సూర్యుడి చుట్టూ గ్రహాలు, వాటి చుట్టూ ఉపగ్రహాలు వేర్వేరు కక్ష్యల్లో భ్రమిస్తుంటాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ గ్రహాల మధ్య కొన్ని గ్రహశకలాలు కూడా తిరుగుతుంటాయి. వీటికి నిర్దిష్ట కక్ష్యలు కానీ, మార్గం కానీ ఉండదు. విశ్వంలో ప్రమాదం అంటూ జరిగితే అది వీటితోనే. ఈ గ్రహ శకలాలు ఢీకొంటే గ్రహాల స్థితిగతులు మారుతాయని చెప్పలేం కానీ, ప్రమాదం పొంచి ఉందనే వార్తల్ని మాత్రం కొట్టిపారేయలేం. అలాంటి ఓ అరుదైన ప్రమాదం 2032లో రాబోతోంది.
భూమి సేఫేనా..?
2024 YR4. ప్రస్తుతం సూర్యమండలంలో అత్యంత చురుగ్గా కదులుతున్న గ్రహశకలం ఇది. దీని వ్యాసం 53 నుంచి 67 మీటర్లు ఉంటుంది. దీని పరిమాణం 10 అంతస్తుల పెద్ద బిల్డింగ్ అంత ఉంటుంది. 2024 డిసెంబర్‌లో చిలీలో ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) ద్వారా దీన్ని మొదటగా గుర్తించారు. ఆ సమయంలో అది భూమికి 8,29,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2032లో ఇది భూమిని ఢీకొట్టవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీన్ని తిప్పికొట్టేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ దాని గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భూమిని ఢీకొనే సంభావ్యత దాదాపు సున్నాగా తేలింది. అయితే అప్పుడే వారికి కొత్త విషయం తేలింది. అది భూమివైపు కాకుండా, చంద్రుడివైపు వెళ్తుందని వారు తేల్చారు. 2023 డిసెంబర్ 22న ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటుందని నిర్థారించారు. నాసా పరిశోధనల్లో ఈ ముప్పు 3.8 నుండి 4.3 శాతానికి పెరిగిందని తెలుస్తోంది.
ఏం జరుగుతుంది..?
గ్రహ శకలం చంద్రుడిని ఢీకొంటే ఏమవుతుంది..? ఇప్పటికే చాలా గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొట్టాయి. అందుకే చంద్రమండలంపై లోతైన లోయలు ఉన్నట్టుగా కనపడతాయి. కానీ ఈసారి ఢీకొనేది చాలా పెద్దది, అందులోనూ దాని వేగాన్ని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు. ఇది ఢీకొంటే చంద్రుడిపై మరో లోయ ఏర్పడటంతోపాటు దాని కక్ష్యలో మార్పు కూడా చోటు చేసుకోవచ్చని అనుమానిస్తున్నారు. అదే మరికొందరు మాత్రం అలాంటి ప్రమాదం ఏమీ ఉండదని ధీమాగా చెబుతున్నారు. గ్రహశకలాలు ఢీకొంటే చంద్రుడి లాంటి ఉపగ్రహాల కక్ష్యలో మార్పులేవీ ఉండబోవని అంటున్నారు. ఒకవేళ ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటే, దాని ద్వారా ఏవైనా శిథిలాలు భూమి వైపు దూసుకొచ్చినా కూడా.. అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి వచ్చేలోపే అవి పేలిపోతాయని అంటున్నారు.
జేమ్స్ వెబ్..
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొన్నాళ్లుగా 2024 YR4 గ్రహశకలాన్ని గమనిస్తోంది. భూమినుంచి ఇది చాలా దూరం వెళ్లినప్పటికీ దాని మార్గాన్ని పసిగడుతూనే ఉంది. ప్రస్తుతం ఇది సూర్యుడి వెనక దాగి ఉందని, ఇకపై ఇది కొంతకాలం కనపడదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2028 లో ఈ ఆస్టరాయిడ్ తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 2032 నాటికి ఇది చంద్రుడి కక్ష్యకు అడ్డుగా వస్తుందని, అప్పుడే చంద్రుడిని ఢీకొంటుందని చెబుతున్నారు. 2028 తర్వాత మరికొన్నేళ్లు దీని గమనాన్ని పరిశీలిస్తే అది చంద్రుడిని ఢీకొనే సంభావ్యత పెరిగిందా, తగ్గిందా అనేది అంచనా వేయవచ్చు. అయితే 2032లో మాత్రం చంద్రుడిని ఢీకొట్టడం ఖాయం అనే భావనకు వచ్చారు. అది ఒకవేళ భూమికి ఎదురుగా ఉన్న వైపు చంద్రుడిని ఢీకొంటే దాని చర్యను ప్రత్యక్షంగా మనం చూడవచ్చు.