ప్రపంచ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టాహాసంగా జరిగాయి. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ సహా పలు దేశాల్లో ఉంటున్న భారతీయులు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లను విద్యుత్ దీపాలతో అద్భుతంగా ఆలంకరించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పటాసులు పేల్చుతూ హ్యాపీగా జాలీగా ఈ వేడుక జరుపుకున్నారు. స్వీట్స్ పంచుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దీపావళి వేడుకలు ఇండియాలో కంటే ఘనంగా జరిగాయి.
ఇతర దేశాల్లో దీపావళి వేడుకలు కన్నుల పండుగగా జరగగా, కెనడాలో మాత్రం ఈ సంబురాలు అగ్ని ప్రమాదాలకు కారణం అయ్యాయి. బాణాసంచా పేలుళ్ల కారణంగా రెండు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కెనడాలోని సౌత్ ఎడ్మంటన్ లో దీపావళి వేడుకలు ప్రారంభమైన కాసేపటికే అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం (అక్టోబర్ 20న) రాత్రి సమయంలో చాలా మంది భారతీయులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాల్చిన క్రాకర్స్ మిస్ ఫైర్ అయ్యాయి. సమీపంలోని ఇళ్ల మీదికి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 25వ అవెన్యూ, 24వ వీధి సమీపంలోని మిల్ వుడ్స్ పరిసరాల్లో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెనుక ప్రాంగణం నుంచి కాల్చిన బాణసంచా కారణంగా సమీపంలోని రెండు ఇళ్లలో మంటలు చెలరేగాయి.
విషయం తెలుసుకు ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలు అదృష్టవశాత్తూ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, రెండు ఇళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ అధికారులు కేసు నమోదు చేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఈ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. పర్మిట్ లేకుండా సిటీ పరిధిలో బాణసంచా పేల్చడం చట్టవిరుద్ధమన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పేల్చడం చాలా ప్రమాదకరం అన్నారు.
Read Also: జాబ్ కోసం అమెరికా వెళ్లి.. గ్రీన్ కార్డు రాగానే రిజైన్ చేశాడు.. ఇప్పుడు రూ.24,079 కోట్లకు అధిపతి!
బాణాసంచా అమ్మాలన్నా, పేల్చాలన్న అనుమతి అవసరం అని EPS, ఎడ్మంటన్ ఫైర్ రెస్క్యూ సర్వీసెస్ (EFRS) అధికారులు వెల్లడించారు. కానీ, తాజా ఘటనలో ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి క్రాకర్స్ కాల్చడంతో పాటు మంటలు చెలరేగి, ఇళ్లు ధ్వంసం అయ్యేందుకు కారణం అయిన వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: ఈ ఏడాది హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ వచ్చేసింది, ఆ దేశానికి మళ్లీ ఫస్ట్ ర్యాంక్!