Harshavardhan:హర్షవర్ధన్..అమృతం సీరియల్ తో మనల్ని ఎంతగానో అలరించిన ఈ వెర్సటైల్ యాక్టర్ పలు మనం,గుండె జారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకి మాటల రచయితగా పని చేశాడన్న సంగతి మనకు తెల్సిందే. ఇక ప్రస్తుతం ఆలియాస్ రుక్మిణి వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలు పోషిస్తున్న హర్షవర్దన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.ముఖ్యంగా ఫైనాన్షియల్ డిసిప్లెన్,అమ్మానాన్నలతో ఉండే అనుబంధం వంటి విషయాలపై ఆయన చెప్పిన మాటలు ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే EMI జోలికి వెళ్లడం తనకు అస్సలు ఇష్టం ఉండదని ఉదాహరణకు ఒక పది లక్షల రూపాయల కారు కొనాలనుకుంటే, ఆ మొత్తం డబ్బు చేతిలో ఉన్నప్పుడే ఒకేసారి కట్టి కొనేయాలనే ఆలోచన తనకు ఉంటుందని తెలిపారు. అప్పులు చేసి, ప్రతినెలా ఈఎంఐలు కట్టే టెన్షన్ పెట్టుకోవడం కంటే ప్రశాంతంగా బతకడం ముఖ్యమని చెప్పుకొచ్చారు.
అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న ఫైనాన్షియల్ అవేర్‌నెస్ వీడియోలు చూస్తుంటే, తన ఆలోచన అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తోందని ఒప్పుకోవడం విశేషం. పది లక్షల రూపాయలు ఒకేసారి కారుపై పెట్టే బదులు, కొంత డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో మంచి లాభం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నానని వివరించారు.
డబ్బు సంపాదించడం మాత్రమే జీవితం కాదని, ఆ డబ్బు కోసం మనకు ఇష్టం లేని పనులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాకూడదని హర్షవర్ధన్ తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు.అందుకే తనకు వచ్చే ఆఫర్లలో నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని ,నటుడిగా వచ్చే సంపాదన తనకు అవసరమైన లగ్జరీ లైఫ్ స్టైల్ కి సరిపోతుందని తెలిపారు.
అందరూ తమ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు పెట్టుకుంటూ ఫ్యూచర్ కోసం కొంతైనా సేవ్ చేసుకోవాలని జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవని, ఈరోజు బాగా సంపాదిస్తున్నాం కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే రేపు టైం బాగోలేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తుచేశారు.
ఇక బయట ఫ్రెండ్స్‌తో గంటలు గంటలు బాతాకానీ కొట్టడానికి , సినిమాలకు తిరగడానికి మనకు టైమ్ ఉంటుంది కానీ.. ఇంట్లో ఉండే అమ్మానాన్నలతో కనీసం పది నిమిషాలు కూర్చుని మాట్లాడటానికి మాత్రం సమయం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలో తాను కూడా తప్పులు చేశానని ,అమ్మకు అన్ని సౌకర్యాలు కల్పించి, డబ్బు ఇస్తే సరిపోదని.. ఆమెతో కాసేపు సరదాగా మాట్లాడటమే అసలైన ప్రేమ అని చెప్పారు.
అందుకే కొన్నిసార్లు అర్ధరాత్రి అయినా సరే అమ్మ గదిలోకి వెళ్లి షూటింగ్ కబుర్లు, తన అనుభవాలు చెబుతుంటానని, తనకు అవి పూర్తిగా అర్థం కాకపోయినా కొడుకు తనతో మాట్లాడుతున్నాడన్న ఆనందం ఆమె కళ్లలో కనిపిస్తుందని అన్నారు.అమ్మానాన్నలు మనల్ని తిట్టినా, తినమని అడిగినా, నాన్న ఏదైనా ప్రశ్నించినా దాని వెనుక ఉండే ప్రేమను మనం అర్థం చేసుకోవాలని అన్నారు.
ఒకసారి అమెరికా షూటింగ్‌కు వెళ్లినప్పుడు టైమ్ తేడా వల్ల నెల రోజుల పాటు అమ్మతో సరిగ్గా మాట్లాడలేకపోయానని, ఆ సమయంలో ఆమె ఎంత బాధపడిందో గుర్తుచేసుకున్నారు. డబ్బుతో మనం ప్రపంచంలో ఏ వస్తువునైనా కొనుక్కోవచ్చు కానీ, తల్లిదండ్రులతో గడిపే విలువైన సమయాన్ని మాత్రం తిరిగి కొనలేమని హర్షవర్ధన్ చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి !
ALSO READ:75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!