Parliament Sessions: పార్లమెంటరీ సమావేశాల నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమై క్రిస్మస్‌కు ముందు ముగిసే శీతాకాల సమావేశాలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళనకరమన్నారు. సమావేశాల ముగింపునకు సంబంధించి రాష్ట్రపతికి సిఫార్సు చేయకుండా 100 రోజులకు పైగా పార్లమెంట్‌ను ప్రోరోగ్ చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులకు కనీసం 15 రోజుల ముందుగా సమావేశాల నోటిఫికేషన్ అందితేనే తమ నియోజకవర్గాలు, రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను ప్రశ్నోత్తరాల ద్వారా సభలో ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈసారి అటువంటి అవకాశం కల్పించకపోవడం తెలంగాణకు, తన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా అడ్డుకోవడమేనని విమర్శించారు.
Also read: తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?
డీలిమిటేషన్‌ను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకునేందుకే శీతాకాల సమావేశాలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఇతర రాజకీయ పార్టీలతో చర్చించకుండా, తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో మాత్రమే సంప్రదింపులు జరుపుతూ, విభేదించే పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, 2023లోనే 17వ లోక్‌సభలో 543 మంది సభ్యులలో 540 మంది ఆ బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్‌ను ముడిపెట్టి, రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బీజేపీ ప్రయత్నించడం సరికాదన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలను కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నిర్వహించడం బాధాకరమన్నారు. పార్లమెంట్ సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించకుండా, ప్రశ్నోత్తరాలు లేకుండా, తమకు అనుకూలమైన బిల్లులను ఆమోదించుకునే విధంగా సభను నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలు, భువనగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు అవకాశం లేకుండా చేయడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.
Also read: ఇక పై గ్రామ పంచాయతీలకు ఆ అధికారాలు కట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!