Cyberabad Traffic: ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ ప్రాంతంలో త్వరలోనే వన్ వే విధానాన్ని అమలు చేయనున్నట్టు డీజీపీ సీ.వీ.ఆనంద్ చెప్పారు. దాంతోపాటు ప్రత్యేకంగా బస్ లైన్ ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్ పై దృష్టిని కేంద్రకరించనున్నట్టు తెలిపారు. ఐటీ కంపెనీల పనివేళలు కూడా మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగనున్న సైబరాబాద్ మూవ్స్ 2026 సదస్సును డీజీపీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్ల అనుసంధానం సరిగ్గా లేదని డీజీపీ ఆనంద్ అన్నారు. చిన్నపాటి వర్షం పడ్డా వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారన్నారు. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ తరహాలో వన్ వే లూప్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, యూ టర్న్‌లు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారి కోసం ప్రత్యేక క్యారేజ్ వే, కౌంటర్-ఫ్లో బస్ లేన్ వంటి వినూత్న ప్రయోగాలు చేయాలని డీజీపీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను మార్చినపుడు మొదట్లో రెండుమూడు రోజులు వచ్చే విమర్శలకు పోలీసులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. మియాపూర్ లో రోడ్ల వెడల్పు, కంపెనీల భాగస్వామ్యంతో ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ప్రజా రవాణాపై అవగాహన కల్పించాలని తెలిపారు. చిన్న ప్రాంతంలోనే 10 లక్షల ఉద్యోగాలు, నివాస ప్రాంతాలు కలిసిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిందని డీజీపీ చెప్పారు. మెట్రో విస్తరణ, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల సేవలు మెరుగుపడితేనే ట్రాఫిక్ కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
Also read: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత్‌లో ఆ పాక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు బ్రేక్!
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేశ్ మాట్లాడుతూ రోడ్డు స్థలం పరిమితంగా ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. సైబరాబాద్ లో కేవలం రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు 9లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను సమర్థంగా నిర్వహించటం అవసరమని చెప్పారు. నేరాల బారిన పడేది 3నుంచి 5శాతం మంది మాత్రమే అని చెబుతూ ట్రాఫిక్ సమస్యలు వంద శాతం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. నగరమంటే కేవలం నివాస ప్రాంతం కాదని, ఆర్థిక కార్యకలాపాల కేంద్రమని తెలిపారు. రాష్ట్ర జీడీపీలో కోర్ అర్బన్ రీజియన్ వాటా 66 శాతం ఉందని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారన్నారు. ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలన్న ఆలోచనలో 21 పౌర సమాజ సంస్థలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. టీ-హబ్, టీ-వర్క్స్ నుంచి 28 స్టార్టప్ కంపెనీలు ‘సైబరాబాద్ మూవ్స్’లో చేరడం శుభపరిణామమని చెప్పారు.
సైబరాబాద్ మూవ్స్ తొలిరోజు కార్యక్రమంలో భాగంగా 15కు పైగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ‘కార్పొరేట్ మొబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ ప్రతిజ్ఞ’ చేశారు. ఉద్యోగుల రాకపోకల కోసం వినియోగించే వ్యక్తిగత వాహనాల సంఖ్యను 2027 నాటికి 10 శాతం తగ్గించాలన్నది ఈ ప్రతిజ్ఞ ప్రధాన లక్ష్యం. కార్‌పూలింగ్, ప్రజా రవాణా వినియోగం, చివరి మైలు అనుసంధానం, అధిక సామర్థ్యం కలిగిన వాహనాలు, సంస్థల ప్రత్యేక బస్సులు, ఇంటి నుంచి పనిచేసే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. ‘హాయ్ బోలో.. దిల్ ఖోలో.. నో సోలో.. సాథ్ చలో’ అనే నినాదంతో కార్‌పూలింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. సదస్సులో లండన్ ట్రాన్స్ పోర్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశివర్మ, బగోటా సిటీ మేయర్ ఎన్రికీ పెనలోజా హాజరయ్యారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు, స్కూల్, కాలేజీల విద్యార్థులు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also read: రాహుల్ గాంధీపై.. సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్!