PPF Loan Rules: మన దగ్గర డబ్బు అవసరమైనప్పుడు ముందుగా గుర్తొచ్చేది పర్సనల్ లోన్ లేకపోతే క్రెడిట్ కార్డు. కానీ మనం భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బుపైనే తక్కువ వడ్డీకి అప్పు తీసుకునే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. అలాంటి సదుపాయమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాలో ఉంది. సాధారణంగా పీపీఎఫ్‌ను దీర్ఘకాలిక పొదుపు పథకంగా చూస్తారు. అయితే ఇందులో పెట్టుబడి పెట్టినవారికి మధ్యలో డబ్బు అవసరమైతే రుణం తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. పర్సనల్ లోన్ తో పోలిస్తే ఈ లోన్‌పై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షల చొప్పున ఐదేళ్లు పీపీఎఫ్‌లో జమ చేస్తే ఎంత రుణం తీసుకోవచ్చు? ఎప్పుడు తీసుకోవచ్చు? తెలుసుకుందాం.
పీపీఎఫ్ ఖాతా తెరిచిన వెంటనే రుణం తీసుకోవడానికి వీలుండదు. ఖాతా ప్రారంభించిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఆర్థిక సంవత్సరం వరకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు గతంలో తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాతే మరో రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఒక వ్యక్తి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 5వ తేదీ లోపే రూ.1.50 లక్షల చొప్పున పీపీఎఫ్‌లో జమ చేస్తున్నారని అనుకుందాం. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ లెక్కన 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆయన ఖాతాలో సుమారు రూ.7.14 లక్షలు ఉంటాయి. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో లోన్ తీసుకోవాలనుకుంటే, అప్పటి ఖాతా నిల్వను కాకుండా రెండేళ్ల ముందు ఉన్న నిల్వను పరిగణనలోకి తీసుకుంటారు.
నిబంధనల ప్రకారం ఆ మొత్తంలో 25 శాతం వరకు మాత్రమే రుణం తీసుకోవచ్చు. అంటే రూ.7.14 లక్షల్లో 25 శాతం లెక్కిస్తే సుమారు రూ.1.79 లక్షలు అప్పుగా పొందవచ్చు. ఐదేళ్ల పాటు డబ్బు జమ చేసినప్పటికీ, లోన్ లెక్కలోకి వచ్చే పాత నిల్వ ఆధారంగానే అర్హతను నిర్ణయిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలి.
పీపీఎఫ్ లోన్‌లో కలిసొచ్చే అంశం దానిపై వసూలు చేసే వడ్డీ. తీసుకున్న అప్పును 36 నెలల్లోపు పూర్తిగా చెల్లిస్తే ఏడాదికి కేవలం 1 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.1,78,583 రుణం తీసుకుని ఏడాదిలోపు అసలు మొత్తాన్ని చెల్లిస్తే, సుమారు రూ.1,785 వడ్డీ అవుతుంది. అయితే 36 నెలల్లోపు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే మాత్రం వడ్డీ భారం పెరుగుతుంది. అప్పుడు 1 శాతానికి బదులుగా 6 శాతం వడ్డీ వర్తిస్తుంది. అంతేకాదు ఈ అధిక వడ్డీ రుణం తీసుకున్న తర్వాతి నెల మొదటి తేదీ నుంచి లెక్కిస్తారు. అంటే ఆలస్యం చేసిన కాలానికి మాత్రమే కాకుండా, ముందున్న కాలానికి కూడా 6 శాతం లెక్క పడుతుంది.
పీపీఎఫ్‌పై రుణం తీసుకోవడం తక్కువ వడ్డీతో డబ్బు సమకూర్చుకునే మార్గమే అయినప్పటికీ, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో ముందే చూసుకోవాలి. 36 నెలల్లోపు రుణాన్ని చెల్లించలేకపోతే వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి అత్యవసర అవసరాల కోసం మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పీపీఎఫ్ (PPF) ఖాతాపై లోన్ పొందాలంటే, మీరు ఖాతా తెరిచిన సంవత్సరం, గతంలో మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగానే అర్హతను లెక్కిస్తారు. కాబట్టి, ప్రస్తుతం మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బుపై లోన్ వస్తుందని అనుకోకూడదు. లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే, మీకు ఎంత అప్పు వస్తుంది, వడ్డీ ఎంత, ఎన్ని నెలల్లో తిరిగి కట్టాలి అనే పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవడం మంచిది.
Read Also: నెలకు 15 వేల పెట్టుబడి… 15 ఏళ్లలో కోటి… ఈ 15-15-15 రూల్ తెలుసా?