LPG Gas Price: ఎల్పీజీ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు సవరిస్తుంటారు. నిత్యావసర వస్తువుల్లో కీలమైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులనుగుణంగా నవంబర్ 1న గ్యాస్ సిలిండర్ ధరలను సవరించారు. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ సిలిండర్ల ధరలను కొంత మేర తగ్గించారు. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ ధరను ఐదు రూపాయలు తగ్గించారు.
చమురు మార్కెటింగ్ కంపెనీల నిర్ణయంతపై చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు స్వల్ప ఉపశమనం కలగనుంది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం దిల్లీలో రూ.1,590.50గా ఉంది. నిన్నటి వరకు రూ.1,595.50 ఉన్న ధరను రూ.5 తగ్గించారు. మెట్రో నగరాల్లో సిలిండర్‌కు అత్యధికంగా రూ.6.50 తగ్గింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,694గా ఉంది. చెన్నైలో రూ.4.50 తగ్గి రూ.1,750, ముంబైలో రూ.1,542 (రూ.5 తగ్గింది)గా ఉంది.
రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సేవలు వంటి రోజువారీ కార్యకలాపాల కోసం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ వినియోగించే వ్యాపారాలకు ధరల తగ్గింపుతో స్వల్ప ఉపశమనం కలగనుంది. గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అన్ని నగరాల్లో ధరలు ఒకే విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.51.50 తగ్గించాయి.
గతంలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించిన విషయం తెలిసిందే. అంతకు ముందు, జూలై 1న గ్యాస్ ధరను రూ.58.50 తగ్గించారు. జూన్ ప్రారంభంలో చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్లపై రూ.24 తగ్గింపును ప్రకటించాయి. దీంతో గ్యాస్ రేటు రూ.1,723.50 గా ఉంది. ఏప్రిల్‌లో ధర రూ.1,762గా ఉంది. ఫిబ్రవరిలో స్వల్పంగా రూ.7 తగ్గగా, మార్చిలో రూ.6 పెరిగింది.
Also Read: Wrong UPI Payment: పొరపాటున వేరే UPIకి డబ్బులు పంపించారా? సింపుల్ గా ఇలా చేస్తే రిటర్న్ వచ్చేస్తాయ్!
పండుగ సీజన్‌లో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2.5 మిలియన్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌లను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు గత నెలలో మాదిరిగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉన్నాయి. దిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, హైదరాబాద్‌లో రూ.905 ధరలు ఉన్నాయి.