IPO Seasion: దీపావళి పండగ ఐపోవడంతో స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి మళ్లీ మొదలైంది. నవంబర్ 16 నుంచి దాదాపు మూడు కంపెనీలకు సంబంధించి ఐపీఓలు రాబోతున్నాయి. దీంతో పెట్టుబడిదారులతోపాటు చిన్న ఇన్వెస్టర్లలో ఆనందం మొదలైంది. ఇంతకీ ఆయా కంపెనీల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం.
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ సీజన్ సందడి మళ్లీ మొదలైంది. నవంబర్ 16 నుండి ఐపీఓ మార్కెట్ మరోసారి సందడిగా మారబోతోంది. రెండు ట్రేడింగ్ వారాలుగా మందకొడిగా ఉంది ఐపీఓ మార్కెట్. వచ్చే వారం మూడు కంపెనీలకు సంబంధించి మొత్తం రూ. 10,000 కోట్ల విలువైన ఐపీఓలతో రానున్నాయి. రెండు మెయిన్‌బోర్డ్ కాగా, మరొకటి ఎస్ఎంఈ ఐపీఓ ఉంది. అందులో కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ రూ. 9500 కోట్ల విలువతో ఐపీఓను రానుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ రూ. 455 కోట్ల ఐపీఓ, వట్రానా రెంటల్స్ రూ. 120 కోట్లతో రానుంది.
స్టాక్ మార్కెట్లలో గడిచిన నాలుగైదు నెలల్లో వచ్చిన మెజార్టీ ఐపీఓలు పెట్టుబడిదారులకు కాసుల పంట పండించాయి. కొన్ని ఏకంగా 100 శాతం రాబడులను పెట్టుబడిదారులకు అందించాయి. తాజాగా మెగా ఐపీఓ పెట్టుబడిదారులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా సబ్సిడరీ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. దాదాపు రూ. 9,500 కోట్ల ఐపీఓ నవంబర్ 19న ప్రారంభమై నవంబర్ 23న ముగియనుంది.
ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఉండనుంది. ఇష్యూ కింద కోల్ ఇండియా 661.8 మిలియన్ల ఈక్విటీ షేర్లు అంటే దాదాపు 10 శాతం వాటాను విక్రయిస్తోంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులు ప్రమోటర్ కంపెనీలకు వెళ్లనున్నాయి. నవంబర్ 27న స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానుంది. అనధికారిక మార్కెట్లో గ్రే మార్కెట్ ప్రీమియం- GMP ఒక్కో షేరుపై రూ. 13 లుగా ఉంది. ప్రైస్ బ్యాండ్‌ను బట్టి ఎంత శాతం ప్రీమియం అనేది ఇంకా తెలియాల్సివుంది.
క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ నవంబర్ 18 న ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్-ఐఎఫ్‌సీ మద్దతున్న వ్యవసాయ రసాయనాలు- విత్తనాల కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ మొదలుకానుంది. నవంబర్ 18న ప్రారంభమయ్యే ఐపీఓ నవంబర్ 20న ముగియనుంది. పెట్టుబడిదారులు రూ.259- రూ.272 ధరల శ్రేణిలో 55 షేర్ల చొప్పున బిడ్ చేయగలరు. రూ. 455 కోట్ల ఈ ఐపీఓ కింద రూ.355 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్ అంకుర్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 100.7 కోట్ల విలువైన 37.02 లక్షల షేర్లను విక్రయించనున్నారు. సమీకరించిన నిధులలో రూ. 270 కోట్లను కంపెనీ అప్పు తగ్గించడానికి ఉపయోగించనున్నారు. ఆగస్టు 2026 చివరి నాటికి కంపెనీకి రూ.962.6 కోట్ల అప్పు ఉంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఖర్చు చేయనుంది.
ALSO READ: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంకు కొత్త రూల్స్
వాట్రానా రెంటల్స్ ఐపీఓ.. SME సంస్థ. రూ.120 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPOను ప్రారంభించనుంది. ఇది కూడా నవంబర్ 19 నుండి 23 వరకు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉండనుంది. దీని ఇష్యూ రూ.232 నుంచి రూ.245 మధ్యలో ఉండనుంది. 600 షేర్ల లాట్‌లలో బిడ్‌ల తెరవనుంది. మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలను అందించే ఈ సంస్థ IPO ద్వారా కేవలం కొత్త షేర్లను జారీ చేస్తుంది. దీని ద్వారా వచ్చే నిధులలో రూ.98.12 కోట్లను మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు, ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫారమ్‌లు, బ్యాటరీల కొనుగోలుకు వినియోగించనుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.