Thermavault Device: గ్రామీణ ప్రాంతాలు, విద్యుత్ సదుపాయం సరిగ్గా లేని చోట్లకు వ్యాక్సిన్లను సురక్షితంగా తీసుకెళ్లడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. కరెంట్ లేకపోవడం వల్ల వేల సంఖ్యలో డోసులు నిరుపయోగంగా మారుతుంటాయి. ఈ సమస్యకు ముగ్గురు టీనేజర్లు అద్భుత పరిష్కారాన్ని కనుగొన్నారు. కరెంట్, బ్యాటరీలు, ఐస్ అవసరం లేకుండా కేవలం ఉప్పు, నీళ్లతో పనిచేసే పోర్టబుల్ కూలింగ్ పరికరాన్ని రూపొందించారు.
ఇండోర్‌కు చెందిన ధృవ్ చౌదరి, మిథ్రన్ లధానియా, మృదుల్ జైన్ అనే ఈ ముగ్గురు విద్యార్థులు తాము తయారు చేసిన పరికరానికి ‘థర్మోవాల్ట్’ (Thermavault) అని పేరు పెట్టారు. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్ కోతల వల్ల వ్యాక్సిన్ల నిల్వలో తమ తల్లిదండ్రులు (వీరంతా వైద్యులే) ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులను వీరు దగ్గరగా చూశారు. ఎలాగైనా దీనికి సులువైన మార్గాన్ని కనుగొనాలనే పట్టుదలతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
ఈ థర్మోవాల్ట్ పరికరం బయటి భాగం ఇన్సులేటెడ్ ప్లాస్టిక్‌తో, లోపలి భాగం రాగి పూతతో తయారు చేశారు. మధ్యలోని ఖాళీ ప్రదేశంలో ఉప్పు, నీళ్ల ద్రావణం ఉండే ఏర్పాట్లు చేశారు. సాధారణంగా కొన్ని రకాల లవణాలు నీటిలో కరిగినప్పుడు చుట్టుపక్కల ఉండే వేడిని పీల్చుకుని వాతావరణాన్ని చల్లబరిచే శక్తి దానికి లభిస్తుంది. ఆ లవణాలు ఏంటో గుర్తించేందుకు ఈ యువకులు దాదాపు 150 రకాల ఉప్పులపై ఐఐటీ ల్యాబ్‌లలో రకరకాల ప్రయోగాలు చేశారు. చివరికి తమ తొమ్మిదో తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్‌లోని ‘బేరియం హైడ్రాక్సైడ్ ఆక్టాహైడ్రేట్’, ‘అమ్మోనియం క్లోరైడ్’ల కాంబినేషన్‌తో అనుకున్న ఫలితాన్ని సాధించారు.
అమ్మోనియం క్లోరైడ్‌ను నీటిలో కలిపినప్పుడు ఇది 2 నుండి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మెయిన్ టెన్ చేసింది. ఇది సాధారణంగా వ్యాక్సిన్లను భద్రపరచడానికి సరైన ఉష్ణోగ్రత. దీనికి బేరియం హైడ్రాక్సైడ్ ఆక్టాహైడ్రేట్ను కలిపినప్పుడు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే కిందకు పడిపోవడాన్ని టీనేజర్లు గుర్తించారు. భవిష్యత్తులో అవయవ మార్పిడి (Organ Transport) కోసం అవయవాలను తీసుకెళ్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఒకసారి ఈ ద్రావణం వేడెక్కిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ఆ నీటిని మరగబెట్టి ఉప్పును వేరుచేసి మళ్లీ కొత్త నీటితో దీనిని పునరుపయోగించుకోవచ్చని టీనేజర్లు సూచిస్తున్నారు.
ముగ్గురు టీనేజర్లు చేసిన ఈ ఆవిష్కరణకు ప్రతిష్టాత్మక ‘ఎర్త్ ప్రైజ్ 2025’ ఆసియా విభాగంలో దక్కింది. థర్మోవాల్ట్ విజేతగా నిలిచి 12,500 డాలర్ల (సుమారు రూ. 10 లక్షల కంటే ఎక్కువ) నిధులను గెలుచుకుంది. ఈ నిధులతో దాదాపు 200 థర్మోవాల్ట్ యూనిట్లను తయారు చేసి 120 ఆసుపత్రులలో విస్తృత పరీక్షల కోసం అందించాలని ఈ బృందం యోచిస్తోంది. ఇప్పటికే ఇండోర్‌లోని ‘V వన్’ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రయోగాల్లో ఈ పరికరం దాదాపు 10 నుండి 12 గంటల పాటు వ్యాక్సిన్లను సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉంచగలిగిందని వైద్యులు ధృవీకరించారు.
Also Read: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!
ఈ పరికరానికి డబ్ల్యూహెచ్ఓ (WHO) నుంచి పిక్వ్యూఎస్ (PQS) సర్టిఫికేషన్ పొందాలని టీనేజర్లు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యతలు చూసే ‘గావి’ (Gavi) వంటి సంస్థలకు ఈ థర్మోవాల్ట్ పరికరాన్ని అందించాలని భావిస్తున్నారు. తద్వారా వెనుకబడిన ప్రాంతాలకు ఈ సాంకేతికతను చేర్చడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
Also Read: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!