Daily SIP Investment: ప్రతీ రోజూ క్రమం తప్పకుండా కొద్ది మెుత్తంలో పొదుపు చేయడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకోవడం సాధ్యమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మనం చేసే చిన్న పొదుపులే కాలక్రమేణా ‘సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ (SIP) రూపంలో కొండంత నిధిగా మారతాయని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీరోజూ రూ.200 పెట్టుబడితో భవిష్యత్తులో రూ.20 లక్షల నిధిని ఎలా కూడబెట్టవచ్చో ఈ కథనంలో చూద్దాం.
రోజుకు రూ.200 పొదుపు చేయడం వల్ల నెలకు సుమారు రూ.6,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా నిలకడగా 12 ఏళ్ల 2 నెలల కాలం పాటు పెట్టుబడి కొనసాగిస్తే.. వడ్డీ, చక్రవడ్డీతో ఏకంగా రూ.20 లక్షల నిధిని సొంతం చేసుకోవచ్చని ‘ఇండ్ మనీ’ (INDmoney) చీఫ్ ఆఫ్ స్టాఫ్ ధైర్య షా తెలిపారు. సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇప్పుడు ఇండియన్, యుఎస్ స్టాక్స్‌లో కూడా డైలీ ఎస్ఐపీ (Daily SIP) సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ఇది గ్లోబల్ ఇన్వెస్టింగ్‌ను మరింత సులభతరం చేసిందని ఆయన పేర్కొన్నారు.
రూ.20 లక్షల నిధి కోసం ప్రతీ రోజూ రూ.200 పొదుపు ద్వారా నెలకు రూ.6000 వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సిప్ లో పెట్టుబడి పెడితే వార్షిక వడ్డీ సగటున 12 శాతం రానుంది. అటు 12 ఏళ్ల 2 నెలలకు గాను క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే మెుత్తం పెట్టుబడి రూ.8,90,600 అవుతుంది. దీనిపై వార్షిక వడ్డీలు, చక్రవడ్జీలు కలుపుకుంటే రూ.11,31,055 లక్షల లాభం సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మెుత్తంగా అసలు, లాభం కలుపుకుంటే రూ.20 లక్షల నిధి సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. ఒకవేళ రాబడి శాతంలో మార్పులు ఉంటే.. ఉదాహరణకు 10% వార్షిక రాబడి లభిస్తే రూ.20 లక్షల లక్ష్యాన్ని చేరడానికి దాదాపు 20 ఏళ్లు పట్టనుంది. అదే 15% వరకు రాబడి లభిస్తే కేవలం 14 సంవత్సరాలలోనే ఈ నిధిని చేరుకోవచ్చని చక్రవడ్డీ లెక్కింపులు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: చలికాలం స్పెషల్.. మార్కెట్లోకి ఇంటెక్స్ సరికొత్త ‘గీజర్లు’.. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు!
రూ.20 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణతో కూడిన రోజువారీ SIP ని ప్రారంభించడం ఎంతో అవసరమని ఇండ్ మనీ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ మిశ్రా పేర్కొన్నారు. పెట్టుబడిలో రిస్క్ తగ్గించుకోవడానికి భారతీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తో పాటు, యుఎస్ స్టాక్స్‌పై దృష్టి సారించే ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో వైవిధ్యంగా (Diversification) పెట్టుబడి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. దీనివల్ల దేశీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో స్థిరమైన రాబడి పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
Also Read: ప్రజలకు విజయ్ ప్రభుత్వం బిగ్ షాక్.. ఆటో ఛార్జీలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచుతూ నిర్ణయం!