workplace culture| కంపెనీ స్థాపించడం, బిజినెస్ ప్రారంభించడం, లాభాలు వచ్చేవరకు క్రమశిక్షణ, శ్రమపడే తత్వంతో ఓర్పు వహిస్తూ బిజినెస్ నిర్వహిస్తూ ఉండడం చాలా ముఖ్యం. అయితే ఒకే వ్యక్తి అన్ని పనులు చేయలేడు. అందుకే ఉద్యోగులను నియమించుకుంటాడు. ఏదైనా కంపెనీ విజయవంతంగా బిజినెస్ నిర్వహించడానికి నమ్మకమైన ఉద్యోగులు ముఖ్యం.
ఉద్యోగులు ఆఫీసులో సంతోషంగా ఉంటే అది వారికి మాత్రమే కాదు, కంపెనీ యజమాన్యానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తాజా నివేదిక చెబుతోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 నివేదిక ప్రకారం.. భారతదేశంలోని అత్యుత్తమ కార్యాలయాలుగా గుర్తింపు పొందిన సంస్థలు సాధారణ నిఫ్టీ 500 కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగిపై దాదాపు రెండింతల ఆదాయాన్ని పొందుతున్నాయి. ఉద్యోగులపై పెట్టుబడి పెట్టడం వ్యాపార వృద్ధికి కూడా సహాయపడుతుందని ఈ నివేదిక సూచిస్తోంది.
గతంలో చాలా కంపెనీలు ఉద్యోగుల సంతోషానికి ఆఫీస్ కల్చర్ పరిమితమని భావించేవి. వ్యాపార ఫలితాలతో దానికి సంబంధం లేదని అనుకునేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆఫీస్‌లో మంచి పని వాతావరణం ఉద్యోగుల ఉత్పాదకతను పెంచి కంపెనీ అభివృద్ధికి తోడ్పడుతుందని కంపెనీలు గుర్తిస్తున్నాయి.
ఒక్కో ఉద్యోగి ద్వారా కంపెనీ ఎంత ఆదాయం సంపాదిస్తుందో తెలిపే సూచికను “రెవెన్యూ పర్ ఎంప్లాయీ” అంటారు. ఇది సంస్థ పనితీరు, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నివేదిక ప్రకారం.. భారతదేశంలోని బెస్ట్ కంపెనీలు ఈ విషయంలో సగటు నిఫ్టీ 500 కంపెనీల కంటే దాదాపు రెండింతలు మెరుగైన ఫలితాలు సాధించాయి.
ఉద్యోగులు గౌరవం, గుర్తింపు పొందుతున్నామని భావిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారు. వారికి అనుకూలమైన పని వాతావరణం ఉంటే సంస్థ లక్ష్యాల సాధనలో చురుకుగా పాల్గొంటారు. దీని వల్ల కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.
ఉద్యోగులు తమ మేనేజ్‌మెంట్‌పై విశ్వసిస్తే కంపెనీకి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. నాయకులు తీసుకునే నిర్ణయాలపై నమ్మకం ఉన్న ఉద్యోగులు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారు. ఒక టీమ్‌గా కలిసి పనిచేసే కల్చర్ కూడా బలపడుతుంది.
Also Read: చాణక్య నీతి.. అప్పు తీసుకోవడం మీకు అలవాటుగా మారిందా? ఈ దురలవాటుకు అసలు మూలం అదే
నివేదిక ప్రకారం.. నాయకత్వంపై నమ్మకం ఉన్న సంస్థల్లో ఉత్పాదకత 47 శాతం పెరుగుతుంది. పనుల్లో వేగం, మార్పులకు అనుగుణంగా పనిచేసే సామర్థ్యం 56 శాతం మెరుగవుతుంది. వినియోగదారుల ఆదరణ 52 శాతం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు 34 శాతం వరకు అధికమవుతాయి.
ఉద్యోగుల మాటలను వినే కంపెనీల్లో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. గౌరవం, గుర్తింపు పొందిన ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరిస్తారు. సమస్యలకు త్వరగా పరిష్కారాలు కనుగొంటారు. మంచి సేవల ద్వారా సంస్థ ప్రతిష్ఠను కూడా పెంచుతారు.
Also Read: పాత బట్టలు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు.. పేదల్లా బతుకుతున్న ఈ కోటీశ్వరులు?
ప్రస్తుతం చాలా కంపెనీలు కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి అవసరమే అయినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం, ఆఫీస్ కల్చర్‌పై కూడా సమాన దృష్టి పెట్టాలని నివేదిక సూచిస్తోంది. ఉద్యోగి, యజమాన్యం మధ్య మంచి సంబంధాలు దీర్ఘకాల విజయానికి దోహదపడతాయి.
నేటి ఉద్యోగులు కేవలం మంచి జీతం మాత్రమే ఆశించరు. గౌరవం, సమానత్వం, సౌకర్యవంతమైన పని విధానం, అర్థవంతమైన ఉద్యోగం కూడా కోరుకుంటారు. ఈ అంచనాలను నెరవేర్చే సంస్థలు ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడమే కాకుండా వారిని ఎక్కువకాలం నిలబెట్టుకోగలుగుతాయి.
గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 నివేదిక ప్రకారం, కార్యాలయ సంస్కృతి ఇప్పుడు కేవలం హెచ్‌ఆర్ అంశం మాత్రమే కాదు. అది వ్యాపార విజయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఉద్యోగులను గౌరవించే, విశ్వాసాన్ని పెంపొందించే సంస్థలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.