Alert for SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆ లింకులను ఓపెన్ చేయకండి అంటూ.. తమ కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంక్ నుంచి మీకు రివార్డ్స్ వచ్చాయి.. ఇప్పుడే రివార్డులను క్లెయిమ్ చేసుకోండంటూ కస్టమర్లకు వచ్చిన మెసేజ్ లు వాట్సాప్ లో చక్కర్లు కొట్టాయి. ఆ లింకులపై క్లిక్ చేసి నష్టపోయామని పలువురు కస్టమర్లు బ్యాంకును ఆశ్రయించడంతో.. ఎస్బీఐ తన కస్టమర్లను ఈ మేరకు అప్రమత్తం చేసింది.
ఎస్బీఐ పేరుతో.. వాట్సాప్ లో రివార్డ్స్ పేరుతో మెసేజ్ లు వస్తున్నాయి. తమకు బాగా తెలిసిన నంబర్ల నుంచే మెసేజ్ లు రావడంతో నిజమేనని నమ్మి లింకులపై క్లిక్ చేసి పలువురు మోసపోయారు. మీకు ఎస్బీఐ నుంచి రూ.7250 రివార్డు వచ్చింది. ఈరోజే లాస్ట్. ఈ రివార్డును క్లెయిమ్ చేసుకునేందుకు ఈ రోజే ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని మీ రివార్డు నగదును పొందంటి అని మెసేజ్ లో ఉంటోంది. ఎస్బీఐ యోనో పేరుతో సైతం లింకులు వస్తున్నాయి.
ఈ మోసం ఎస్బీఐ దృష్టికి చేరడంతో.. కస్టమర్లను హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరుతో ఎలాంటి మెసేజ్ లు పంపడం లేదని తెలిపింది. ఎవరికీ ఎలాంటి లింకులు పంపడం లేదని, అలాంటి లింకులేమైనా వస్తే క్లిక్ చేయవద్దని, ఎలాంటి ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని తెలిపింది. అలాంటి లింకులతో వచ్చే ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లను ఇగ్నోర్ చేయాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.