BSNL 4G Launch: దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన ఈ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ, గత కొంతకాలంగా ప్రైవేట్ కంపెనీల పోటీలో వెనుకబడింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా వంటి సంస్థలు ఆధునిక సాంకేతికతను అందించి 4జీ, 5జీ రంగంలో దూసుకెళ్లగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం నెమ్మదిగా సైడ్‌కి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తిరిగి తన స్థాయిని సంపాదించుకోవడానికి ఈ సంస్థ మరోసారి ముందుకు వస్తోంది. అదే స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 4జీ సేవలు.
నేడు (సెప్టెంబర్ 27)న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ లాంచ్‌ను గుజరాత్‌లో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఒకేసారి దేశమంతటా ఈ నెట్‌వర్క్ విస్తరించనుంది. దీంతో చాలా కాలంగా వేగవంతమైన ప్రభుత్వ నెట్‌వర్క్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఒక మంచి శుభవార్తగా మారింది.
ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ అంటే చాలామంది స్లో స్పీడ్ అని మాత్రమే అనుకునేవారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే ఈ 4జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా దేశీయంగా తయారు చేసిన సాంకేతికతతో నిర్మించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్‌గా ఈ సేవలు ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగమని అధికారులు ప్రకటించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం, ఈ కొత్త సర్వీసులు కేవలం 4జీ వరకే కాకుండా భవిష్యత్తులో 5జీకి కూడా మార్గం సుగమం చేయనున్నాయి.
ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం అందించడమే బీఎస్ఎన్ఎల్ ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీలు పట్టణాలకే పరిమితమైన సేవలు అందించగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉండేది. ఈసారి కొత్త టెక్నాలజీ, తక్కువ ధరల ప్లాన్లతో బీఎస్ఎన్ఎల్ మరోసారి వినియోగదారుల విశ్వాసం పొందగలదా అనే ఆసక్తి నెలకొంది.
బీఎస్ఎన్ఎల్ 4జీ సమర్థవంతంగా పనిచేస్తే, వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలతో పోటీ కూడా పెరుగుతుంది. బీఎస్ఎన్ఎల్ మళ్లీ పాత గౌరవాన్ని తెచ్చుకుంటుందా? లేక మళ్లీ స్లో నెట్‌వర్క్ అన్న ముద్రే మిగిలిపోతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. కానీ ఈ కొత్త ప్రారంభం మాత్రం టెలికాం రంగంలో కొత్త అవకాశాలను ప్రారంభించబోతోందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.