Janakpur-Ayodhya Train Approved: భారత్, నేపాల్ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. నేపాల్ లోని జనక్‌పూర్ ధామ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వరకు కొత్త రైలు సర్వీసును నడిపేందుకు భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయణంతో సంబంధం ఉన్న రెండు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను కలిపే ఈ రైలు యాత్రికులు, పర్యాటకులతో పాటు సాధారణ ప్రయాణికులకు కూడా ఉపయోగపడనుంది.
తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రైలు జనక్‌పూర్ ధామ్ నుంచి అయోధ్య కాంట్ వరకు నడుస్తుంది. మొత్తం సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సీతాదేవి జన్మస్థలం జనక్ పూర్ ధామ్ ను, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యతో ఈ సర్వీసు లింక్ చేయనుంది.
ఈ రైలు ప్రయాణం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలు మీదుగా కొనసాగనుంది. మొత్తం 10 స్టేషన్లలో ఆగుతుంది. జయనగర్, సీతామఢి, మధుబని, శిషో, నర్కటియాగంజ్, రక్సాల్, గోరఖ్‌పూర్, మంకాపూర్, బస్తీ, అయోధ్య ధామ్ లో ఈ రైలు హాల్టింగ్ తీసుకోనుంది. ఈ ప్రాంతాల ప్రజలు అయోధ్య, జనక్‌పూర్‌లకు వెళ్లేందుకు మరో రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం ఈ రైలును ప్రతి దిశలో వారానికి ఒకసారి నడిపేందుకు ఆమోదం లభించింది. జనక్‌పూర్ ధామ్ నుంచి అయోధ్య కాంట్‌కు వెళ్లే రైలు ప్రతి శనివారం, అయోధ్య కాంట్ నుంచి జనక్‌పూర్ ధామ్‌కు తిరిగి వచ్చే రైలు ప్రతి సోమవారం నడవాల్సి ఉంది.
రైలు సర్వీసుకు ఆమోదం లభించినప్పటికీ, ప్రయాణికుల కోసం ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారనే విషయాన్ని రైల్వే ఇంకా ప్రకటించలేదు. అంతేకాదు, రైలు నంబర్లు, బయలుదేరే టైమింగ్స్, డెస్టినేషన్ చేరుకునే టైమింగ్స్, టికెట్ ధరలు, బుకింగ్ ప్రారంభ తేదీల వివరాలు కూడా వెల్లడించలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఈ రైలు అందుబాటులోకి వస్తే భారత్, నేపాల్ మధ్య ఆధ్యాత్మిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా రామాయణానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ప్రయాణం సులభమవుతుంది. అంతేకాకుండా, ఈ మార్గంలోని పట్టణాల్లో హోటళ్లు, పర్యాటక సర్వీసులు, స్థానిక వ్యాపారాలకు కూడా బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది.
Read Also: రైలు కిటికీలకు అద్దాలు ఉన్నా ఇనుప కడ్డీలు ఎందుకు? ఇదీ అసలు కథ!