వడ్డీ రేట్లు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. బ్యాంకులయినా, పోస్టాఫీస్ అయినా చాలామంది తమ డబ్బు సురక్షితంగా ఉంటుందని మాత్రమే దాచుకుంటున్నారు కానీ, వడ్డీతో లాభాలపండుతుందనే ఆలోచన, అంచనా ఎవరిలోనూ లేదు. గతంలో పోస్టాఫీస్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే ఐదేళ్లకు మన సొమ్ము రెట్టింపు అయ్యేది, ఇప్పుడది 9ఏళ్లకు పైమాటే. నగదు రెట్టింపు అయ్యే దీర్ఘకాలిక పథకాలను బ్యాంకులు అస్సలేమాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడంతా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిప్.. ఇదీ వ్యవహారం. అయితే వీటిపై సగటు భారతీయుడు ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం పెంచుకోలేదు. షేర్ మార్కెట్ పడిపోతే పరిస్థితి ఏంటి అనే అనుమానం అందరిలో ఉంది. అలాంటి వారికోసమే పోస్టాఫీస్(Post Office) ఓ మంచి స్కీమ్ తీసుకొచ్చింది. జాగ్రత్తగా మదుపు చేసుకుంటూ పోతే పదేళ్లలో మనం రూ.17లక్షలు పొందవచ్చు. ఆ స్కీమ్(Scheme) వివరాలు ఇవిగో..
రోజుకి రూ.333 జమ
పదేళ్ల తర్వాత ఏకమొత్తంలో రూ.17లక్షలు
క్లుప్తంగా ఇవీ ఈ స్కీమ్ యొక్క వివరాలు.
పోస్ట్ ఆఫీస్ బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీస్ లో రికరింగ్ డిపాజిట్ ని నెలనెలా కనిష్టంగా 100 రూపాయలతో ప్రారంభించవచ్చు. అయితే ఇందులో డైలీ 333 రూపాయల స్కీమ్ మాత్రం అత్యధిక ప్రయోజనాన్ని ఇస్తుందని అంటున్నారు. ఈ రికరింగ్ డిపాజిట్ పై 6.7 శాతం వార్షిక వడ్డీని పోస్ట్ ఆఫీస్ చెల్లిస్తుంది.
రూ.333 తో 17 లక్షలు ఎలా..?
ప్రతి రోజూ మనం 333 రూపాయలు డిపాజిట్ చేస్తే, నెలకు అది దాదాపు రూ.10వేలు అవుతుంది. అంటే ఏడాదికి లక్షా 20వేల రూపాయలు మనం జమచేస్తామన్నమాట. ఐదేళ్లలో ఇది మెచ్యూర్ అవుతుంది. ఈ మెచ్యూరిటీ కాలంలో మనం జమ చేసేది దాదాపు 6 లక్షల రూపాయలు. దీనికి 6.7 శాతం రేటుతో చక్రవడ్డీని లెక్కేస్తే వడ్డీ మొత్తం రూ. 1,13,659 అవుతుంది. అంటే, మీ మొత్తం మొత్తం రూ. 7,13,659 అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. అయితే దాన్ని మనం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. అంటే ఈ ఆర్డీ పథకాన్ని 10 సంవత్సరాల వరకు మనం సద్వినియోగం చేసుకోవచ్చు. రోజుకి రూ.333 పొదుపు చేస్తే 10 సంవత్సరాలలో మనం డిపాజిట్ చేసిన మొత్తం దాదాపు రూ. 12,00000 అవుతుంది, దానిపై వచ్చే చక్రవడ్డీ రూ. 5,08,546 అవుతుంది. అంటే పదేళ్ల తర్వాత, అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 17,08,546 మనకు లభిస్తుంది.
మన దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఇళ్లలో పొదుపు చేయడానికి అనేక రకాల అవకాశాలు వినియోగించుకుంటారు. రోజువారీ కొంతమొత్తాన్ని హుండీలో దాచుకుంటారు. అలా ఇంటిలోనే దాచుకోవడం కంటే, దాన్ని పోస్టాఫీస్ లో దాచిపెడితే పదేళ్లకు పెద్ద మొత్తంగా మన చేతికి అందుతుంది. రోజుకి రూ.333 దాచుకునే ఈ రికరింగ్ డిపాజిట్ పథకంపై ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. పదేళ్ల తర్వాత పెద్దమొత్తం తీసుకోడానికి చిన్నమొత్తం కూడబెడుతున్నారు. చిన్న మొత్తాలతో పెద్ద మొత్తం, అది కూడా అసలుకి మోసం రాకుండా గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవాలంటే ఇదే ప్రస్తుతం ఉన్న బెస్ట్ ఆప్షన్.