ఆమె చేసిన న్యాయ పోరాటం పాకిస్తాన్ ప్రభుత్వాన్నే ఆలోచనలో పడేసింది. శానిటరీ ప్యాడ్స్ పై విధించిన పన్నులు రద్దు చేసే దిశగా ప్రభుత్వాన్ని కదిలించింది. ఒకవేళ రద్దు చేయకపోతే పాక్ ప్రభుత్వం న్యాయస్థానంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. దీంతో యువ మహిళా న్యాయవాది మహ్నూర్ ఒమర్ టాక్ ఆఫ్ పాకిస్తాన్ గా మారింది.
శానిటరీ ప్యాడ్స్ పై పన్ను..
భారత్, నేపాల్, యూకే వంటి దేశాల్లో శానిటరీ ప్యాడ్స్ పై ప్రభుత్వం పన్నులు విధించదు. అంటే ఇంచుమించి తయారీ ధరకే అవి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల పేదవారు కూడా శానిటరీ ప్యాడ్స్ ని కొనుగోలు చేసి ఉపయోగించే అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి లేదు. స్థానికంగా తయారు చేసిన ప్యాడ్స్‌పై 18 శాతం సేల్స్ ట్యాక్స్ విధిస్తున్నారు. దిగుమతి చేసుకునే వాటిపై 25 శాతం కస్టమ్స్ ట్యాక్స్, ఇతర స్థానిక పన్నులు ఉంటాయి. మొత్తం 40 శాతం వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా కలిపితే వాటి ధర మరింత పెరుగుతుంది. అంత ఎక్కువ ఖరీదు ఉన్న ప్యాడ్స్ ని వాడేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. దాని బదులు బట్టలు, ఇతర వస్త్రాలను వారు వాడుతున్నారు. అపరిశుభ్రత వల్ల అనారోగ్యాలబారిన పడుతున్నారు.
చిన్నప్పటి అనుభవం..
పాక్ న్యాయవాది మహ్నూర్ ఒమర్ చిన్నప్పటి నుంచి శానిటరీ ప్యాడ్స్ విషయంలో అసంతృప్తితో ఉండేవారు. స్కూల్ లో ప్యాడ్స్ మార్చుకోవాల్సి వస్తే ఏదో తప్పు చేస్తున్నట్టుగా సహచర విద్యార్థులు భావించేవారు. ఎవరికీ కనపడకుండా ప్యాడ్స్ ని బాత్రూమ్ కి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఆమె అప్పట్లోనే ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. దానిపై అవగాహన పెంచాలని ఆలోచించారు. పెద్దయ్యాక ఆమెకు ఆ సమస్య మరింత పెద్దది అనే విషయం తెలిసొచ్చింది.
పేదవారి సంగతేంటి?
చదువుకున్నవారు, మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన వారు.. శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు. పేదవారికి అసలు వాటి గురించే అవగాహన ఉండటం లేదు. చాలీ చాలని డబ్బులతో కనీస అవసరాలు తీర్చుకోలేనివారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి శానిటరీ ప్యాడ్స్ కొనే అవకాశమే ఉండదు. యునిసెఫ్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ లో కేవలం 12 శాతం మంది మహిళలే శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు. మిగిలినవారికోసం మహ్నూర్ ఒమర్ ఓ ఉద్యమం చేపట్టింది. అప్పటికే కొన్ని సామాజిక సంస్థలు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇతర అవగాహన సామగ్రి పంపిణీ చేస్తున్నాయి. పాకిస్తాన్ లో మహ్వారీ జస్టిస్ వంటి సంస్థలు 1 లక్ష పీరియడ్ కిట్లు పంపిణీ చేశాయి. వాటిలో శానిటరీ ప్యాడ్స్, సబ్బులు, నొప్పి నివారణ మాత్రలు, ఇతర మందులు ఉంటాయి.
అసలు సమస్య అదే..
శానిటరీ ప్యాడ్స్ ధరలు పేదవారికి కూడా అందుబాటులో ఉంటే అప్పుడు వాటి వినియోగం మరింత పెరుగుతుందని మహ్నూర్ ఒమర్ ఆలోచించారు. వాటి ధరలు పెరగడానికి అసలు కారణం పన్నులు అని తేల్చారు. అందుకే ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వం విధిస్తున్న 40 శాతం పన్నులకు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. చివరకు ప్రభుత్వాన్నే కోర్టుకీడ్చారు. ప్రపంచ దేశాలు శానిటరీ ప్యాడ్స్ పై పన్నులు రద్దు చేస్తున్న తరుణంలో పాకిస్తాన్ వాటిని మరింత పెంచుకుంటూ పోవడం సరికాదంటున్నారామె. చాలామంది కనీసం చర్చించడానికి కూడా ఇబ్బందిపడే ఇలాంటి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, కోర్టులో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేయడం పట్ల మహ్నూర్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె పోరాటం ఫలించాలని కోరుకుంటున్నారు. మహ్నూర్ ధైర్యానికి పాకిస్తాన్ మహిళలు సలాం అంటున్నారు. ఆమెతో కలసి తాము కూడా న్యాయపోరాటంలో భాగం అవుతామని చెబుతున్నారు. ఈ అనూహ్య మద్దతుతో ఇప్పుడు మహ్నూర్ పేరు పాకిస్తాన్ లో మారుమోగిపోతోంది.
Also Read: డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!