్తే, ప్రొ మోడల్స్‌లో ఉన్న 12GB ర్యామ్‌నే ఇందులో కూడా ఇచ్చే అవకాశం ఉందట. అంటే పవర్ యూజర్స్‌కి ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది.
అయితే ఒక సమస్య ఎప్పుడూ ఉంటుంది – ఎంత స్లిమ్ ఫోన్ అయితే అంత తక్కువ బ్యాటరీ సామర్థ్యం. అదే ఇప్పుడు ఈ ఫోన్ విషయంలోనూ ఉంది. దాదాపు 2900mAh సామర్థ్యం గల సిలికాన్ అనోడ్ బ్యాటరీ ఇందులో వాడబోతున్నారని సమాచారం. ఇది బ్యాటరీ పరంగా సామాన్యంగా కనిపించినా, దీని డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల పనితీరు బాగుండవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, దీని కోసం ప్రత్యేకమైన బ్యాటరీ కేస్‌ను ఆపిల్ విడిగా అమ్మబోతుందట. అంటే అదనంగా డబ్బు పెట్టి, అదనపు బ్యాకప్ కొనాలి.
ఇక మరో కీలక విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో USB-C పోర్ట్ కూడా ఉండదట. మొత్తం వైర్లెస్‌గానే ఉండేలా డిజైన్ చేస్తున్నారట. అంటే చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ అన్నీ వైర్లెస్‌గానే జరగాలి. కొందరికి వైర్లెస్ చార్జింగ్ అంటే నమ్మకం ఉండదు.
కెమెరా పరంగా చూస్తే..
కెమెరా పరంగా చూస్తే, దీంట్లో ఒకే ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా రేర్ వైపు ఉండనుంది. ఫ్రంట్ కెమెరా అయితే 24 మెగాపిక్సెల్. సెల్ఫీలు, వీడియో కాల్స్ పరంగా మంచి క్వాలిటీ అందించగలదని అంచనాలు. ఇంకా దీంట్లో ఫేస్ ఐడీ, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఆపిల్ ఓ కొత్త ట్రెండ్
కలర్స్ విషయానికొస్తే, ఈసారి ఆపిల్ ఓ కొత్త ట్రెండ్ మొదలుపెట్టబోతోంది. సాధారణ బ్లాక్, వైట్ కాకుండా, పాస్టెల్ బ్లూ మరియు లైట్ బ్రౌన్ లాంటి న్యూ కలర్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోంది. ఇవి ట్రెండీగా కనిపించి యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటాయన్నమాట.
ధర విషయానికి వస్తే, ఖచ్చితంగా చెప్పడం ఇప్పుడే కష్టం. కానీ ఆపిల్ గతంలో ఉన్న ప్లస్ మోడల్ ధర $899ని బేస్ చేసుకుంటే, ఇప్పుడు దీని ధర $949కి చేరే అవకాశం ఉందని Jefferies అనే సంస్థ అంచనా వేసింది. కానీ కొన్ని లీకులు చూస్తుంటే ఇది ప్రో మోడల్స్ కన్నా కొంచెం ఎక్కువ ధరకే వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
ఈ మొత్తాన్ని ఒకసారి గమనిస్తే, iPhone 17 Air అనేది ఆపిల్ యొక్క డిజైన్ విజన్‌కు ప్రతిబింబం లాంటి ఫోన్ అని చెప్పవచ్చు. తక్కువ బరువు, స్టైలిష్ రూపం, ప్రో లెవెల్ స్పెక్స్‌తో ఇది విభిన్నమైన యూజర్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. కానీ కనెక్టివిటీ పరంగా వైర్లెస్‌లో పూర్తిగా ఆధారపడటం, బ్యాటరీ పరంగా ఉన్న పరిమితి వంటి అంశాలు కొంతమందికి అసౌకర్యంగా అనిపించవచ్చు.
మొత్తానికి, ఇది ఒక స్టేట్మెంట్ ఫోన్ అని చెప్పొచ్చు – స్టైల్, లైట్‌వెయిట్, ప్రీమియం ఫీల్ కోరుకునేవారికి ఇది మంచి ఆప్షన్. కానీ దీన్ని కొనే ముందు మీ ఉపయోగానికి ఇది సరిపోతుందా అనే విషయాన్ని ఓసారి బాగా ఆలోచించాల్సిందే.